భారత మహిళా జట్టు స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన (Smriti Mandhana) పేరు గత కొన్నాళ్లుగా వార్తల్లో నిలుస్తోంది. వన్డే ప్రపంచకప్-2025లో భారత్ విజేతగా నిలవడంలో బ్యాటర్‌గా, వైస్ కెప్టెన్‌గా తన వంతు పాత్ర పోషించిన ఈ మహారాష్ట్ర అమ్మాయి.. ఆ వెనువెంటనే మరో శుభవార్త పంచుకుంది.
నిశ్చితార్థపు ఉంగరాన్ని చూపిస్తూ..
తన చిరకాల స్నేహితుడు, సంగీత దర్శకుడు పలాష్ ముచ్చల్ (Palash Mucchal)తో పెళ్లి బంధంలో అడుగుపెట్టనున్నట్లు ఇటీవలే స్మృతి మంధాన ధ్రువీకరించింది. నిశ్చితార్థపు ఉంగరాన్ని చూపిస్తూ.. సహచర ఆటగాళ్లు జెమీమా రోడ్రిగ్స్, అరుంధతి రెడ్డి, శ్రేయాంక పాటిల్, రాధా యదవ్‌లతో కలిసి తన ఎంగేజ్‌మెంట్ విషయాన్ని రీల్ ద్వారా రివీల్ చేసింది.
అనంతరం పలాష్.. భారత్ విశ్వవిజేతగా నిలిచిన డీవై పాటిల్ స్టేడియంలో మోకాళ్లపై కూర్చుని స్మృతికి ప్రపోజ్ చేశాడు. ఈ రెండు వీడియోలను తన సోషల్ మీడియాలో అకౌంట్లో షేర్ చేసి మురిసిపోయింది మంధాన. అయితే, ప్రస్తుతం వాటిని స్మృతి మంధాన తన అకౌంట్ నుంచి డిలీట్ చేసినట్లు తెలుస్తోంది.
గుండెపోటు లక్షణాలతో ఆస్పత్రిలో..
కాగా స్మృతి- పలాష్ పెళ్లి ముందస్తు వేడుకలు ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. హల్దీ, మెహందీ, సంగీత్ వేడుకల్లో కుటుంబ సభ్యులతో కలిసి ఈ జంట ఉత్సాహంగా గడిపింది. అయితే, ఆదివారం వీరి వివాహం జరగడానికి కొన్ని గంటల ముందు స్మృతి తండ్రి శ్రీనివాస్ మంధాన ఛాతీ నొప్పితో ఆస్పత్రిలో చేరారు. ఆయనకు గుండెపోటు లక్షణాలు ఉండటంతో వైద్యులు ఆ మేరకు చికిత్స అందిస్తున్నారు.
ఆ వీడియోలన్నీ డిలీట్ చేసిన మంధాన
ఆ వెంటనే పలాష్ ముచ్చల్ కూడా వైరల్ ఇన్‌ఫెక్షన్, ఎసిడిటీతో ఆస్పత్రిలో చేరాడు. ఈ పరిణామాల నేపథ్యంలో తన ప్రీవెడ్డింగ్ మూమెంట్స్‌ను స్మృతి మంధాన సోషల్ మీడియా నుంచి తీసివేయడం గమనార్హం. ఇదిలా ఉంటే.. మంధాన తండ్రి ఇంకా ఆస్పత్రిలోనే ఉండగా.. పలాష్ మాత్రం డిశ్చార్జ్ అయ్యాడు.
కాగా పరిస్థితులు చక్కబడ్డ తర్వాత స్మృతి మళ్లీ తన ఎంగేజ్‌మెంట్ రివీల్, ప్రపోజల్ వీడియోలు షేర్ చేస్తుందని అభిమానులు అంటున్నారు. తండ్రి ఆరోగ్యం దృష్ట్యానే వాటిని తాత్కాలికంగా హైడ్ చేసిందని అభిప్రాయపడుతున్నారు. స్మృతి- పలాష్ లాంటి చూడచక్కని జంటకు ఎవరి దిష్టి తగలవద్దని.. త్వరలోనే వారు పెళ్లి పీటలు ఎక్కాలని ఆకాంక్షిస్తున్నారు.
చదవండి: అసలు సెన్స్ ఉందా?.. ఎనిమిదో స్థానంలో ఆడిస్తారా?!: రవిశాస్త్రి ఫైర్


