ఐపీఎల్-2026 నుంచి తొలగించబడ్డ బంగ్లాదేశీ ఆటగాడు ముస్తాఫిజుర్ రహ్మాన్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ కాకపోతే పాకిస్తాన్ సూపర్ లీగ్ అని అంటున్నాడు. ముస్తాఫిజుర్ కేకేఆర్ కాంట్రాక్ట్‌ను బీసీసీఐ ఆదేశాలతో ఐపీఎల్ గవర్నింగ్ బాడీ రద్దు చేసిన తర్వాత ముస్తాఫిజుర్ పీఎస్‌ఎల్ డ్రాఫ్ట్‌లో తన పేరు నమోదు చేసుకున్నాడు. ముస్తాఫిజుర్ చివరిగా 2017-18 సీజన్‌లో పీఎస్‌ఎల్ ఆడాడు. ఆ సీజన్‌లో అతను లాహోర్ ఖలందర్స్‌కు ప్రాతినిథ్యం వహించాడు.
కాగా, ఐపీఎల్ 2026 వేలంలో ముస్తాఫిజుర్‌ను కేకేఆర్ రూ. 9.20 కోట్ల భారీ ధర వెచ్చించి సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే తదనంతర పరిణామాల్లో బంగ్లాదేశ్‌లో హిందూ మైనారిటీలపై దాడులు తీవ్రతరం కావడం.. ఈ నేపథ్యంలో బంగ్లాదేశీ ప్లేయర్ అయిన ముస్తాఫిజుర్‌ను ఐపీఎల్ నుంచి తొలిగించడం జరిగిపోయాయి.
ముస్తాఫిజుర్‌ను ఐపీఎల్ నుంచి తొలిగించడాన్ని అవమానంగా భావించిన బంగ్లాదేశ్ ప్రభుత్వం స్వదేశంలో ఐపీఎల్‌ను బ్యాన్ చేసింది. భారత్‌లో జరగాల్సిన టీ20 ప్రపంచకప్-2026 గ్రూప్ స్టేజీ మ్యాచ్‌లను శ్రీలంకకు మార్చాలని ఐసీసీని కోరింది.
ఐసీసీ నుంచి సరైన స్పందన లేకపోవడంతో తాజాగా తమ దేశానికి చెందిన అంపైర్లను ప్రపంచకప్‌కు పంపించబోమని అంటుంది. బంగ్లాదేశ్ తీసుకుంటున్న ఈ నిర్ణయాలు ప్రపంచ వేదికపై ఆ దేశ క్రికెట్ జట్టు భవితవ్యాన్ని ప్రశ్నార్థకంగా మారుస్తున్నాయి.


