భారత అండర్‌–19 జట్టులో యశ్‌వీర్‌ గౌడ్‌ | Yashveer Goud in the Indian Under 19 team | Sakshi
Sakshi News home page

భారత అండర్‌–19 జట్టులో యశ్‌వీర్‌ గౌడ్‌

Jun 12 2026 5:27 AM | Updated on Jun 12 2026 5:27 AM

Yashveer Goud in the Indian Under 19 team

న్యూఢిల్లీ: శ్రీలంకలో వచ్చే నెలలో పర్యటించే భారత అండర్‌–19 పురుషుల క్రికెట్‌ జట్టును ప్రకటించారు. 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టులో హైదరాబాద్‌కు చెందిన ఎడంచేతి వాటం స్పిన్నర్‌ ఊట్కూరు యశ్‌వీర్‌ గౌడ్‌ ఎంపికయ్యాడు. యశ్‌వీర్‌ గౌడ్‌ తల్లిదండ్రులు ఊట్కూరు రాజ్‌కుమార్‌ గౌడ్, వాణి స్వస్థలం యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట్‌. హైదరాబాద్‌లో పుట్టి పెరిగిన యశ్‌వీర్‌ ఎనిమిదేళ్ల ప్రాయంలో బంతి పట్టాడు.

విద్యానగర్‌లోని డేనియల్‌ క్రికెట్‌ అకాడమీలో ఓనమాలు నేర్చుకున్న యశ్‌వీర్‌ ప్రస్తుతం కోచ్‌ కృష్ణమోహన్‌ వద్ద శిక్షణ తీసుకుంటున్నాడు. గత ఏడాది హైదరాబాద్‌ జట్టు తొలిసారి వినూ మన్కడ్‌ బీసీసీఐ అండర్‌–19 ట్రోఫీ టైటిల్‌ నెగ్గడంలో యశ్‌వీర్‌ కీలకపాత్ర పోషించాడు. యశ్‌వీర్‌ ఈ టోర్నీలో 15 వికెట్లు పడగొట్టాడు. ఇటీవల తెలంగాణ టి20 లీగ్‌లో హైదరాబాద్‌ ఫ్రాంచైజీ యశ్‌వీర్‌ను రూ. 3 లక్షలకు సొంతం చేసుకుంది. 

మరోవైపు భారత దిగ్గజ క్రికెటర్‌ రాహుల్‌ ద్రవిడ్‌ తనయుడు అన్వయ్‌ ద్రవిడ్‌ కూడా శ్రీలంకలో పర్యటించే భారత అండర్‌–19 జట్టులోకి ఎంపికయ్యాడు. మరోవైపు స్వదేశంలో శ్రీలంక అండర్‌–19 మహిళల జట్టుతో జరిగే వన్డే, టి20 సిరీస్‌లో పాల్గొనే భారత అండర్‌–19 జట్టులో ఆంధ్ర వికెట్‌ కీపర్‌ కె.దీక్ష చోటు దక్కించుకుంది. 15 మంది సభ్యులతో కూడిన భారత వన్డే, టి20 జట్లకు భవిక అహిరె కెప్టెన్‌గా వ్యవహరించనుంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement