సౌతాఫ్రికా ఆల్‌రౌండర్ మార్కో యాన్సెన్ (Marco Jansen) సరికొత్త చరిత్ర సృష్టించాడు. టీమిండియాతో టెస్టు మ్యాచ్‌లో అర్ధ శతకం బాదడంతో పాటు.. ఆరు వికెట్లు తీసిన తొలి ప్రొటిస్ ఆటగాడిగా నిలిచాడు. గువాహటి టెస్టు సందర్భంగా యాన్సెన్ ఈ ఘనత సాధించాడు.
ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2025-27 (WTC)లో భాగంగా రెండు టెస్టులు ఆడేందుకు సౌతాఫ్రికా భారత్ పర్యటనకు వచ్చింది. కోల్‌కతా వేదికగా తొలి టెస్టులో 30 పరుగుల తేడాతో గెలిచిన సఫారీలు.. రెండో టెస్టులోనూ పట్టు బిగించారు.
సెంచరీ.. జస్ట్ మిస్
బర్సపరా స్టేడియంలో శనివారం మొదలైన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసింది సౌతాఫ్రికా. తొలి ఇన్నింగ్స్‌లో 489 పరుగుల భారీ స్కోరు సాధించి ఆలౌట్ అయింది. ఇందులో టెయిలెండర్లు సెనూరన్ ముత్తుస్వామి (Senuran Muthusamy), మార్కో యాన్సెన్‌లది కీలక పాత్ర. ముత్తుస్వామి శతకం (109)తో సత్తా చాటగా.. యాన్సెన్ (91 బంతుల్లో 93) సెంచరీకి ఏడు పరుగుల దూరంలో నిలిచిపోయాడు.
ఆరు వికెట్లు పడగొట్టి
ఇక ప్రొటిస్ తొలి ఇన్నింగ్స్‌లో బ్యాట్‌తో చెలరేగిన యాన్సెన్.. టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో బంతితోనూ దుమ్ములేపాడు. భారత్‌ను 201 పరుగులకే ఆలౌట్ చేయడంలో కీలక పాత్ర పోషించాడు. ధ్రువ్ జురెల్ (0), కెప్టెన్ రిషభ్ పంత్ (7), రవీంద్ర జడేజా (6), నితీశ్ కుమార్ రెడ్డి (10) రూపంలో కీలక బ్యాటర్లను అవుట్ చేశాడు ఈ పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్.
అదే విధంగా.. కుల్దీప్ యాదవ్ (19), జస్‌ప్రీత్ బుమ్రా (5)లను వెనక్కి పంపి.. భారత జట్టు ఇన్నింగ్స్‌కు ముగింపు పలికాడు. ఇలా మొత్తంగా ఆరు వికెట్లు కూల్చి టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్ పతనాన్ని శాసించాడు యాన్సెన్.
ఈ క్రమంలోనే పాతికేళ్ల యాన్సెన్ అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. టీమిండియాతో టెస్టు మ్యాచ్‌లో అర్ధ శతకం చేయడంతో పాటు.. ఒకే ఇన్నింగ్స్‌లో ఆరు వికెట్లు కూల్చిన తొలి సౌతాఫ్రికా క్రికెటర్‌గా చరిత్రకెక్కాడు. అంతేకాదు.. భారత్‌లో టెస్టు మ్యాచ్‌లో అత్యుత్తమ గణాంకాలు (6/48) నమోదు చేసిన విదేశీ లెఫ్టార్మ్ పేసర్ల జాబితాలోనూ యాన్సెన్ చేరాడు.
పట్టు బిగించిన సౌతాఫ్రికా
టీమిండియాతో రెండో టెస్టులో సౌతాఫ్రికా పట్టు బిగించింది. తొలి ఇన్నింగ్స్‌లో 489 పరుగుల భారీ స్కోరు సాధించిన సఫారీలు.. భారత్‌ను 201 పరుగులకే ఆలౌట్ చేశారు. ఫలితంగా 288 పరుగుల భారీ ఆధిక్యం సంపాదించారు.
ఈ నేపథ్యంలో టీమిండియాను ఫాలో ఆన్ ఆడిస్తారనుకుంటే.. ప్రొటిస్ కెప్టెన్ తెంబా బవుమా ఊహించని నిర్ణయం తీసుకున్నాడు. తామే రెండో ఇన్నింగ్స్ మొదలుపెడతామని చెప్పాడు. ఈ క్రమంలో సోమవారం నాటి మూడో రోజు ఆట ముగిసే సరికి ఎనిమిది ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 26 పరుగులు చేసింది.
ఓపెనర్లు ర్యాన్ రికెల్టన్ 13, ఐడెన్ మార్క్రమ్ 12 పరుగులతో క్రీజులో నిలిచారు. ఫలితంగా మూడో రోజు ముగిసేసరికి సౌతాఫ్రికా టీమిండియాపై తొలి ఇన్నింగ్స్‌లో ఓవరాల్‌గా 314 పరుగుల ఆధిక్యం సంపాదించింది.
చదవండి: మరీ ఇంత చెత్తగా ఆడతారా?.. టీమిండియా ఆలౌట్.. ఫ్యాన్స్ ఫైర్


