సహనం కోల్పోయిన వైభవ్‌ సూర్యవంశీ.. కారణం ఇదే! | IND U19 Vs AUS U19: Vaibhav Suryavanshi Loses Cool During Live Match | Sakshi
Sakshi News home page

సహనం కోల్పోయిన వైభవ్‌ సూర్యవంశీ.. కారణం ఇదే!

Oct 7 2025 7:39 PM | Updated on Oct 7 2025 7:50 PM

IND U19 Vs AUS U19: Vaibhav Suryavanshi Loses Cool During Live Match

వైభవ్‌ సూర్యవంశీ (పాత ఫొటో)

భారత యువ క్రికెటర్‌ వైభవ్‌ సూర్యవంశీ (Vaibhav Suryavanshi)కి కోపమొచ్చింది. అంపైర్‌ తీసుకున్న నిర్ణయం కారణంగా అతడు తీవ్ర అసహనానికి లోనయ్యాడు. ఐపీఎల్‌-2025 (IPL 2025)లో సత్తా చాటిన ఈ పద్నాలుగేళ్ల పిల్లాడు.. ప్రస్తుతం భారత అండర్‌-19 జట్టు తరఫున దుమ్ములేపుతున్నాడు.

ఆస్ట్రేలియా పర్యటనలోనూ..
ఇటీవల ఇంగ్లండ్‌ పర్యటనలో యూత్‌ వన్డే, టెస్టుల్లో అదరగొట్టిన వైభవ్‌ సూర్యవంశీ.. తాజాగా ఆస్ట్రేలియా పర్యటనలోనూ తనదైన ముద్ర వేస్తున్నాడు. ఆసీస్‌ అండర్‌-19 జట్టుతో యూత్‌ వన్డేల్లో మూడు మ్యాచ్‌లలో వరుసగా 38, 70, 16 పరుగులు చేసిన వైభవ్‌.. సిరీస్‌ను భారత్‌ క్లీన్‌స్వీప్‌ చేయడంలో తనవంతు పాత్ర పోషించాడు.

ఇక ఆసీస్‌ అండర్‌-19 జట్టుతో తొలి యూత్‌ టెస్టులో వైభవ్‌ సూర్యవంశీ.. విధ్వంసకర శతకంతో చెలరేగడం విశేషం. కేవలం 86 బంతుల్లోనే తొమ్మిది ఫోర్లు, ఎనిమిది సిక్సర్ల సాయంతో 113 పరుగులు రాబట్టాడు ఈ ఓపెనింగ్‌ బ్యాటర్‌. ఈ మ్యాచ్‌లో భారత జట్టు 58 పరుగుల తేడాతో జయభేరి మోగించింది.

ఆసీస్‌ 135 పరుగులకే ఆలౌట్‌
ఈ క్రమంలో భారత్‌- ఆసీస్‌ అండర్‌-19 జట్ల మధ్య మంగళవారం (అక్టోబరు 7) రెండో యూత్‌ టెస్టు మొదలైంది. మెకాయ్‌ వేదికగా టాస్‌ గెలిచిన ఆతిథ్య ఆసీస్‌ తొలుత బ్యాటింగ్‌ ఎంచుకోగా.. భారత బౌలర్ల ధాటికి 43.3 ఓవర్లలో కేవలం 135 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్‌ అయింది.

ఆసీస్‌ బ్యాటర్లలో వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ అలెక్స్‌ లీ యంగ్‌ (66) టాప్‌ రన్‌ స్కోరర్‌గా నిలవగా.. భారత బౌలర్లలో హెనిల్‌ పటేల్‌, ఖిలాన్‌ పటేల్‌ చెరో మూడు వికెట్లతో చెలరేగారు. ఉద్ధవ్‌ మోహన్‌ రెండు, దీపేశ్‌ దేవేంద్రన్‌ ఒక వికెట్‌ దక్కించుకున్నారు.

అనంతరం తమ తొలి ఇన్నింగ్స్‌ మొదలు పెట్టిన భారత జట్టుకు ఆదిలోనే షాక్‌ తగిలింది. విల్‌ బైరోమ్‌ బౌలింగ్‌ అలెక్స్‌టర్నర్‌కు క్యాచ్‌ ఇచ్చి కెప్టెన్‌ ఆయుశ్‌ మాత్రే (4) పెవిలియన్‌ చేరాడు. మరో ఓపెనర్‌ విహాన్‌ మల్హోత్రా (11) కూడా విఫలమయ్యాడు.

ఊహించని విధంగా..
ఈ క్రమంలో వైభవ్‌ సూర్యవంశీ సత్తా చాటుతాడని ఆశించగా.. అందుకు తగ్గట్లుగానే దూకుడుగా తన ఇన్నింగ్స్‌ మొదలుపెట్టాడు. 14 బంతుల్లోనే రెండు ఫోర్లు, ఒక సిక్సర్‌ సాయంతో 20 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఉన్నవేళ.. ఊహించని విధంగా అవుటయ్యాడు.

చార్ల్స్‌ లచ్‌మండ్‌ బౌలింగ్‌లో వికెట్‌ కీపర్‌ అలెక్స్‌ లీ యంగ్‌కు క్యాచ్‌ ఇచ్చి వైభవ్‌ పెవిలియన్‌ చేరాడు. అయితే, అంపైర్‌ నిర్ణయం పట్ల వైభవ్‌ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. బంతి బ్యాట్‌ కంటే ముందు ప్యాడ్‌కు తాకిందని వైభవ్‌ అంపైర్‌తో వాదించినట్లు కనిపించింది.

సహనం కోల్పోయిన వైభవ్‌
ఈ క్రమంలో సహనం కోల్పోయిన వైభవ్‌ అవుటైన కాసేపటి దాకా క్రీజును వీడకుండా అక్కడే ఉన్నాడు. ఆ తర్వాత అన్యమస్కకంగానే పెవిలియన్‌ చేరాడు. ఇక వైభవ్‌తో పాటు మరో ఎండ్‌లో ఉన్న వేదాంత్‌ త్రివేవది కూడా అంపైర్‌తో ఇదే విషయం గురించి కాసేపు చర్చించాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు  సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

 

ఇక మ్యాచ్‌ విషయానికొస్తే.. మంగళవారం నాటి తొలి రోజు ఆట ముగిసేసరికి భారత జట్టు 40 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 144 పరుగులు చేసింది. ఆసీస్‌ కంటే తొలి ఇన్నింగ్స్‌లో తొమ్మిది పరుగుల ఆధిక్యంలో నిలిచింది. వైభవ్‌ 20 పరుగులు చేయగా.. వేదాంత్‌ 25, ఖిలన్‌ పటేల్‌ 26 పరుగులు చేశారు. హెనిల్‌ పటేల్‌ 22, దీపేశ్‌ దేవేంద్రన్‌ 6 పరుగులతో క్రీజులో ఉన్నారు.

చదవండి: రోహిత్‌ను తప్పించడం సరైన నిర్ణయం.. కోహ్లి జట్టులో కొనసాగాలంటే..: డివిలియర్స్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement