రోహిత్‌పై వేటు సరైన నిర్ణయం.. కోహ్లి జట్టులో కొనసాగాలంటే..: డివిలియర్స్‌ | AB de Villiers Supports BCCI’s Decision to Appoint Shubman Gill as ODI Captain | Sakshi
Sakshi News home page

రోహిత్‌ను తప్పించడం సరైన నిర్ణయం.. కోహ్లి జట్టులో కొనసాగాలంటే..: డివిలియర్స్‌

Oct 7 2025 4:38 PM | Updated on Oct 7 2025 5:27 PM

 This was Right move: De Villiers Clear Warning To Kohli Rohit On ODI Future

టీమిండియా వన్డే కెప్టెన్‌ను మారుస్తూ భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (BCCI) తీసుకున్న నిర్ణయం సరైందా? కాదా? అన్న చర్చ నడుస్తూనే ఉంది. రోహిత్‌ శర్మ (Rohit Sharma)ను తప్పించి శుబ్‌మన్‌ గిల్‌కు పగ్గాలు ఇవ్వడం పట్ల భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఈ క్రమంలో భారత దిగ్గజం సునిల్‌ గావస్కర్‌ (Sunil Gavaskar)తో పాటు మదన్‌ లాల్‌ వంటి వారు సెలక్టర్ల నిర్ణయాన్ని సమర్థిస్తుండగా. హర్భజన్‌ సింగ్‌, రాబిన్‌ ఊతప్ప, మహ్మద్‌ కైఫ్‌ వంటి మాజీ క్రికెటర్లు దీనిని తొందరపాటు చర్యగా అభివర్ణిస్తున్నారు.

ఈ నేపథ్యంలో సౌతాఫ్రికా లెజండరీ బ్యాటర్‌ ఏబీ డివిలియర్స్‌ కూడా భారత వన్డే జట్టు కెప్టెన్‌ మార్పు అంశంపై తాజాగా స్పందించాడు. రోహిత్‌ శర్మను తప్పించి గిల్‌ను కెప్టెన్‌ను చేయడం సరైన నిర్ణయమని పేర్కొన్నాడు. ఇందుకు గల కారణాలు వివరిస్తూ..

రోహిత్‌పై వేటు సరైన నిర్ణయం
‘‘రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లి (Virat Kohli).. వన్డే వరల్డ్‌కప్‌​-2027 వరకు ఆడతారో లేదో నమ్మకం లేదు. ఆ ఆలోచనతోనే శుబ్‌మన్‌ గిల్‌ను వన్డే కెప్టెన్‌గా చేసి ఉంటారు. అతడికి గొప్ప అవకాశం లభించింది.

యువకుడు.. బ్యాటర్‌గానూ మంచి ఫామ్‌లో ఉన్నాడు. అద్భుతమైన నాయకుడిగా ఎదగగలడు. రోహిత్‌, కోహ్లి జట్టులో ఉండగానే గిల్‌ను కెప్టెన్‌ చేయడం సరైన నిర్ణయం. ఈ ఇద్దరు గొప్ప, అనుభవజ్ఞులైన కెప్టెన్ల నుంచి గిల్‌ ఎంతో నేర్చుకునే అవకాశం లభిస్తుంది.

రోహిత్‌, కోహ్లి జట్టులో కొనసాగాలంటే..
వారి అనుభవం తనకు ఉపయోగపడుతుంది. కెప్టెన్‌గా ఎదిగే క్రమంలో అతడికి ఇది ఎంతో ముఖ్యం. వాళ్లిద్దరు జట్టులో ఉండటం గిల్‌కు సానుకూలంగా ఉంటుంది. ఏదేమైనా ఒకవేళ రోహిత్‌, కోహ్లి 2027 వరల్డ్‌కప్‌ వరకు కొనసాగాలనుకుంటే.. తప్పకుండా పరుగులు రాబట్టాల్సి ఉంటుంది.

సెలక్టర్లకు బ్యాట్‌ ద్వారానే సందేశం ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే ప్రస్తుతం టీమిండియాలో చోటు కోసం తీవ్రమైన పోటీ ఉంది. ఈ పోటీని దాటి ముందుకు వెళ్లాలంటే కచ్చితంగా పరుగులు చేయాల్సిందే. రోహిత్‌, కోహ్లి వరల్డ్‌కప్‌ వరకు జట్టులో ఉంటే.. టీమిండియాకు అంతకంటే గొప్ప ఆస్తి మరొకటి ఉండదు’’ అని డివిలియర్స్‌ పేర్కొన్నాడు.

ఆసీస్‌తో సిరీస్‌తో రీఎంట్రీ
కాగా ఇప్పటికే అంతర్జాతీయ టీ20లకు, టెస్టులకు రిటైర్మెంట్‌ ప్రకటించిన రోహిత్‌, కోహ్లి.. వన్డేల్లో మాత్రం కొనసాగుతున్నారు. చివరగా ఇద్దరూ ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీ-2025 సందర్భంగా టీమిండియా తరఫున బరిలోకి దిగారు. 

ఇక ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా వన్డే సిరీస్‌తో రో- కో పునరాగమనం చేయనున్నారు. ఇదిలా ఉంటే.. ఇప్పటికే టీమిండియా టెస్టు కెప్టెన్‌గా గిల్‌ జట్టును ముందుకు నడిపిస్తుండగా.. టీ20 టీమ్‌కు సూర్యకుమార్‌ యాదవ్‌ సారథిగా ఉన్నాడు.

చదవండి: ‘మీ నాన్నతో కలిసి ఆటో తోలుకో’;.. ధోని ఆరోజు చెప్పిన మాటతో ఇలా..: సిరాజ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement