ఇంగ్లండ్ ఫుట్‌బాల్ దిగ్గజం డేవిడ్ బెక్‌హామ్ దంపతులకు చేదు అనుభవం ఎదురైంది. కన్న కొడుకే వారికి లీగల్ నోటీసులు పంపించినట్లు సమాచారం. సోషల్ మీడియాలో ఇంకోసారి తనను ట్యాగ్ చేస్తే చట్టపరంగా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని సందేశం పంపినట్లు తెలుస్తోంది.
కాగా మాజీ పాప్ స్టార్ విక్టోరియా ఆడమ్స్‌ను ప్రేమించి డేవిడ్ బెక్‌హామ్ (David Beckham) 1999లో ఆమెను పెళ్లి చేసుకున్నాడు. ఈ జంటకు ముగ్గురు కుమారులు బ్రూక్లిన్ బెక్‌హామ్ (Brooklyn Beckham), రోమియో బెక్‌హామ్, క్రూజ్ బెక్‌హామ్.. కూతురు హార్పర్ సెవెన్ బెక్‌హామ్ సంతానం. వీరిలో పెద్దవాడైన బ్రూక్లిన్ మోడల్, చెఫ్, ఫొటోగ్రాఫర్‌గా అదృష్టం పరీక్షించుకుంటున్నాడు.
పెళ్లైన నాటి నుంచి విభేదాలు
బ్రూక్లిన్... అమెరికాకు చెందిన బిలియనీర్ కుమార్తె, నటి నికోలా పెల్ట్జ్‌ను 2022లో పెళ్లి చేసుకున్నాడు. పెళ్లైన నాటి నుంచి బ్రూక్లిన్‌కు తల్లిదండ్రులు డేవిడ్- విక్టోరియాలతో విభేదాలు తలెత్తాయి. ఇందుకు నికోలా వెడ్డింగ్ గౌనులో మార్పే కారణం అని సమాచారం.

ఈ క్రమంలో భార్య వైపు మొగ్గు చూపిన బ్రూక్లిన్.. తల్లిదండ్రులను దూరం పెట్టినట్లు తెలుస్తోంది. భార్యతో కలిసి అతడు అమెరికాలో నివసిస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే డేవిడ్ బెక్‌హామ్ 50వ పుట్టినరోజు వేడుకలకు కూడా అతడు హాజరుకాలేదు. అంతేకాదు తండ్రి ‘సర్’ బిరుదును అందుకున్న వేళా అతడు అక్కడ లేడు.
నిన్ను మిస్ అవుతున్నాం
అయితే, డేవిడ్- విక్టోరియా దంపతులు మాత్రం సోషల్ మీడియా పోస్టులలో బ్రూక్లిన్‌ను ట్యాగ్ చేస్తూ.. ‘నిన్ను మిస్ అవుతున్నాం’ అంటూ క్యాప్షన్లు పెట్టారు. బ్రూక్లిన్‌కు ఇది ఎంతమాత్రం నచ్చలేదని తెలుస్తోంది. తనతో ఇకపై లాయర్ల ద్వారానే మాట్లాడాల్సి ఉంటుందని ఇప్పటికే తల్లిదండ్రులకు అతడు ఓ లేఖ రాసినట్లు సమాచారం.
ఈ క్రమంలో ఇటీవల బ్రూక్లిన్‌కు సంబంధించిన చికెన్ రోస్ట్ వీడియోను తల్లి విక్టోరియా లైక్ చేయడంతో.. అతడికి కోపం వచ్చిందట. దీంతో తల్లిదండ్రులతో పాటు తోబుట్టువులందరినీ బ్రూక్లిన్ బ్లాక్ చేశాడు. తాజాగా ఇకపై సోషల్ మీడియాలో తనను ట్యాగ్ చేయవద్దంటూ లాయర్ల ద్వారా నోటీసులు ఇచ్చినట్లు వార్తలు వచ్చాయి.
తనతో మాట్లాడవద్దంటూ
బెక్‌హామ్ కుటుంబ సన్నిహిత వర్గాలు.. ‘ది సన్ యూఎస్’తో మాట్లాడుతూ.. ‘‘ఈ కుటుంబం విచ్ఛిన్నం కావడానికి గల అసలు కారణమేంటో ఇప్పటికీ ఎవరికీ తెలియదు. బ్రూక్లిన్ తన తల్లిదండ్రులను బ్లాక్ చేశాడు. తనతో మాట్లాడవద్దంటూ ఇటీవల ఓ లేఖ పంపాడు.
అయినా సరే సోషల్ మీడియాలో తనను ట్యాగ్ చేస్తున్నారనే కోపంతో తాజాగా నోటీసులు పంపాడు. పబ్లిక్‌గా కాకుండా ప్రైవేటుగానే తల్లిదండ్రులతో తేల్చుకోవాలని అతడు నిర్ణయించుకున్నాడు. అయితే, డేవిడ్- విక్టోరియా తన మాటను ఖాతరు చేయలేదని భావించి చట్టపరంగా ముందుకు వెళ్తున్నాడు.
డేవిడ్- విక్టోరియా మాత్రం తమ పెద్ద కుమారుడి కోసం ఇంకా తలుపులు తెరిచే ఉంచారు. అయితే, ఈ పరిణామాలు వారిని తీవ్రంగా కలచివేశాయి. మున్ముందు ఏం జరుగుతుందోనని కుమారుడి విషయంలో వారు ఆందోళన చెందుతున్నారు’’ అని పేర్కొన్నాయి.


