టీమిండియాతో రెండో టెస్టులో సౌతాఫ్రికా (IND vs SA) మూడో రోజు కూడా ఆధిపత్యం కొనసాగించింది. భారత్‌ను 201 పరుగులకే ఆలౌట్ చేసిన సఫారీలు.. సోమవారం నాటి ఆట ముగిసే సరికి మొత్తంగా 314 పరుగుల ఆధిక్యం సంపాదించారు.
గువాహటి వేదికగా రెండో టెస్టులో భారత బౌలర్లు, బ్యాటర్లు సమిష్టిగా విఫలమయ్యారు. బౌలర్ల పేలవ ఆట తీరు వల్ల సౌతాఫ్రికా తమ తొలి ఇన్నింగ్స్‌లో ఏకంగా 489 పరుగులు చేసింది. అయితే, ఇదే వేదికపై ప్రొటిస్ బౌలర్లు మాత్రం దుమ్ములేపారు.
ఆరు వికెట్లతో చెలరేగి..
ముఖ్యంగా పేస్ ఆల్‌రౌండర్ మార్కో యాన్సెన్ (Marco Jansen) ఆరు వికెట్లతో చెలరేగి.. టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్‌ను కుదేలు చేశాడు. కీలక వికెట్లు తీసి.. పంత్ సేన 201 పరుగులకే కుప్పకూలడంలో ప్రధాన భూమిక పోషించాడు. దీంతో సఫారీలకు తొలి ఇన్నింగ్స్‌లో 288 పరుగుల భారీ ఆధిక్యం దక్కింది.
ఈ నేపథ్యంలో టీమిండియాను ఫాలో ఆన్ ఆడిస్తారనుకుంటే.. సౌతాఫ్రికా కెప్టెన్ తెంబా బవుమా మాత్రం తామే బ్యాటింగ్ చేసేందుకు మొగ్గుచూపాడు. దీంతో భారత్ ఊపిరి పీల్చుకోగా.. వికెట్లు తీసేందుకు యత్నించిన బౌలర్లకు ఏమాత్రం కలిసిరాలేదు.
పటిష్ట స్థితిలోనే..
సౌతాఫ్రికా ఎనిమిది ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 26 పరుగులు చేసింది. అయితే, వెలుతురు లేమి కారణంగా అంపైర్లు కాస్త ముందుగానే ఆటను ముగించారు. బర్సపరా స్టేడియంలో సోమవారం ఆట పూర్తయ్యేసరికి ప్రొటిస్ ఓపెనర్లు ర్యాన్ రికెల్టన్ 13, ఐడెన్ మార్క్రమ్ 12 పరుగులతో క్రీజులో నిలిచారు.
కాగా అప్పటికే బౌలింగ్, బ్యాటింగ్ వైఫల్యంతో కష్టాల్లో కూరుకుపోయిన టీమిండియాకు.. మూడో రోజు ఒక్క వికెట్ కూడా దక్కకపోవడంతో సహజంగానే బౌలర్లు నిరాశకు గురయ్యారు. ఈ నేపథ్యంలో మొహమ్మద్ సిరాజ్ కాస్త దూకుడు ప్రదర్శించగా.. కేఎల్ రాహుల్ అతడిని వారించిన తీరు హైలైట్‌గా నిలిచింది.

ఫ్రస్టేషన్లో సిరాజ్ మియా.. వైల్డ్ త్రో
ప్రొటిస్ రెండో ఇన్నింగ్స్‌లో సోమవారం నాటి ఆఖరి ఓవర్ (8)ను చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ వేశాడు. అతడి బౌలింగ్‌లో మూడో బంతిని రికెల్టన్ లాంగాఫ్ దిశగా షాట్ బాదగా.. సిరాజ్ బంతిని అందుకున్నాడు. అయితే, అప్పటికే ఫ్రస్టేషన్లో ఉన్న సిరాజ్ మియా.. వికెట్ కీపర్ రిషభ్ పంత్ వైపు వైల్డ్‌గా బాల్ త్రో చేశాడు.
పంత్ ఆ బంతిని మిస్ కాగా.. స్లిప్స్‌లో అతడి వెనకే ఉన్న కేఎల్ రాహుల్ కష్టమ్మీద బంతిని ఒడిసిపట్టాడు. ఆ సమయంలో సిరాజ్ తన దూకుడు పట్ల పశ్చాత్తాపంగా నాలుక కరచుకోగా.. ‘అంత దూకుడు ఎందుకు.. కాస్త తగ్గు.. నెమ్మదిగా వెయ్’ అన్నట్లు రాహుల్ సైగ చేశాడు.
ఆ తర్వాత ఇద్దరూ నవ్వులు చిందించారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.కాగా ప్రొటిస్ తొలి ఇన్నింగ్స్‌లో సిరాజ్ రెండు వికెట్లు తీసిన విషయం తెలిసిందే.
చదవండి: ఇలా ఎవరైనా చేస్తారా?: పంత్‌పై మండిపడ్డ కుంబ్లే
— Nihari Korma (@NihariVsKorma) November 24, 2025


