స్వల్ప స్కోర్‌కే కుప్పకూలిన టీమిండియా.. సంతోషం ఎంతో సేపు మిగల్లేదు..! | India U19 Team All Out For 171 Runs In 1st Innings Of 2nd Test Match Vs Australia U19 Team | Sakshi
Sakshi News home page

స్వల్ప స్కోర్‌కే కుప్పకూలిన టీమిండియా.. సంతోషం ఎంతో సేపు మిగల్లేదు..!

Oct 8 2025 6:56 AM | Updated on Oct 8 2025 8:37 AM

India U19 Team All Out For 171 Runs In 1st Innings Of 2nd Test Match Vs Australia U19 Team

ఆస్ట్రేలియా పర్యటనలో భారత అండర్‌-19 జట్టు (India U19 vs Australia U19) తొలిసారి బ్యాటింగ్‌లో తడబడింది. మెక్‌కే వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్‌ తొలి ఇన్నింగ్స్‌లో 171 పరుగులకే ఆలౌటైంది. భారత ఇన్నింగ్స్‌లో ఒక్కరు కూడా కనీసం 30 పరుగుల మార్కును చేరలేదు.  

28 పరుగులు చేసిన తొమ్మిదో నంబర్‌ ఆటగాడు దీపేశ్‌ దీపేంద్రన్‌ టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. ఖిలన్‌ పటేల్‌, వేదాంత్‌ త్రివేది, హెనిల్‌ పటేల్‌, వైభవ్‌ సూర్యవంశీ (Vaibhav Suryavanshi) వరుసగా 26, 25, 22, 20 పరుగులు స్కోర్‌ చేశారు. ఓపెనర్‌గా ప్రమోషన్‌ పొందిన విహాన్‌ మల్హోత్రా 11 పరుగులు చేశాడు.

కెప్టెన్‌ ఆయుశ్‌ మాత్రే (Ayush Mhatre) వైఫల్యాల పరంపరను కొనసాగిస్తూ 4 పరుగులకే ఔట్‌ కాగా.. రాహుల్‌ కుమార్‌ 9, హర్వంశ్‌ పంగాలియా 1, నమన్‌ పుష్పక్‌ డకౌటయ్యారు. ఈ ఇన్నింగ్స్‌లో ఆసీస్‌ బౌలర్లు మూకుమ్మడిగా సత్తా చాటారు. 

కేసీ బార్టన్‌ 4, ఛార్లెస్‌ లిచ్‌మండ్‌, విల్‌ బైరోమ్‌, జూలియన్‌ ఓస్బర్న్‌ తలో 2 వికెట్లు తీశారు. తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా స్వల్ప స్కోర్‌కే ఆలౌటైనా 36 పరుగుల కీలక ఆధిక్యం సాధించడం విశేషం.

ఆసీస్‌కు సంతోషం​ ఎంతో సేపు మిగల్చలేదు
దీనికి తోడు స్వల్ప లోటుతో రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన ఆస్ట్రేలియాను భారత పేసర్‌ హెనిల్‌ పటేల్‌ రెండో ఓవర్‌లోనే కోలుకోలేని దెబ్బకొట్టాడు. హెనిల్‌ రెండో ఓవర్‌లో వరుసగా తొలి, రెండో బంతులకు సైమన్‌ బడ్జ్‌, జెడ్‌ హోల్లిక్‌లను పెవిలియన్‌కు పంపాడు. ఆసీస్‌ అప్పటికి ఖాతా కూడా తెరవలేదు. 2 ఓవర్ల తర్వాత ఆ జట్టు స్కోర్‌ 0/2గా ఉంది.

అంతకుముందు భారత బౌలర్లు తొలి ఇన్నింగ్స్‌లోనూ చెలరేగడంతో ఆసీస్‌ 135 పరుగులకే కుప్పకూలింది. హెనిల్‌ పటేల్‌ (9-3-21-3), ఖిలన్‌ పటేల్‌ (12-5-23-3), ఉధవ్‌ మోహన్‌ (6-0-23-2), దీపేశ్‌ దేవేంద్రన్‌ (7.3-2-22-1) కలిసికట్టుగా ఆసీస్‌ ఇన్నింగ్స్‌ను కుప్పకూల్చారు. ఆసీస్‌ ఇన్నింగ్స్‌లో వికెట్‌ కీపర్‌ లీ యంగ్‌ (66) ఒక్కడే అర్ద సెంచరీతో రాణించాడు.

కాగా, మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌, రెండు మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌ల కోసం భారత అండర్‌ 19 జట్టు ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. తొలుత జరిగిన వన్డే సిరీస్‌ను క్లీన్‌ స్వీప్‌ చేసిన భారత్‌.. టెస్ట్‌ సిరీస్‌లోనూ 1-0 ఆధిక్యంలో కొనసాగుతుంది. ప్రస్తుతం జరుగుతున్న రెండో టెస్ట్‌ను కూడా గెలిస్తే భారత్‌ ఆసీస్‌ను వారి సొంత ఇలాకాలో పూర్తిగా క్వీన్‌ స్వీప్‌ చేసినట్లవుతుంది.

చదవండి: సహనం కోల్పోయిన వైభవ్‌ సూర్యవంశీ.. కారణం ఇదే!

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement