కబడ్డీ మహిళల ప్రపంచకప్‌ విజేత భారత్‌  | Indian Kabaddi team crowned champions of Womens World Cup 2025 | Sakshi
Sakshi News home page

కబడ్డీ మహిళల ప్రపంచకప్‌ విజేత భారత్‌ 

Nov 25 2025 5:48 AM | Updated on Nov 25 2025 5:48 AM

Indian Kabaddi team crowned champions of Womens World Cup 2025

ఫైనల్లో చైనీస్‌ తైపీపై విజయం 

రెండోసారి ట్రోఫీ హస్తగతం 

ఢాకా: ప్రపంచకప్‌ మహిళల కబడ్డీ టోర్నమెంట్‌లో భారత జట్టు విజేతగా నిలిచింది. బంగ్లాదేశ్‌ వేదికగా జరిగిన మెగా టోర్నిలో రీతూ నేగి సారథ్యంలోని భారత జట్టు అజేయంగా ట్రోఫీ చేజిక్కించుకొని మట్టి ఆటలో మన ఆధిక్యాన్ని చాటింది. సోమవారం జరిగిన ఫైనల్లో డిఫెండింగ్‌ చాంపియన్‌ భారత జట్టు 35–28 పాయింట్ల తేడాతో చైనీస్‌ తైపీని చిత్తు చేసింది. 

మొత్తం 11 జట్లు పాల్గొన్న ఈ టోర్నీ సెమీఫైనల్లో పటిష్ట ఇరాన్‌ జట్టును మట్టికరిపించిన మన అమ్మాయిలు... ఫైనల్లోనూ అదే జోరు కొనసాగించారు. మ్యాచ్‌ ఆరంభం నుంచే ప్రత్యరి్థకి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా చెలరేగిన భారత జట్టు... అటు రైడింగ్, ఇటు ట్యాక్లింగ్‌లో ఆకట్టుకుంది. 2012లో భారత్‌ వేదికగా జరిగిన తొలి ప్రపంచకప్‌లో ఇరాన్‌పై గెలిచి చాంపియన్‌గా నిలిచిన టీమిండియా... ఇప్పుడు రెండో సారి ట్రోఫీ హస్తగతం చేసుకుంది. 

టోర్నీ ఆసాంతం రాణించిన భారత జట్టు... ఫైనల్లో చైనీస్‌ తైపీపై సంపూర్ణ ఆధిపత్యం కనబర్చింది. చక్కటి డిఫెన్స్‌తో పాటు... కీలక సమయాల్లో పాయింట్లు సాధిస్తూ పైచేయి కొనసాగించింది. కెపె్టన్‌ రీతూ నేగి అన్నీ తానై జట్టును నడిపించగా... వైస్‌ కెపె్టన్‌ పుష్ప తన రైడింగ్‌తో కట్టిపడేసింది. జట్టుకు అవసరమైనప్పుడల్లా పాయింట్లు సాధించి ట్రోఫీ కైవసం చేసుకోవడంలో ప్రధాన పాత్ర పోషించింది. హెడ్‌ కోచ్‌ తేజస్వి ఆధ్వర్యంలో బరిలోకి దిగిన టీమిండియా... చక్కటి సమన్వయం, సమష్టితత్వంతో కట్టిపడేసింది. 

తుది పోరు ఆరంభంలో చైనీస్‌ తైపీ గట్టి ప్రతిఘటన కనబర్చే ప్రయత్నం చేసింది. అయితే పట్టువదలని టీమిండియా మ్యాచ్‌ 13వ నిమిషంలో ప్రత్యరి్థని ఆలౌట్‌ చేసి 18–15తో ముందంజ వేసింది. ఈ దశలో భారత కెపె్టన్‌ రీతూ నేగి గాయపడటంతో ఉత్కంఠ పెరిగినా... ఎక్కడా ఒత్తిడికి గురికాని టీమిండియా ఆధిక్యాన్ని అంతకంతకూ పెంచుకుంటూ మ్యాచ్‌పై పట్టు సాధించి జగజ్జేతగా నిలిచింది. రీతూ, పుష్పతో పాటు చంపా ఠాకూర్, భావన ఠాకూర్, సాక్షి శర్మ భారత విజయాల్లో కీలకంగా వ్యవహరించారు. వరుసగా రెండోసారి ప్రపంచకప్‌ కైవసం చేసుకున్న భారత మహిళల జట్టుకు అన్నివైపుల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సహా రాజకీయ, క్రీడా, సినీ రంగ ప్రముఖులు భారత మహిళల విజయాన్ని శ్లాఘించారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement