మూడో వన్డేలోనూ ఓడిన వెస్టిండీస్
హామిల్టన్ (న్యూజిలాండ్): ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన న్యూజిలాండ్ జట్టు... వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసింది. శనివారం జరిగిన మూడో మ్యాచ్‌లో న్యూజిలాండ్ 4 వికెట్ల తేడాతో విండీస్‌ను చిత్తుచేసింది. టి20 సిరీస్‌ను 3–1తో కైవసం చేసుకున్న కివీస్... వన్డే సిరీస్‌ను 3–0తో చేజిక్కించుకుంది. ఆఖరి పోరులో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న వెస్టిండీస్ 36.2 ఓవర్లలో 161 పరుగులకు ఆలౌటైంది.
రోస్టన్ ఛేజ్ (51 బంతుల్లో 38; 3 ఫోర్లు, 1 సిక్స్) టాప్ స్కోరర్ కాగా... జాన్ క్యాంప్‌బెల్ (26; 3 ఫోర్లు, 1 సిక్స్), ఖారీ పియర్ (22 నాటౌట్; 2 సిక్స్‌లు) తలా కొన్ని పరుగులు చేశారు. కెపె్టన్ షై హోప్ (16), అకీమ్ అగస్ట్ (17), కార్టీ (0), రూథర్‌ఫోర్డ్ (19), జస్టిన్ గ్రేవ్స్ (1) విఫలమయ్యారు. న్యూజిలాండ్ బౌలర్ల ధాటికి కరీబియన్ జట్టు వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయింది. మ్యాట్ హెన్రీ 43 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. జాకబ్ డఫీ, మిచెల్ సాంట్నర్ చెరో 2 వికెట్లు తీశారు.
అనంతరం లక్ష్యఛేదనలో న్యూజిలాండ్ 30.3 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 162 పరుగులు చేసింది. మార్క్ చాప్‌మన్ (63 బంతుల్లో 64; 8 ఫోర్లు, 2 సిక్స్‌లు) చక్కటి హాఫ్‌సెంచరీతో సత్తాచాటగా... మిచెల్ బ్రాస్‌వెల్ (31 బంతుల్లో 40 నాటౌట్; 6 ఫోర్లు) రాణించాడు. ఓపెనర్లు డెవాన్ కాన్వే (11), రచిన్ రవీంద్ర (14)తో పాటు విల్ యంగ్ (3), టామ్ లాథమ్ (10) విఫలమవడంతో ఒక దశలో 70 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన కివీస్ జట్టును చాప్‌మన్ ఆదుకున్నాడు.
బ్రాస్‌వెల్‌తో కలిసి జట్టును విజయానికి చేరువ చేశారు. వెస్టిండీస్ బౌలర్లలో మాథ్యూ ఫోర్డ్, జైడెన్ సీల్స్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. న్యూజిలాండ్ ప్లేయర్లు మ్యాట్ హెన్రీకి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’, కైల్ జెమీసన్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ అవార్డులు దక్కాయి. ఇరు జట్ల మధ్య డిసెంబర్ 2 నుంచి తొలి టెస్టు ప్రారంభం కానుంది.


