
సిటీకి అంతరిక్షంతో విడదీయరాని అనుబంధం ఉంది.. దేశం ఏ పరిశోధనలు చేసినా అందులో భాగస్వామ్యం అవుతోంది. కొంత కాలంగా భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) పరిశోధనల్లో మన నగరం ప్రాతినిధ్యం వహించడమే కాకుండా ప్రతిష్టాత్మక భారతీయ స్పేస్ ప్రాజెక్టుల్లో కీలక వీడి భాగాలను, సాంకేతికతను నగరంలోని పలు సంస్థలు అందిస్తుండటం విశేషం. పీఎస్‌ఎల్‌వీ, జీఎస్‌ఎల్‌వీ రాకెట్లు మొదలు అంతర్జాతీయ స్థాయిలో ప్రంపంచ దేశాలకు పోటీగా నిర్వహిస్తున్న చంద్రయాన్‌లోనూ భాగ్యనగరం భాగస్వామ్యమవుతూ తన ప్రశస్తిని కొనసాగిస్తోంది. అయితే ప్రతి సంవత్సరం ఈనెల 10వ తేదీ వరకు ‘ప్రపంచ అంతరిక్ష వారం’ (వరల్డ్ స్పేస్ వీక్)ను అధికారికంగా నిర్వహిస్తుంటారు. ఇందులో భాగంగా సైన్స్ అండ్ టెక్నాలజీ ముఖ్యంగా స్పేస్ సైన్స్‌కు సంబంధించి అంతర్జాతీయ వార్షిక ఉత్సవాలను నిర్వహిస్తుంటారు. ఈ ఏడాది వరల్డ్ స్పేస్ వీక్‌ను ‘లివింగ్ ఇన్ స్పేస్’ థీమ్‌తో జరుపుతున్నారు. ఈ సందర్భంగా ఒకసారి భారత అంతరిక్ష ప్రయాణంలో మన సిటీ ప్రస్థానాన్ని గుర్తుచేసుకోకుంటే ఎలా..?!
విద్యార్థులకు, యువ పరిశోధకులకు, ఔత్సాహిక నిపుణులకు శాస్త్ర సాంకేతికత, ఇంజనీరింగ్, అంతరిక్ష అన్వేషణ, ఇనోవేషన్‌తో పాటు సమగ్ర అంతరిక్ష విజ్ఞానంపై అవగాహన కల్పించడానికి వరల్డ్ స్పేస్ వీక్‌ను నిర్వహిస్తారు. సాంకేతికతతో పాటు పరిశోధన సాధనలు, ప్రయోజనాలు, మానవాళికి ఈ విజ్ఞాన ప్రాముఖ్యతను తెలియజేయడానికి జరుపుతారు.
అక్టోబర్ 4వ తేదీ నుంచి 10వ తేదీ వరకు వారం రోజుల పాటు వరల్డ్ స్పేస్ వీక్‌ను జరుపుకుంటారు. 1957 అక్టోబర్ 4న మొదటి మానవ నిర్మిత ఉపగ్రహం స్పూతి్నక్ –1ను ప్రయోగించడం.. ఈ శాటిలైట్ 1967 అక్టోబర్ 10న చంద్రుడితో సహా ఇతర ఖగోళ ప్రాంతాల్లో అంతరిక్ష అన్వేషణ చేపట్టింది.
చంద్రయాన్ నుంచి పీఎస్‌ఎల్‌వీ వరకు..
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) చేపట్టిన ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో నగరానికి చెందిన సంస్థలు, పరిశోధన వేదికలు, పరిశ్రమలు తనదైన ముద్ర వేశాయి. పరికరాల తయారీ నుంచి ఉపగ్రహ డేటా విశ్లేషణ వరకు అనేక రంగాల్లో ఇక్కడి నుంచి నిపుణులు, సంస్థలు నిరంతరం కృషి చేస్తున్నారు. ముఖ్యంగా చంద్రయాన్–3 ల్యాండర్ సాఫ్ట్ ల్యాండింగ్ చేసినప్పటికీ, ఆ విజయానికి వెనక ఉన్న ఇంజినీరింగ్ విజయాల్లో మన పాత్ర మరువలేనిది.
ఈ మిషన్ విజయవంతం కావడంలో నగరానికి చెందిన అనేక సంస్థలు కీలకంగా పనిచేశాయి. శ్రీవేంకటేశ్వర ఏరోస్పేస్ ఆధ్వర్యంలో రాకెట్ స్ట్రక్చర్, విడిపోయే భాగాలు(సెపరేషన్ సిస్టమ్), నోజిల్స్, ల్యాండర్, రోవర్‌కు సంబంధించిన కీలక భాగాలను రూపొందించింది. నాగసాయి ప్రిసీసన్ ఇంజనీర్స్ సంస్థ, ల్యాండర్‌కు అవసరమైన లిథియం అయాన్ బ్యాటరీల రక్షణకు అల్యూమినియం ఆలాయ్ కేవ్స్‌ను రూపొందించింది.
అలాగే ఎమ్‌టీఏఆర్ టెక్నాలజీస్ సంస్థ లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్, హై సైకిల్ లైఫ్ వాల్వులు వంటి అనేక అత్యాధునిక భాగాలను తయారు చేసింది. నగరంలోని ప్రభుత్వ రంగ సంస్థ మిధాని.. క్రయోజెనిక్ ఇంజిన్లు, ప్రొపెల్లెంట్ ట్యాంకులు, రాకెట్ మోటార్ భాగాల తయారీలో ఉపయోగించే ప్రత్యేక లోహాలు, మిశ్రమాలను ఇస్రోకి సరఫరా చేసింది.
పీఎస్‌ఎల్‌వీ, జీఎస్‌ఎల్‌వీ..
అనంత్ టెక్నాలజీస్ సంస్థ పీఎస్‌ఎల్‌వీ–సీ52, పీఎస్‌ఎల్‌వీ–సీ56, జీఎస్‌ఎల్‌వీ–ఎఫ్14, ఇన్‌సాట్–3డీఎస్ వంటి అనేక ఉపగ్రహ ప్రయోగాలకు విమానాల ఎల్రక్టానిక్స్, పవర్ సిస్టమ్స్, టెలిమెట్రీ ప్యాకేజులు, నావిగేషన్ మాడ్యూళ్లు, ఇనెర్షియల్ సెన్సింగ్ యూనిట్లు, పైరో కంట్రోల్ సిస్టమ్స్ వంటి అనేక భాగాలను రూపొందించి ఇచ్చింది.
ఈ సంస్థ అనేక ఉపగ్రహాల అసెంబ్లీ, టెస్టింగ్, ఇంటిగ్రేషన్ ప్రక్రియల్లో భాగమవుతూ ఇస్రోకు అత్యంత విశ్వసనీయ భాగస్వామిగా నిలుస్తోంది. ఇస్రో భాగస్వామ్యంతో 100కి పైగా ఉపగ్రహాలు, లాంచ్ వెహికిల్స్‌కు సిస్టమ్స్ సరఫరా చేసింది.
ఉపగ్రహ డేటా కేంద్రంగా.. ఎన్‌ఆర్‌ఎస్‌సీ
హైదరాబాద్‌లోని ఎన్‌ఆర్‌ఎస్‌సీ (నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్) ఉపగ్రహాల ద్వారా వచ్చే డేటాను విశ్లేషించి, వ్యవసాయం, నీటిపారుదల, విపత్తుల నిర్వహణ వంటి అనేక రంగాలకు ఉపయోగించేలా మారుస్తోంది. ఇది ఇస్రోకు భూమి పరిశీలన సంబంధిత సేవల్లో ప్రధాన కేంద్రంగా నిలుస్తోంది.
పరిశోధన, స్టార్టప్‌లకు ప్రోత్సాహం..
ఇస్రో– ట్రిపుల్ ఐటీ హైదరాబాద్ సంయుక్తంగా ‘ఏఐ ఫర్ స్పేస్‘ అనే ప్రత్యేక కార్యక్రమం ప్రారంభించి, విద్యార్థులు, స్టార్టప్‌లకు ఉపగ్రహ సాంకేతికతపై అన్వేషణకు అవకాశమిస్తోంది. ధృవ స్పేస్, స్కైరూట్ ఏరో స్పేస్ వంటి సంస్థలు హైదరాబాద్ ఆధారితంగా ఉపగ్రహ వ్యవస్థల అభివృద్ధిలో ముందున్నారు.
(చదవండి: Custard Apple: సీజన్‌లో నిండుగా..సిటీలో పండు'గ'! జ్యూస్, ఐస్‌క్రీమ్స్, స్వీట్స్ నుంచి..)