గువహటి వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా ఆట తీరు ఏ మాత్రం మారలేదు. తొలుత బౌలింగ్‌లో విఫలమైన భారత్.. ఇప్పుడు బ్యాటింగ్‌లో కూడా అదే ఫలితాన్ని రిపీట్ చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 123 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.
9/0 ఓవర్ నైట్ స్కోర్‌తో మూడో రోజు ఆట ప్రారంభించిన టీమిండియా రాహుల్(22), జైశ్వాల్(58) శుభారంభం అందించారు. తొలి వికెట్‌కు 65 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. రాహుల్ ఔటయ్యాక టాప్ ఆర్డర్ ఒక్కసారిగా కుప్పకూలింది. సాయిసుదర్శన్(15), ధ్రువ్ జురెల్(0) వరుస ఓవర్లలో పెవిలియన్‌కు చేరారు.
పంత్‌పై విమర్శలు..
ఈ సమయంలో క్రీజులోకి వచ్చిన కెప్టెన్ రిషబ్ పంత్ బాధ్యత రహితంగా ఆడాడు. కష్టాల్లో పడిన జట్టును ఆదుకోవాల్సింది పోయి ర్యాష్ షాట్ ఆట ఆడి తన వికెట్‌ను కోల్పోయాడు. భారత్ ఇన్నింగ్స్ 38 ఓవర్ వేసిన సఫారీ స్పీడ్ స్టార్ మార్కో జాన్సెసన్.. రెండో బంతిని ఆఫ్ స్టంప్ దిశగా షార్ట్ ఆఫ్ గుడ్ లెంగ్త్ డెలివరీగా సంధించాడు.
ఈ క్రమంలో పంత్ క్రీజ్ నుంచి ముందుకు వచ్చి స్లాగ్ షాట్ కోసం ప్రయత్నించాడు. కానీ బంతి బ్యాట్ ఎడ్జ్ తీసుకుని వికెట్ కీపర్ చేతికి వెళ్లింది. వెంటనే సౌతాఫ్రికా ఆటగాళ్లు సంబరాల్లో మునిగిపోయారు. కానీ పంత్ మాత్రం రివ్యూకు వెళ్లడం అందరిని ఆశ్చర్యపరిచింది.
క్లియర్‌గా ఎడ్జ్ తాకిందని తెలిసి మరి పంత్ రివ్యూ వృథా చేశాడు. రిప్లేలో భారీ ఎడ్జ్ తీసుకున్నట్లు తేలింది. దీంతో కేవలం 7 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. ఈ క్రమంలో పంత్‌ను నెటిజన్లు దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. జట్టు క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆ షాట్ అవసరమా అంటూ పోస్ట్‌లు పెడుతున్నారు.
కాగా 55 ఓవర్లు ముగిసే సరికి భారత్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 7 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది. సౌతాఫ్రికా కంటే 342 పరుగులు వెనకబడి ఉంది. ఫాల్ ఆన్ గండం తప్పించుకోవాలంటే టీమిండియా ఇంకా 142 పరుగులు కావాలి. ప్రస్తుతం క్రీజులో వాషింగ్టన్ సుందర్(23), కుల్దీప్ యాదవ్(3) ఉన్నారు.
చదవండి: IND vs SA: పంత్‌ను కాదని రాహుల్‌కు కెప్టెన్సీ.. కారణమిదే?


