సౌతాఫ్రికాతో రెండో టెస్టులో టీమిండియా (IND vs SA 2nd Test) చెత్త ప్రదర్శనతో విమర్శలు మూటగట్టుకుంటోంది. గువాహటి వేదికగా తొలుత భారత బౌలర్లు తేలిపోగా.. బ్యాటర్లు కూడా తామేం తక్కువ కాదన్నట్లు పెవిలియన్‌కు క్యూ కట్టారు. వెరసి ఈ మ్యాచ్‌లో టీమిండియా ఫాలో ఆన్ ఆడాల్సిన దుస్థితిలో నిలిచింది.
అయితే, సఫారీ జట్టు కెప్టెన్ తెంబా బవుమా (Temba Bavuma) మాత్రం తాము బ్యాటింగ్ చేయాలనే నిర్ణయం తీసుకోవడంతో భారత శిబిరం ఊపిరి పీల్చుకుంది. ఫాలో ఆన్ గండం తప్పించుకుంది. కాగా రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా కోల్‌కతా వేదికగా తొలి టెస్టులో సౌతాఫ్రికా చేతిలో భారత జట్టు ఓటమిపాలైన విషయం తెలిసిందే.
ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య శనివారం గువాహటిలో రెండో టెస్టు మొదలైంది. బర్సపరా స్టేడియం తొలిసారి టెస్టు మ్యాచ్‌కు ఆతిథ్యం ఇస్తుండగా.. ఈ వేదికపై టాస్ గెలిచిన సౌతాఫ్రికా తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది.
శతక్కొట్టిన ముత్తుస్వామి.. సెంచరీ మిస్ అయిన యాన్సెన్
ప్రొటిస్ ఓపెనర్లు ఐడెన్ మార్క్రమ్ (38), ర్యాన్ రికెల్టన్ (35) మెరుగైన ఆరంభం అందించగా.. ట్రిస్టన్ స్టబ్స్ (49), కెప్టెన్ తెంబా బవుమా (41) దానిని కొనసాగించారు. అయితే, ఊహించని రీతిలో సఫారీ స్పిన్నర్ సెనూరన్ ముత్తుస్వామి (Senuran Muthusamy) బ్యాట్‌తో చెలరేగిపోయాడు.
భారత బౌలర్లకు చుక్కలు చూపిస్తూ 206 బంతుల్లో 109 పరుగులు సాధించాడు. ముత్తుస్వామి శతకానికి తోడు... వికెట్ కీపర్ బ్యాటర్ కైలీ వెరెన్నె 45 పరుగులతో సత్తా చాటగా.. ఆల్‌రౌండర్ మార్కో యాన్సెన్ 91 బంతుల్లోనే 93 పరుగులతో దుమ్ములేపాడు. మిగతా వారిలో టోనీ డి జోర్జి (28) ఫర్వాలేదనిపించాడు. ఫలితంగా సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 489 పరుగుల భారీ స్కోరు సాధించింది.
జైసూ హాఫ్ సెంచరీ
భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ నాలుగు వికెట్లు తీయగా.. బుమ్రా, సిరాజ్, రవీంద్ర జడేజా తలా రెండు వికెట్లు తీశారు. అనంతరం తమ తొలి ఇన్నింగ్స్ మొదలుపెట్టిన టీమిండియాకు ఓపెనర్లు యశస్వి జైస్వాల్ (58), కేఎల్ రాహుల్ (22) మెరుగైన ఆరంభమే అందించారు. కానీ మిడిలార్డర్ మాత్రం సఫారీ బౌలర్ల ధాటికి తాళలేక కుప్పకూలింది.
అంతా ఫెయిల్.. వాషీ ఒక్కడే..
వన్‌డౌన్ బ్యాటర్ సాయి సుదర్శన్ (15), ధ్రువ్ జురెల్ (0), కెప్టెన్ రిషభ్ పంత్ (7), రవీంద్ర జడేజా (6), నితీశ్ కుమార్ రెడ్డి (10) దారుణంగా విఫలమయ్యారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ (92 బంతుల్లో 48) నిలకడగా ఆడుతూ ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేయగా.. యాన్సెన్ మంచి డెలివరీతో అతడిని పెవిలియన్‌కు పంపాడు.
ఇక వాషీకి తోడుగా పట్టుదలగా క్రీజులో నిలబడ్డ కుల్దీప్ యాదవ్ (134 బంతుల్లో 19)ను కూడా వెనక్కి పంపిన యాన్సెన్.. బుమ్రా (5)ను కూడా అవుట్ చేసి టీమిండియా ఇన్నింగ్స్‌కు ముగింపు పలికాడు. తొలి ఇన్నింగ్స్‌లో 83.5 ఓవర్లలో టీమిండియా కేవలం 201 పరుగులు చేసి ఆలౌట్ అయింది. సౌతాఫ్రికా బౌలర్లలో యాన్సెన్ ఆరు వికెట్లతో చెలరేగగా.. సైమన్ హార్మర్ మూడు, కేశవ్ మహరాజ్ ఒక వికెట్ దక్కించుకున్నారు.
కాగా టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో.. సౌతాఫ్రికా కంటే 288 పరుగులు వెనుకబడి ఉంది. దీంతో అభిమానులు టీమిండియాపై ఫైర్ అవుతున్నారు. ఇంత చెత్త బ్యాటింగ్ ఏంటయ్యా? అంటూ పంత్ సేనపై సోషల్ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
చదవండి: IND vs SA: పంత్‌ను కాదని రాహుల్‌కు కెప్టెన్సీ.. కారణమిదే?


