రజత రాజా...  వెండి జ్ఞానేశ్వరి | India won medals in all three events on Day 3 of the CWG 2026 | Sakshi
Sakshi News home page

రజత రాజా...  వెండి జ్ఞానేశ్వరి

Jul 28 2026 12:43 AM | Updated on Jul 28 2026 12:44 AM

India won medals in all three events on Day 3 of the CWG 2026

బింద్యారాణి కాంస్యంతో సరి

వెయిట్‌లిఫ్టింగ్‌లో భారత్‌కు మూడు పతకాలు

గ్లాస్గో: కామన్వెల్త్‌ క్రీడల్లో భారత్‌ ఖాతాలో మరో మూడు పతకాలు చేరాయి. భారత వెయిట్‌లిఫ్టర్లు ఈ మూడు పతకాలు అందించారు. పురుషుల విభాగంలో రాజా ముత్తుపండి, మహిళల విభాగంలో జ్ఞానేశ్వరి యాదవ్‌లకు రజతాలు లభించగా... మణిపూర్‌ ప్లేయర్‌ బింద్యారాణి దేవి కాంస్య పతకాన్ని గెలుచుకుంది. ప్రస్తుతం భారత్‌ ఒక స్వర్ణం, 3 రజతాలు, 2 కాంస్యాలతో కలిపి ఆరు పతకాలతో ఎనిమిదో స్థానంలో ఉంది.  ఆస్ట్రేలియా 42 పతకాలతో (18 స్వర్ణాలు, 9 రజతాలు, 15 కాంస్యాలు) అగ్రస్థానంలో కొనసాగుతోంది. 

మహిళల 53 కేజీల కేటగిరీలో జ్ఞానేశ్వరి యాదవ్‌ రజత పతకం గెలుచుకుంది. స్నాచ్‌లో 88 కేజీలు, క్లీన్‌ అండ్‌ జర్క్‌లో 111 కేజీల బరువెత్తి (మొత్తం 199 కేజీలు) ఆమె రెండో స్థానంలో నిలిచింది. నైజీరియాకు చెందిన ఒనోమ్‌ ఒమొలొలా దీదీ మొత్తం 206 కేజీలు (93+113) స్వర్ణం సాధించి కొత్త కామన్వెల్త్‌ గేమ్స్‌ రికార్డు నెలకొల్పగా... రెబెకా గ్రోక్స్‌ (కెనడా–178 కేజీలు) కాంస్యం అందుకుంది. 

స్నాచ్‌లో వరుసగా 82, 85, 88 కేజీల బరువుతో తన ప్రదర్శనను మెరుగుపర్చుకున్న జ్ఞానేశ్వరి...క్లీన్‌ అండ్‌ జర్క్‌లో కూడా వరుసగా మూడు ప్రయత్నాల్లో 103, 107, 111 కేజీల బరువును ఎత్తింది. వెయిట్‌లిఫ్టింగ్‌ పురుషుల విభాగంలో భారత్‌కు రాజా ముత్తుపండి రజతంతో మెరిశాడు. 

పురుషుల 65 కేజీల విభాగంలో రాజా రెండో స్థానంలో నిలిచాడు. స్నాచ్‌లో 126 కేజీలు, క్లీన్‌ అండ్‌ జర్క్‌లో 160 కేజీలు కలిపి మొత్తంగా 286 కేజీల బరువు ఎత్తిన రాజాకు రజతం లభించింది. ఈ ఈవెంట్‌లో అజ్నిల్‌ బిన్‌ బిదిన్‌ ముహమ్మద్‌ (మలేసియా) కామన్వెల్త్‌ రికార్డు 299 కేజీలు (133+166)తో స్వర్ణం గెలుచుకోగా, మోరియా బారు (పవువా న్యూ గినియా; 282 కేజీలు)కు కాంస్యం లభించింది.   

ఈసారి కాంస్యం.. 
మహిళల 58 కేజీల కేటగిరీలో బింద్యారాణి దేవి సొరొఖైబమ్‌కు కాంస్య పతకం దక్కింది. 2022 బర్మింగ్‌హామ్‌ కామన్వెల్త్‌ క్రీడల్లో రజతం గెలుచుకున్న ఆమె ఈసారి అంతకంటే మెరుగైన ప్రదర్శన ఇవ్వాలని బరిలోకి దిగినా... కాంస్యానికే పరిమితమైంది. ఒకదశలో స్వర్ణం దిశగా సాగుతున్నట్లు అనిపించినా... చివర్లో ఆమె తడబడింది. 

ఓవరాల్‌గా 199 కేజీలు (స్నాచ్‌లో 87 + క్లీన్‌ అండ్‌ జర్క్‌లో 112) బరువు ఎత్తిన బింద్యారాణి మూడో స్థానంతో ముగించింది. ఈ పోటీల్లో రఫియతు లవాల్‌ (నైజీరియా; 229 కేజీలు) కామన్వెల్త్‌ క్రీడల్లో రికార్డు ప్రదర్శనతో స్వర్ణం గెలుచుకోగా... ఆన్‌ సోఫీ (కెనడా; 215 కేజీలు)కు రజతం దక్కింది. బింద్యారాణి గతంలో కామన్వెల్త్‌ చాంపియన్‌షిప్‌ పోటీల్లో ఒక స్వర్ణం, 2 రజతాలు సాధించింది.

పోలీస్‌ ఖాతాలో పతకం... 
ఛత్తీస్‌గఢ్‌లోని రాజ్‌నంద్‌గావ్‌కు చెందిన 23 ఏళ్ల జ్ఞానేశ్వరి అసిస్టెంట్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ (ఏఎస్‌ఐ)గా పని చేస్తోంది. చిన్న వయసులో ముందు పవర్‌లిఫ్టింగ్‌పై ఆసక్తి చూపించిన ఆమెను వెయిట్‌లిఫ్టింగ్‌ మరింతగా ఆకర్షించింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక క్రీడాభివృద్ధి కార్యక్రమంలో భాగంగా జ్ఞానేశ్వరి వెలుగులోకి వచ్చింది. ఎల్రక్టీషియన్‌ అయిన తండ్రి దీపక్‌ యాదవ్‌ ఎన్నో ఆర్థిక సమస్యలు ఎదురైనా... కూతురిని ఆమె లక్ష్యం దిశగా ప్రోత్సహించడంలో ఎప్పుడూ వెనుకాడలేదు.

 జూనియర్‌ స్థాయిలో పలు విజయాలతో గుర్తింపు దక్కించుకున్న ఆమె... పాటియాలాలోనే ప్రతిష్టాత్మక నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ స్పోర్ట్స్‌ (ఎన్‌ఐఎస్‌)లో శిక్షణ పొందుతోంది. గత ఏడాది ప్రపంచ చాంపియన్‌షిప్‌లో 5వ స్థానంలో నిలిచిన జ్ఞానేశ్వరి ఇటీవలే ఆసియా చాంపియన్‌షిప్‌లో కాంస్యం గెలుచుకుంది. ఈ కామన్వెల్త్‌ క్రీడల కోసం గ్లాస్గోలోని పరిస్థితులకు అలవాటు పడేందుకు కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహకారంతో బర్మింగ్‌హామ్‌లోని వార్లీ వెయిట్‌లిఫ్టింగ్‌ క్లబ్‌లో ప్రత్యేకంగా సిద్ధమై ఫలితం సాధించింది.

ఫైనల్లో సాజన్‌ ప్రకాశ్‌ 
స్విమ్మింగ్‌ పురుషుల 200 మీటర్ల బటర్‌ఫ్లయ్‌ ఈవెంట్‌లో భారత స్టార్‌ సాజన్‌ ప్రకాశ్‌ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. కేరళకు చెందిన ‘డబుల్‌ ఒలింపియన్‌’ సాజన్‌ హీట్‌–2లో 1ని:58.59 సెకన్లలో గమ్యానికి చేరి రెండో స్థానంలో నిలిచాడు. ఓవరాల్‌గా ఆరో ఫాస్టెస్ట్‌ స్విమ్మర్‌గా సాజన్‌ ఫైనల్లో చోటు సంపాదించాడు.  

క్వార్టర్స్‌లో అంకుశ్, సచిన్‌ 
పురుషుల బాక్సింగ్‌ ఈవెంట్‌లో భారత బాక్సర్లు అంకుశ్, సచిన్‌ సివాచ్‌ క్వార్టర్‌ ఫైనల్లోకి ప్రవేశించారు. పతకాలు ఖరారు చేసుకోవడానికి విజయం దూరంలో నిలిచారు. 80 కేజీల ప్రిక్వార్టర్‌ ఫైనల్లో అంకుశ్‌ 5:0తో జాన్‌ జలాన్‌ (అంటిగ్వా అండ్‌ బార్బుడా)పై గెలుపొందగా... 60 కేజీల ప్రిక్వార్టర్‌ ఫైనల్లో సచిన్‌ 4:1తో విలియమ్‌ హెవిట్‌ (ఇంగ్లండ్‌)ను ఓడించాడు.

నిరాశపరిచిన సమంత 
మహిళల జిమ్నాస్టిక్స్‌ వాల్ట్‌ ఫైనల్లో భారత జిమ్నాస్ట్‌ ప్రొతీస్థా సమంత నిరాశ పరిచింది. సమంత 12.883 పాయింట్లతో ఏడో స్థానంలో నిలిచింది. లియా మోనిక (కెనడా; 14.000 పాయింట్లు) స్వర్ణం, అబిగెయిల్‌ మార్టీన్‌ (ఇంగ్లండ్‌; 13.799 పాయింట్లు) రజతం, రోపెర్‌ (వేల్స్‌; 13.433 పాయింట్లు) కాంస్యం నెగ్గారు.

లాంగ్‌జంప్‌ ఫైనల్లో శ్రీశంకర్‌
అథ్లెటిక్స్‌ ఫీల్డ్‌ ఈవెంట్‌ లాంగ్‌జంప్‌లో భారత్‌ నుంచి ఇద్దరు ఫైనల్లోకి అడుగు పెట్టారు. 2022 బర్మింగ్‌హామ్‌ గేమ్స్‌లో రజతం నెగ్గిన శ్రీశంకర్‌తోపాటు లోకేశ్‌ సత్యనాథన్‌ ఫైనల్లోకి ప్రవేశించారు. క్వాలిఫయింగ్‌లో శ్రీశంకర్‌ 8.01 మీటర్ల దూరం గెంతి నేరుగా ఫైనల్‌కు చేరాడు. క్వాలిఫయింగ్‌ ప్రమాణం 8 మీటర్ల కావడంతో శ్రీశంకర్‌ నేరుగా ఫైనల్‌కు అర్హత సాధించాడు. లోకేశ్‌ 7.77 మీటర్ల దూరం గెంతి ఓవరాల్‌గా ఏడో స్థానంలో నిలిచి ఫైనల్‌ బెర్త్‌ను దక్కించుకున్నాడు. మరోవైపు పురుషుల 110 మీటర్ల హర్డిల్స్‌లో తేజస్‌ శిర్సే కూడా ఫైనల్లోకి ప్రవేశించాడు. హీట్‌ రేసును తేజస్‌ 13.76 సెకన్లలో ముగించి ఓవరాల్‌గా ఆరో స్థానంలో నిలిచి ఫైనల్‌కు చేరుకున్నాడు. పురుషుల 100 మీటర్ల విభాగంలో జాతీయ చాంపియన్‌ గురీందర్‌వీర్‌ సింగ్‌ సెమీఫైనల్‌కు అర్హత సాధించలేకపోయాడు. గురీందర్‌వీర్‌ 10.39 సెకన్లలో గమ్యానికి చేరి ఓవరాల్‌గా 28వ స్థానంలో నిలిచాడు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement