భారత్-బంగ్లాదేశ్ మధ్య నెలకొన్న దౌత్యపరమైన ఉద్రిక్తతలు క్రీడా రంగంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఇప్పటికే ముస్తాఫిజుర్ రెహ్మాన్‌ను ఐపీఎల్ నుంచి తప్పించడంతో రగిలిపోతున్న బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుకు మరో భారీ షాక్ తగిలింది.
ప్రముఖ భారత క్రికెట్ పరికాల సంస్థ సాన్స్పరీల్స్ గ్రీన్లాండ్స్ (SG).. బంగ్లాదేశ్ క్రికెటర్లతో తన స్పాన్సర్‌షిప్ ఒప్పందాలను రద్దు చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. బంగ్లాదేశ్ టీ20 కెప్టెన్ లిట్టన్ దాస్, మాజీ కెప్టెన్ మోమినుల్ హక్, యాసిర్ అలీ వంటి స్టార్ ప్లేయర్లకు ఎస్‌జీనే స్పాన్సర్‌గా ఉంది.
ఇప్పుడు రెండు దేశాల మధ్య నెలకొన్న పరిణామాల నేపథ్యంలో తమ కాంట్రాక్ట్‌లను పొడిగించేందుకు ఎస్‌జీ సముఖత చూపలేదు. దీంతో బంగ్లాదేశ్ ఆటగాళ్లు తమకు అలవాటైన కస్టమ్-మేడ్ బ్యాట్లను కోల్పోవడమే కాకుండా భారీ ఆర్థిక నష్టాన్ని కూడా ఎదుర్కొనున్నారు.
అయితే దీనిపై ఇంకా ఎస్‌జీ నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ఒకవేళ ఇదే నిజమైతే బంగ్లాదేశ్ ఆటగాళ్లు ఇతర దేశాలకు చెందిన స్పాన్సర్లను వెతుక్కోవాల్సి ఉంటుంది. అదేవిధంగా మరో భారత దిగ్గజ సంస్థ ఎస్‌ఎస్ కూడా ఎస్‌జీ బాటలో నడిచే అవకాశం ఉంది. ముష్ఫికర్ రహీమ్, సబ్బీర్ రెహమాన్, నాసిర్ హొస్సేన్ వంటి స్టార్ ఆటగాళ్లకు ఎస్‌ఎస్ స్పాన్సర్ ఉంది.
కాగా ఈ వివాదం కోల్‌కతా నైట్‌రైడర్స్ తమ జట్టు నుంచి ముస్తాఫిజుర్ రెహ్మన్‌ను విడుదల చేయడంతో మొదలైంది. ఐపీఎల్-2026 వేలంలో ముస్తాఫిజుర్‌ను రూ.9.20 కోట్ల భారీ ధరకు కేకేఆర్ కొనుగోలు చేసింది. అయితే ఆ తర్వాత బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులు పెరిగిపోవడంతో ముస్తాఫిజుర్‌ను జట్టులోకి తీసుకున్నందుకు కేకేఆర్‌పై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి.
ఈ క్రమంలో రంగంలోకి దిగిన బీసీసీఐ ముస్తాఫిజుర్‌ను జట్టు నుంచి రీలీజ్ చేయాలని కేకేఆర్‌ను అదేశించింది. దీంతో అతడిని కేకేఆర్ విడుదల చేసింది. ఆ తర్వాత భారత్‌లో భద్రతా కారణాలను సాకుగా చూపుతూ, వరల్డ్‌కప్‌లో తమ మ్యాచులను శ్రీలంకకు మార్చాలని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ఐసీసీని కోరింది.
బీసీబీ అభ్యర్థనను ఐసీసీ తిరస్కరించింది. షెడ్యూల్ ప్రకారం భారత్‌కు వచ్చి ఆడకపోతే పాయింట్లను కోల్పోవాల్సి ఉంటుందని హెచ్చరించినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా బంగ్లాదేశ్ ప్రభుత్వం తమ దేశంలో ఐపీఎల్ ప్రసారాలను సైతం బ్యాన్ చేసింది.
చదవండి: IND vs NZ: తిలక్ వర్మ స్థానంలో జట్టులోకి అతడు!


