భారత మహిళా క్రికెటర్ స్మృతి మంధాన తండ్రికి అస్వస్థతగా ఉండటంతో ఉన్నపళంగా పెళ్లిని వాయిదా వేసుకున్న సంగతి తెలిసిందే. అయితే వైద్యులు ఆమె తండ్రి శ్రీనివాస్ మంధానాకు గుండెపోటుని పోలిన లక్షణాలు ఉన్నట్లు వెల్లడించారు. ఎడమ వైపు ఛాతీ నొప్పి, రక్త పోటుపెరగడం వంటివి గుండెపోటుకి సంకేతమని, తక్షణమే యాంజియోగ్రఫీ అవసరమని వైద్యులు భావిస్తున్నారు. అసలు ఇలా ఆకస్మికంగా ఈ లక్షణాలు ఎలా వస్తాయి, ఎందువల్ల ఇలా జరుగుతుంది, యాంజియోగ్రఫీ అంటే..వంటి వాటి గురించి సవివరంగా చూద్దామా..!.
స్మృతి తండ్రి శ్రీనివాస్ మంధానకు ఎడమవైపు ఛాతినొప్పి వచ్చిన తర్వాత ఉదయం 11.30 గంటల ప్రాంతంలో గుండెపోటు లక్షణాలు కనిపించాయి. వెంటనే కుటుంబసభ్యులు సాంగ్లిలోని సరవిత్ ఆస్పత్రికి తరలించారు. అయితే అక్కడ శ్రీనివాస్‌కి కార్డియాక్ ఎంజైమ్‌లు కొద్దిగా పెరిగినప్పటికీ పూర్తి వైద్య బృందం పర్యవేక్షణ తప్పనిసరి అని పేర్కొన్నారు వైద్యులు.
ఆయనకు రక్తపోటు పెరుగుతోందని, అందువల్ల నిరంతన ఈసీజీ పర్యవేక్షణ తోపాటు యాంజియోగ్రపీ కూడా అవసరం అవ్వొచ్చని చెప్పారు. ఇది శారీరక లేదా మానసిక ఒత్తిడి వల్ల కావొచ్చని అన్నారు. అందులోనే వివాహం అనగానే ఒకవిధమైన ఆందోళన సహజంగా ఉంటుంది కాబట్టి అది కూడా ఓ కారణం కావోచ్చని అన్నారు.
అధిక రక్తపోటు అంటే..
ధమని గోడలపై రక్తం నెట్టడం వల్ల కలిగే శక్తి స్థిరంగా చాలా ఎక్కువగా ఉండే పరిస్థితి. దీనిని 130/80 mm Hg లేదా అంతకంటే ఎక్కువ స్థిరంగా చూపించడంగా పేర్కొనవచ్చు. ఈ పరిస్థితి వల్ల గుండె రక్తాన్ని పంప్ చేసేందుకు కష్టపడాల్సి వస్తుంటుంది. తగిన సమయంలో చికిత్స అందించకపోతే గుండె జబ్బులు, స్ట్రోక్, మూత్రపిండాలు దెబ్బతినే ప్రమాదం పెంచుతుందని వైద్యులు చెబుతున్నారు.
సాధారణంగా అధిక రక్తపోటుకు ఎలాంటి లక్షణాలు ఉండవట. అందువల్లే చాలామంది వ్యక్తులు ఎలాంటి లక్షణాలు కనిపించకుండా ఏళ్ల తరబడి దాంతో గడిపేస్తుంటారట. ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనాల ప్రకారం.. 46 శాతం కంటే ఎక్కువ మంది పెద్దలకు తమకు అధిక రక్తపోటు ఉందని కూడా తెలియదని చెబుతున్నారు నిపుణులు.
బీపీ ఎక్కువగా ఉంటే ఈ లక్షణాలు తప్పనిసరి..
మానసిక పనితీరులో మార్పులు
ఛాతీ నొప్పి
మైకము
శరీరంలో ఎడెమా లేదా వాపు
గుండె దడ
సాధారణం కంటే తక్కువ మూత్ర విసర్జన
మూర్ఛలు
తీవ్రమైన తలనొప్పి
ఆకస్మికంగా ముఖం వంగిపోవడం, అస్పష్టమైన ప్రసంగం లేదా చేయి లేదా కాలులో స్ట్రోక్ సంకేతాలు
కంటి నొప్పి, దృష్టి కోల్పోవడం లేదా ఆకస్మిక అస్పష్టమైన దృష్టి లోపం
కారణాలు..
అందరికీ అధిక రక్తపోటుకు ఇందువల్లే రాగలదని ఒకే కారణాన్ని చెప్పలేమని వైద్యులు చెబుతున్నారు. దీనికి అనేక రకాల అంశాలు కారణమవుతాయని, వాటివల్లే ఈ పరిస్థితికి దారితీస్తుందని చెబుతున్నారు. వాటిలో కొన్ని:
55 ఏళ్లు పైబడిన వారు
కుటుంబంలో చరిత్రలో ఎవరికైన ఈ పరిస్థితి ఉంటే
ధూమపానం లేదా పొగాకు ఉత్పత్తులను ఉపయోగించడం
అధిక బరువు లేదా ఊబకాయం కలిగి ఉండటం
సోడియం అధికంగా ఉన్న ఆహారాన్ని తినడం
తగినంత శారీరక శ్రమ లేకపోవడం.
అధికంగా మద్యం సేవించడం
చాలా సందర్భాలలో అధిక రక్తపోటుకు ఎందువల్ల వచ్చిందనేది గుర్తించగలరట. ఇందులో అంతర్లీన పరిస్థితి, మందులు లేదా పదార్ధం, అబ్స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా, మూత్రపిండ ధమని స్టెనోసిస్, ప్రాథమిక ఆల్డోస్టెరోనిజం, థైరాయిడ్ వ్యాధి వంటి వాటి వల్ల కూడా కావొచ్చట.
యాంజియోప్లాస్టీ ఎందుకు చేస్తారు?
ఇరుకైన లేదా మూసుకుపోయిన ధమనిలో రక్త ప్రవాహాన్ని పునరుద్ధరించడానికి వైద్యులు యాంజియోప్లాస్టీ చేస్తారు. ముఖ్యంగా గుండెపోటు సమయంలో లేదా కరోనరీ ఆర్టరీ వ్యాధి (కొలెస్ట్రాల్ పేరుకుపోవడం వల్ల ధమనులు ఇరుకుగా మారడం) వల్ల వచ్చే తీవ్రమైన ఛాతీ నొప్పి (ఆంజినా) వంటి పరిస్థితులలో రక్త ప్రవాహాన్ని మెరుగుపరచడానికి చేస్తారు. ఈ ప్రక్రియ ద్వారా ధమనిని తెరిచి, గుండె కండరాలకు రక్త ప్రవాహాన్ని పునరుద్ధరిస్తారు.
దీన్ని మెడ, కాళ్ళు లేదా మూత్రపిండాలు వంటి శరీరంలోని ఇతర భాగాలలోని ధమనులపై కూడా ఆయా ప్రాంతాలలో అడ్డంకులను చికిత్స చేయడానికి ఉపయోగించవచ్చు.
అంతేగాదు హృదయ ధమనిలో అకస్మాత్తుగా అడ్డంకులు ఏర్పడటం వల్ల కూడా గుండెపోటు రావచ్చు. కాబట్టి, ధమనిని త్వరగా తెరవడానికి, రక్త ప్రవాహాన్ని పునరుద్ధరించడానికి, గుండె కండరాలకు నష్టం జరగకుండా నిరోధించడానికి యాంజియోప్లాస్టీని అత్యవసర ప్రక్రియగా చేస్తారు వైద్యులు.
గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం.
(చదవండి: Farah Khan: వెయిట్ లాస్ జర్నీ కోసం ఫరా ఖాన్ పాట్లు..! ఏకంగా సర్జరీ, జుట్టు కోసం..)


