నేడు తొలి వన్డే
జోరు మీదున్న గిల్ బృందం
మ.1.30 నుంచి స్టార్ స్పోర్ట్స్, హాట్‌స్టార్‌లలో ప్రత్యక్ష ప్రసారం
వడోదర: అంతర్జాతీయ క్రికెట్‌లో ఒక వైపు వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ సాగుతుండగా...మరో వైపు కొద్ది రోజుల్లో టి20 వరల్డ్ కప్ ప్రారంభం కానుంది. ఇలాంటి స్థితిలో ప్రస్తుతం వన్డే సిరీస్‌లకు చెప్పుకోదగ్గ ప్రాధాన్యత లేదు. కానీ కేవలం ఇద్దరు బ్యాటర్లు భారత వన్డే మ్యాచ్‌లను ఆసక్తికరంగా మారుస్తున్నారు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి ఇటీవలి ప్రదర్శన అభిమానులకు ఆనందం పంచింది.
ఆ్రస్టేలియాలో రోహిత్ చెలరేగిపోగా, దక్షిణాఫ్రికాపై కోహ్లి సత్తా చాటాడు. కెపె్టన్‌గా శుబ్‌మన్ గిల్ మళ్లీ వన్డే సిరీస్‌లో జట్టును నడిపించేందుకు సిద్ధమయ్యాడు. న్యూజిలాండ్‌తో మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా నేడు జరిగే తొలి పోరులో ఇరు జట్లు తలపడనున్నాయి.
స్వదేశంలో దక్షిణాఫ్రికాపై సిరీస్ గెలిచి టీమిండియా ఫామ్‌లో ఉండగా... న్యూజిలాండ్ టీమ్‌లో అనుభవలేమి స్పష్టంగా కనిపిస్తోంది. కొటాంబి స్టేడియంలో ఇదే తొలి పురుషుల క్రికెట్ మ్యాచ్ కావడం విశేషం. ఇప్పటి వరకు ఈ మైదానంలో రెండు మహిళల వన్డేలు జరగ్గా, రెండు సార్లూ పేస్ బౌలింగ్‌కు పిచ్ అనుకూలించింది. ఈ సారి అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్‌కు సమంగా అనుకూలించే చక్కటి పిచ్ కనిపిస్తోంది. మ్యాచ్ రోజు వర్ష సూచన లేదు.
అయ్యర్ పునరాగమనం...
దక్షిణాఫ్రికాతో సిరీస్‌కు గాయంతో దూరమైన గిల్ మళ్లీ సారథిగా బరిలోకి దిగుతుండటంతో జైస్వాల్‌కు తుది జట్టులో చోటు లేదు. ఆ్రస్టేలియా గడ్డపై ఫీల్డింగ్‌లో గాయపడి కోలుకున్న అనంతరం శ్రేయస్ అయ్యర్ ఇప్పుడే మళ్లీ అంతర్జాతీయ మ్యాచ్ ఆడుతున్నాడు. ఇక విజయ్ హజారే టోర్నీలో రెండేసి వన్డేలు ఆడిన కోహ్లి, రోహిత్ దూకుడు మీదున్నారు.
మరో సారి సిరీస్‌కు వీరిద్దరే ప్రధాన ఆకర్షణ కానున్నారు. ఆల్‌రౌండర్లుగా జడేజా, సుందర్ ఖాయం కాగా...ప్రధాన స్పిన్నర్‌గా కుల్దీప్‌దే బాధ్యత. రాహుల్ కీపర్‌గా ఉంటాడు కాబట్టి మరోసారి పంత్‌కు నిరాశే. సిరాజ్ జట్టులోకి రావడంతో ప్రసిధ్ స్థానంలో అతను ఆడటం లాంఛనమే. మొత్తంగా ఎప్పటిలాగే మన జట్టు అత్యంత పటిష్టంగా కనిపిస్తోంది.
అనుభవలేమితో...
న్యూజిలాండ్ జట్టులోని 15 మంది సభ్యుల బృందంలో 8 మంది ఇప్పటి వరకు భారత గడ్డపై ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు! ఇద్దరు అసలు అంతర్జాతీయ మ్యాచ్‌లే ఆడలేదు. ఒకరు కేవలం టి20ల్లోనే ఆడగా, ఐదుగురు పది లోపు వన్డేలే ఆడారు. వేర్వేరు కారణాలతో అనుభవజు్ఞలైన శాంట్నర్, హెన్రీ, చాప్‌మన్, రూరీ్క, లాథమ్, విలియమ్సన్ జట్టుకు దూరమయ్యారు. ఇలాంటి టీమ్ భారత్‌కు ఏమాత్రం పోటీనిస్తుందనేది సందేహమే.
టీమ్ కెపె్టన్‌గా ఉన్న బ్రేస్‌వెల్ రెండేళ్ల క్రితం హైదరాబాద్‌లో 350 పరుగుల ఛేదనలో 78 బంతుల్లో 140 పరుగులు చేసి చిరస్మరణీయ ఇన్నింగ్స్ ఆడాడు. నాటి ఇన్నింగ్స్‌నుంచి అతనితో పాటు జట్టు ఏమైనా స్ఫూర్తి పొందుతుందేమో చూడాలి. 2024లో టెస్టుల్లో భారత్ కోట బద్దలు కొట్టిన న్యూజిలాండ్ ఇప్పటి వరకు ఇక్కడ వన్డే సిరీస్ గెలవలేదు.
నాకు ఏం రాసి పెట్టి ఉంటే అదే జరుగుతుంది. నేను ప్రస్తుతం ఎక్కడ ఉండాలో అక్కడే ఉన్నా. నేను వర్తమానంలో జీవించేవాడిని. అప్పుడు అంతా బాగానే అనిపిస్తుంది. ఏ ఆటగాడైనా దేశం తరఫున అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వాలనే భావిస్తాడు. సెలక్టర్లు వారి నిర్ణయం వారు తీసుకున్నారు.
టి20 వరల్డ్ కప్‌లో చోటు కోల్పోవడంపై గిల్ వ్యాఖ్య


