- తొలి ఇన్నింగ్స్‌లో 201 ఆలౌట్
- మార్కో యాన్సెన్‌కు 6 వికెట్లు
- దక్షిణాఫ్రికాకు 288 పరుగుల భారీ ఆధిక్యం
- రెండో ఇన్నింగ్స్‌లో 26/0
- టీమిండియా చేజారుతున్న రెండో టెస్టు, సిరీస్
‘కోల్‌కతాతో పోలిస్తే ఇక్కడి పిచ్ రోడ్డులా, బ్యాటింగ్‌కు బాగా అనుకూలంగా ఉంది... కాబట్టి మా బౌలర్లు ప్రభావం చూపలేకపోయారు’... ఆదివారం దక్షిణాఫ్రికాను కట్టడి చేయడంలో విఫలమైన తర్వాత భారత బౌలర్ కుల్దీప్ యాదవ్ చేసిన వ్యాఖ్య ఇది. అదే పిచ్ సోమవారానికి వచ్చే సరికి బౌలింగ్‌కు అనుకూలించింది. ఫలితంగా భారత బ్యాటర్లంతా చేతులెత్తేశారు.
రెండో రోజు బ్యాటింగ్‌తో దెబ్బ కొట్టిన మార్కో యాన్సెన్ మూడో రోజు తన బౌలింగ్ పదునుతో ఏకంగా ఆరు వికెట్లు తీసి టీమిండియాను కుప్పకూల్చాడు. అతని ‘షార్ట్’ బంతులను ఆడలేక బ్యాటర్లు వరుసగా పెవిలియన్‌కు చేరడంతో భారత్ భారీ ఆధిక్యం కోల్పోయింది. ఇప్పటికే సఫారీలు పట్టు బిగించగా...ఓటమి వెంటాడుతుండగా ఏడాది వ్యవధిలో స్వదేశంలో రెండో సిరీస్ కోల్పోయే ప్రమాదంలో మన జట్టు నిలిచింది.
గువహటి: దక్షిణాఫ్రికా చేతిలో రెండో టెస్టులోనూ భారత్ ఓటమికి చేరువవుతోంది. తొలి ఇన్నింగ్స్‌లో 288 పరుగుల భారీ ఆధిక్యం సాధించిన దక్షిణాఫ్రికా భారత్‌కు ఫాలోఆన్ ఇవ్వకుండా రెండో ఇన్నింగ్స్ బరిలోకి దిగింది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి జట్టు 8 ఓవర్లలో వికెట్ కోల్పోకుండా 26 పరుగులు చేసింది. రికెల్టన్ (13 బ్యాటింగ్), మార్క్‌రమ్ (12 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు.
ఇప్పటికే 314 పరుగులు ముందంజలో ఉన్న జట్టు రెండో ఇన్నింగ్స్‌లో మరిన్ని పరుగులు జోడించి భారత్‌కు సవాల్ విసిరేందుకు సిద్ధమైంది. ఓవర్‌నైట్ స్కోరు 9/0తో సోమవారం ఆట కొనసాగించిన భారత్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 83.5 ఓవర్లలో 201 పరుగులకే ఆలౌటైంది. యశస్వి జైస్వాల్ (97 బంతుల్లో 58; 7 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీ సాధించగా, వాషింగ్టన్ సుందర్ (92 బంతుల్లో 48; 2 ఫోర్లు, 1 సిక్స్) రాణించాడు. మార్కో యాన్సెన్ (6/48) చెలరేగిపోగా, హార్మర్‌కు 3 వికెట్లు దక్కాయి.
టపటపా...
ఓపెనర్లు జైస్వాల్, కేఎల్ రాహుల్ (22) తొలి గంటలో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడుతూ పరుగులు రాబట్టారు. అయితే మహరాజ్ చక్కటి బంతితో రాహుల్‌ను వెనక్కి పంపడంతో జట్టు తొలి వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత 85 బంతుల్లో జైస్వాల్ అర్ధసెంచరీ పూర్తయింది. ఒక దశలో భారత్ 95/1తో మెరుగైన స్థితిలో కనిపించింది. సఫారీల చక్కటి బౌలింగ్‌తో పాటు మన బ్యాటర్ల చెత్త షాట్లు జట్టు పరిస్థితిని ఇబ్బందికరంగా మార్చాయి.
27 పరుగుల వ్యవధిలో టీమ్ 6 వికెట్లు చేజార్చుకుంది. అయితే చక్కటి షాట్లతో దూసుకుపోతున్న జైస్వాల్ ఆటకు యాన్సెన్ క్యాచ్‌తో తెరపడగా, సాయి సుదర్శన్ (15) విఫలమయ్యాడు. ఇలాంటి స్థితిలో యాన్సెన్ బౌలింగ్ జోరు మొదలైంది. వరుసగా జురేల్ (0), పంత్ (7), నితీశ్ రెడ్డి (10), జడేజా (6)లను అతను వెనక్కి పంపించాడు. వీటిలో పంత్ మినహా మిగతా ముగ్గురు బౌన్సర్లకే వెనుదిరిగారు! పంత్ మాత్రం ముందుకు దూసుకొచ్చి భారీ షాట్ ఆడబోయి కీపర్‌కు క్యాచ్ ఇచ్చాడు.
కీలక భాగస్వామ్యం...
122/7 వద్ద భారత ఇన్నింగ్స్ ముగిసేందుకు ఎంతో సేపు పట్టదనిపించింది. అయితే గత మ్యాచ్ తరహాలోనే సుందర్ మరో చక్కటి ఇన్నింగ్స్ ఆడగా, అనూహ్యంగా కుల్దీప్ యాదవ్ (19) కూడా పట్టుదలగా క్రీజ్‌లో నిలబడి సహకరించాడు. పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలమని ముందు రోజు చెప్పిన కుల్దీప్ నిజంగానే క్రీజ్‌లో ఎలా నిలబడాలో ఆడి చూపిస్తూ ఇన్నింగ్స్‌లో అందరికంటే ఎక్కువగా 134 బంతులు ఎదుర్కోవడం విశేషం!
ఈ జోడీ ఏకంగా 34.4 ఓవర్లు ఆడి ప్రధాన బ్యాటర్లకు పాఠం నేరి్పంది. వీరిద్దరు ఎనిమిదో వికెట్‌కు 72 పరుగులు జత చేయడంతో కాస్త పరువు నిలిచింది. సుందర్‌ను అవుట్ చేసి హార్మర్ ఈ జంటను విడదీయగా... తర్వాతి రెండు వికెట్లు యాన్సెన్ ఖాతాలోనే చేరాయి. 6.82 అడుగుల ఎత్తు ఉన్న యాన్సెన్ షార్ట్ బంతులను సమర్థంగా వాడుకోగా, మన బ్యాటర్లు ఆ వలలో పడ్డారు.
స్కోరు వివరాలు
దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్ 489; భారత్ తొలి ఇన్నింగ్స్: జైస్వాల్ (సి) యాన్సెన్ (బి) హార్మర్ 58; రాహుల్ (సి) మార్క్‌రమ్ (బి) మహరాజ్ 22; సుదర్శన్ (సి) రికెల్టన్ (బి) హార్మర్ 15; జురేల్ (సి) మహరాజ్ (బి) యాన్సెన్ 0; పంత్ (సి) వెరీన్ (బి) యాన్సెన్ 7; జడేజా (సి) మార్క్‌రమ్ (బి) యాన్సెన్ 6; నితీశ్ రెడ్డి (సి) మార్క్‌రమ్ (బి) యాన్సెన్ 10; సుందర్ (సి) మార్క్‌రమ్ (బి) హార్మర్ 48; కుల్దీప్ (సి) మార్క్‌రమ్ (బి) యాన్సెన్ 19; బుమ్రా (సి) వెరీన్ (బి) యాన్సెన్ 5; సిరాజ్ (నాటౌట్) 2; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (83.5 ఓవర్లలో ఆలౌట్) 201.
వికెట్ల పతనం: 1–65, 2–95, 3–96, 4–102, 5–105, 6–119, 7–122, 8–194, 9–194, 10–201.
బౌలింగ్: యాన్సెన్ 19.5–5–48–6, ముల్డర్ 10–5–14–0, మహరాజ్ 15–1–39–1, హార్మర్ 27–6–64–3, మార్క్‌రమ్ 10–1–26–0, ముత్తుసామి 2–0–2–0.
5: తొలి ఇన్నింగ్స్‌లో ఫీల్డర్‌గా ఎయిడెన్ మార్క్‌రమ్ పట్టిన క్యాచ్‌ల సంఖ్య. గతంలో ఈ ఫీట్ నమోదు చేసిన 15 మంది సరసన అతను చేరగా... దక్షిణాఫ్రికా తరఫున
గ్రేమ్ స్మిత్ తర్వాత ఈ ఘనత సాధించిన రెండో ఆటగాడిగా నిలిచాడు.


