breaking news
Raja Muthupandi
-
వెయిట్లిఫ్టర్లకు నజరానా
న్యూఢిల్లీ: కామన్వెల్త్ క్రీడల్లో భారత వెయిట్‌లిఫ్టర్లు మొత్తం 8 పతకాలతో మెరిశారు. వీటిలో మీరాబాయి చాను స్వర్ణం గెలుచుకోగా... మరో 6 రజతాలు, 1 కాంస్యం భారత్ ఖాతాలో చేరాయి. రిషికాంత సింగ్, రాజా ముత్తుపండి, వల్లూరి అజయ్ బాబు, లవ్‌ప్రీత్ సింగ్, జ్ఞానేశ్వరి యాదవ్, హర్జీందర్ కౌర్‌లకు రజతం దక్కగా, బింద్యారాణి దేవి కాంస్యం సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో భారత లిఫ్టర్ల ప్రదర్శనపై కేంద్ర క్రీడా శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ ప్రశంసలు కురిపించారు. వారు తెచి్చన ప్రతీ మెడల్ దేశానికి గర్వకారణమని ఆయన అన్నారు. ‘భారత ఆటగాళ్లు ఎప్పుడు పతకం గెలిచినా పార్లమెంట్లో దాని గురించి ప్రకటన తర్వాత సభ ప్రారంభమయ్యేది. ఈసారి మన ముగ్గురు ఆటగాళ్లు పతకం సాధించడంలో విఫలమయ్యారు. అయితే వారు నిరాశపడవద్దు. ఒక ప్లేయర్ ఎప్పుడూ ఓడిపోడనే విషయం మర్చిపోవద్దు. ఓటమి ఎదురైనా పాఠాలు నేర్చుకొని మళ్లీ గెలిచేందుకు సిద్ధమవుతాడు’ అని మాండవీయ వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా వెయిట్లిఫ్టర్లను సన్మానించి నగదు పురస్కారాలు అందజేశారు. మీరాబాయికి రూ.30 లక్షలు... రజత, కాంస్య పతక విజేతలకు వరుసగా రూ. 20 లక్షలు, రూ.10ల చొప్పున చెక్‌లను మంత్రి అందించారు. -
కబడ్డీ నుంచి వెయిట్‌లిఫ్టింగ్ వైపు...
రాజా ముత్తుపండి స్వస్థలం తమిళనాడు రాష్ట్రం కోవిల్పట్టి సమీపంలోని శంకరలింగాపురం. తండ్రి ముత్తుపండి రోజూవారీ లేబర్ కాగా, తల్లి పెచ్చియమ్మాల్ ఒక అగ్గి పెట్టెల ఫ్యాక్టరీలో పని చేస్తుంది. చిన్నప్పటి నుంచి రాజా, అతని సోదరుడు సురేశ్ కబడ్డీ బాగా ఆడేవారు. సాయంత్రం ఫిట్నెస్ కోసం స్థానికంగా ఉండే జిమ్‌కు కూడా వారిద్దరు వెళ్లేవారు. రాజా శారీరక సామర్థ్యం, అతని పట్టుదల చూసిన కోచ్ అతడిని భవిష్యత్ బాగుంటుందంటూ వెయిట్‌లిఫ్టింగ్ వైపు మళ్లించాడు. ఇక్కడ అతను కఠోర శ్రమతో లిఫ్టింగ్‌లో ప్రతిభను ప్రదర్శించాడు. ఈ క్రమంలో మైలదుత్తురైలో ఉన్న స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్) హాస్టల్లో అతనికి సీటు లభించింది. ఆపై తగిన శిక్షణ, కోచ్‌ల మార్గనిర్దేశనంలో రాజా ఆట మెరుగైంది. 2017 యూత్/జూనియర్ కామన్వెల్త్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణ, రజతాలతో తొలిసారి రాజాకు గుర్తింపు దక్కింది. 2024లో జాతీయ రికార్డు నెలకొల్పిన అతను గత ఏడాది కామన్వెల్త్ చాంపియన్‌షిప్‌లో రజతం గెలిచాడు. గత ఏడాది వరల్డ్ చాంపియన్‌షిప్‌లో తన అత్యుత్తమ ప్రదర్శన (299 కేజీలు) నమోదు చేశాడు. 2018 కామన్వెల్త్ క్రీడల్లో ఆరో స్థానంలో నిలిచిన రాజా... 2022 కామన్వెల్త్ క్రీడలకు ముందు కాలికి అనూహ్య గాయంతో పోటీల నుంచి తప్పుకున్నాడు. ఇప్పుడు మూడో ప్రయత్నంలో అతనికి మెడల్ దక్కింది. రాజాకు తమిళనాడు ప్రభుత్వం రూ.30 లక్షల ప్రోత్సాహక బహుమతిని ప్రకటించింది. -
రజత రాజా... వెండి జ్ఞానేశ్వరి
గ్లాస్గో: కామన్వెల్త్ క్రీడల్లో భారత్ ఖాతాలో మరో మూడు పతకాలు చేరాయి. భారత వెయిట్‌లిఫ్టర్లు ఈ మూడు పతకాలు అందించారు. పురుషుల విభాగంలో రాజా ముత్తుపండి, మహిళల విభాగంలో జ్ఞానేశ్వరి యాదవ్‌లకు రజతాలు లభించగా... మణిపూర్ ప్లేయర్ బింద్యారాణి దేవి కాంస్య పతకాన్ని గెలుచుకుంది. ప్రస్తుతం భారత్ ఒక స్వర్ణం, 3 రజతాలు, 2 కాంస్యాలతో కలిపి ఆరు పతకాలతో ఎనిమిదో స్థానంలో ఉంది. ఆస్ట్రేలియా 42 పతకాలతో (18 స్వర్ణాలు, 9 రజతాలు, 15 కాంస్యాలు) అగ్రస్థానంలో కొనసాగుతోంది. మహిళల 53 కేజీల కేటగిరీలో జ్ఞానేశ్వరి యాదవ్ రజత పతకం గెలుచుకుంది. స్నాచ్‌లో 88 కేజీలు, క్లీన్ అండ్ జర్క్‌లో 111 కేజీల బరువెత్తి (మొత్తం 199 కేజీలు) ఆమె రెండో స్థానంలో నిలిచింది. నైజీరియాకు చెందిన ఒనోమ్ ఒమొలొలా దీదీ మొత్తం 206 కేజీలు (93+113) స్వర్ణం సాధించి కొత్త కామన్వెల్త్ గేమ్స్ రికార్డు నెలకొల్పగా... రెబెకా గ్రోక్స్ (కెనడా–178 కేజీలు) కాంస్యం అందుకుంది. స్నాచ్‌లో వరుసగా 82, 85, 88 కేజీల బరువుతో తన ప్రదర్శనను మెరుగుపర్చుకున్న జ్ఞానేశ్వరి...క్లీన్ అండ్ జర్క్‌లో కూడా వరుసగా మూడు ప్రయత్నాల్లో 103, 107, 111 కేజీల బరువును ఎత్తింది. వెయిట్‌లిఫ్టింగ్ పురుషుల విభాగంలో భారత్‌కు రాజా ముత్తుపండి రజతంతో మెరిశాడు. పురుషుల 65 కేజీల విభాగంలో రాజా రెండో స్థానంలో నిలిచాడు. స్నాచ్‌లో 126 కేజీలు, క్లీన్ అండ్ జర్క్‌లో 160 కేజీలు కలిపి మొత్తంగా 286 కేజీల బరువు ఎత్తిన రాజాకు రజతం లభించింది. ఈ ఈవెంట్లో అజ్నిల్ బిన్ బిదిన్ ముహమ్మద్ (మలేసియా) కామన్వెల్త్ రికార్డు 299 కేజీలు (133+166)తో స్వర్ణం గెలుచుకోగా, మోరియా బారు (పవువా న్యూ గినియా; 282 కేజీలు)కు కాంస్యం లభించింది. ఈసారి కాంస్యం.. మహిళల 58 కేజీల కేటగిరీలో బింద్యారాణి దేవి సొరొఖైబమ్కు కాంస్య పతకం దక్కింది. 2022 బర్మింగ్‌హామ్ కామన్వెల్త్ క్రీడల్లో రజతం గెలుచుకున్న ఆమె ఈసారి అంతకంటే మెరుగైన ప్రదర్శన ఇవ్వాలని బరిలోకి దిగినా... కాంస్యానికే పరిమితమైంది. ఒకదశలో స్వర్ణం దిశగా సాగుతున్నట్లు అనిపించినా... చివర్లో ఆమె తడబడింది. ఓవరాల్‌గా 199 కేజీలు (స్నాచ్‌లో 87 + క్లీన్ అండ్ జర్క్‌లో 112) బరువు ఎత్తిన బింద్యారాణి మూడో స్థానంతో ముగించింది. ఈ పోటీల్లో రఫియతు లవాల్ (నైజీరియా; 229 కేజీలు) కామన్వెల్త్ క్రీడల్లో రికార్డు ప్రదర్శనతో స్వర్ణం గెలుచుకోగా... ఆన్ సోఫీ (కెనడా; 215 కేజీలు)కు రజతం దక్కింది. బింద్యారాణి గతంలో కామన్వెల్త్ చాంపియన్‌షిప్ పోటీల్లో ఒక స్వర్ణం, 2 రజతాలు సాధించింది.పోలీస్ ఖాతాలో పతకం... ఛత్తీస్‌గఢ్‌లోని రాజ్‌నంద్‌గావ్‌కు చెందిన 23 ఏళ్ల జ్ఞానేశ్వరి అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ (ఏఎస్ఐ)గా పని చేస్తోంది. చిన్న వయసులో ముందు పవర్‌లిఫ్టింగ్‌పై ఆసక్తి చూపించిన ఆమెను వెయిట్‌లిఫ్టింగ్ మరింతగా ఆకర్షించింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక క్రీడాభివృద్ధి కార్యక్రమంలో భాగంగా జ్ఞానేశ్వరి వెలుగులోకి వచ్చింది. ఎల్రక్టీషియన్ అయిన తండ్రి దీపక్ యాదవ్ ఎన్నో ఆర్థిక సమస్యలు ఎదురైనా... కూతురిని ఆమె లక్ష్యం దిశగా ప్రోత్సహించడంలో ఎప్పుడూ వెనుకాడలేదు. జూనియర్ స్థాయిలో పలు విజయాలతో గుర్తింపు దక్కించుకున్న ఆమె... పాటియాలాలోనే ప్రతిష్టాత్మక నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్ (ఎన్ఐఎస్)లో శిక్షణ పొందుతోంది. గత ఏడాది ప్రపంచ చాంపియన్‌షిప్‌లో 5వ స్థానంలో నిలిచిన జ్ఞానేశ్వరి ఇటీవలే ఆసియా చాంపియన్‌షిప్‌లో కాంస్యం గెలుచుకుంది. ఈ కామన్వెల్త్ క్రీడల కోసం గ్లాస్గోలోని పరిస్థితులకు అలవాటు పడేందుకు కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహకారంతో బర్మింగ్‌హామ్‌లోని వార్లీ వెయిట్‌లిఫ్టింగ్ క్లబ్లో ప్రత్యేకంగా సిద్ధమై ఫలితం సాధించింది.ఫైనల్లో సాజన్ ప్రకాశ్ స్విమ్మింగ్ పురుషుల 200 మీటర్ల బటర్‌ఫ్లయ్ ఈవెంట్లో భారత స్టార్ సాజన్ ప్రకాశ్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. కేరళకు చెందిన ‘డబుల్ ఒలింపియన్’ సాజన్ హీట్–2లో 1ని:58.59 సెకన్లలో గమ్యానికి చేరి రెండో స్థానంలో నిలిచాడు. ఓవరాల్‌గా ఆరో ఫాస్టెస్ట్ స్విమ్మర్‌గా సాజన్ ఫైనల్లో చోటు సంపాదించాడు. క్వార్టర్స్‌లో అంకుశ్, సచిన్ పురుషుల బాక్సింగ్ ఈవెంట్లో భారత బాక్సర్లు అంకుశ్, సచిన్ సివాచ్ క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. పతకాలు ఖరారు చేసుకోవడానికి విజయం దూరంలో నిలిచారు. 80 కేజీల ప్రిక్వార్టర్ ఫైనల్లో అంకుశ్ 5:0తో జాన్ జలాన్ (అంటిగ్వా అండ్ బార్బుడా)పై గెలుపొందగా... 60 కేజీల ప్రిక్వార్టర్ ఫైనల్లో సచిన్ 4:1తో విలియమ్ హెవిట్ (ఇంగ్లండ్)ను ఓడించాడు.నిరాశపరిచిన సమంత మహిళల జిమ్నాస్టిక్స్ వాల్ట్ ఫైనల్లో భారత జిమ్నాస్ట్ ప్రొతీస్థా సమంత నిరాశ పరిచింది. సమంత 12.883 పాయింట్లతో ఏడో స్థానంలో నిలిచింది. లియా మోనిక (కెనడా; 14.000 పాయింట్లు) స్వర్ణం, అబిగెయిల్ మార్టీన్ (ఇంగ్లండ్; 13.799 పాయింట్లు) రజతం, రోపెర్ (వేల్స్; 13.433 పాయింట్లు) కాంస్యం నెగ్గారు.లాంగ్‌జంప్ ఫైనల్లో శ్రీశంకర్అథ్లెటిక్స్ ఫీల్డ్ ఈవెంట్ లాంగ్‌జంప్‌లో భారత్ నుంచి ఇద్దరు ఫైనల్లోకి అడుగు పెట్టారు. 2022 బర్మింగ్‌హామ్ గేమ్స్‌లో రజతం నెగ్గిన శ్రీశంకర్తోపాటు లోకేశ్ సత్యనాథన్ ఫైనల్లోకి ప్రవేశించారు. క్వాలిఫయింగ్‌లో శ్రీశంకర్ 8.01 మీటర్ల దూరం గెంతి నేరుగా ఫైనల్‌కు చేరాడు. క్వాలిఫయింగ్ ప్రమాణం 8 మీటర్ల కావడంతో శ్రీశంకర్ నేరుగా ఫైనల్‌కు అర్హత సాధించాడు. లోకేశ్ 7.77 మీటర్ల దూరం గెంతి ఓవరాల్‌గా ఏడో స్థానంలో నిలిచి ఫైనల్ బెర్త్‌ను దక్కించుకున్నాడు. మరోవైపు పురుషుల 110 మీటర్ల హర్డిల్స్‌లో తేజస్ శిర్సే కూడా ఫైనల్లోకి ప్రవేశించాడు. హీట్ రేసును తేజస్ 13.76 సెకన్లలో ముగించి ఓవరాల్‌గా ఆరో స్థానంలో నిలిచి ఫైనల్‌కు చేరుకున్నాడు. పురుషుల 100 మీటర్ల విభాగంలో జాతీయ చాంపియన్ గురీందర్వీర్ సింగ్ సెమీఫైనల్‌కు అర్హత సాధించలేకపోయాడు. గురీందర్వీర్ 10.39 సెకన్లలో గమ్యానికి చేరి ఓవరాల్‌గా 28వ స్థానంలో నిలిచాడు. -
కామన్వెల్త్ హీరోకు సీఎం విజయ్ భారీ నజరానా
స్కాట్లాండ్లోని గ్లాస్గోలో జరుగుతున్న 2026 కామన్వెల్త్ గేమ్స్‌లో పతకం సాధించిన తమిళనాడు వెయిట్‌లిఫ్టర్ రాజా ముత్తుపాండికి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ భారీ నజరానా ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున రూ.30 లక్షల నగదు బహుమతి అందజేస్తామని వెల్లడించారు. ఈ సందర్భంగా సీఎం విజయ్ ముత్తుపాండిని అభినందించారు. ఆయన సాధించిన విజయం తమిళనాడుకు గర్వకారణమని అన్నారు. ముత్తుపాండి విజయం యువ క్రీడాకారులకు స్ఫూర్తిగా నిలుస్తుందని, భవిష్యత్తులో మరిన్ని అంతర్జాతీయ విజయాలు సాధించి రాష్ట్రం, దేశానికి మరింత పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ముత్తుపాండి తమిళనాడులోని కోవిల్పట్టికి చెందినవారు.కాగా, ముత్తుపాండి కామన్వెల్త్ క్రీడల పురుషుల 65 కిలోల వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో రజత పతకం సాధించాడు.స్నాచ్ విభాగంలో తొలి ప్రయత్నంలో 126 కిలోలు ఎత్తడంలో విఫలమైన ముత్తుపాండి, రెండో ప్రయత్నంలో అదే బరువును విజయవంతంగా ఎత్తాడు. అనంతరం 129 కిలోల ప్రయత్నం విఫలమైనప్పటికీ, 126 కిలోలతో ఆ విభాగాన్ని ముగించాడు.క్లీన్ అండ్ జర్క్‌లో కూడా తొలి ప్రయత్నంలో 158 కిలోలు ఎత్తలేకపోయిన ముత్తుపాండి, రెండో ప్రయత్నంలో 160 కిలోలు విజయవంతంగా ఎత్తి మొత్తం 286 కిలోల లిఫ్ట్‌తో రజత పతకాన్ని కైవసం చేసుకున్నాడు. -
‘వెండి’ కెరటం.. మోచేయి విరిగినా పట్టువదలని విక్రమార్కుడు!
కామన్వెల్త్ గేమ్స్‌లో వెయిట్‌లిఫ్టింగ్‌లో భారత్‌కు మూడో పతకం వచ్చిన సంగతి తెలిసిందే. ఆదివారం రాత్రి పురుషుల 65 కేజీల విభాగంలో జరిగిన ఫైనల్లో రాజా ముత్తుపాండి రజతం గెలుచుకున్నాడు. 26 ఏళ్ల రాజా ముత్తుపాండి స్నాచ్ విభాగంలో 126 కేజీలు, క్లీన్ అండ్ జెర్క్ కేటగిరీలో 160 కేజీలు ఎత్తి మొత్తంగా 286 కేజీల బరువు ఎత్తి వెండిని కొల్లగొట్టాడు. పెద్దగా అంచనాలు లేకుండా బరిలోకి దిగి పతకం కొల్లగొట్టిన రాజా ముత్తుపాండి ఓవర్‌నైట్ స్టార్‌గా మారిపోయాడు. మరి ఎవరీ రాజా ముత్తుపాండి? అతడి నేపథ్యం ఏంటనేది ఇప్పుడు తెలుసుకుందాం.తొలి ప్రయత్నంలోనే స్వర్ణం..జనవరి 12, 2000న జన్మించిన రాజా ముత్తుపాండి, ఇండియన్ రైల్వేస్‌కు వెయిట్‌లిఫ్టర్‌గా ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. 2017లో కామన్వెల్త్ యూత్/జూనియర్ ఛాంపియన్‌షిప్‌లలో స్వర్ణ, రజత పతకాలతో రాజా ముత్తుపాండి తన ప్రస్థానాన్ని ప్రారంభించాడు. ఆ తర్వాత 2019, 2022లో జాతీయ టైటిళ్లను గెలుచుకున్న ముత్తుపాండి వెయిట్‌లిఫ్టింగ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించాడు. మోచేతికి తీవ్రగాయం..అయితే కెరీర్ పీక్ దశలో ఉన్నప్పుడే 2019లో రాజా ముత్తుపాండి మోచేతి గాయానికి గురయ్యాడు. మోచేతి లిగ్మెంట్‌లో చీలిక రావడంతో బరువులు ఎత్తొద్దని డాక్టర్లు చెప్పడంతో రాజా ముత్తుపాండి కెరీర్ ముగిసినట్లేనని అంతా భావించారు. కానీ రెండేళ్ల పాటు ఆటకు దూరంగా ఉన్న రాజా ముత్తుపాండి పట్టువదలని విక్రమార్కుడిలా మోచేతి గాయం నుంచి కోలుకొని తన ప్రస్థానాన్ని మళ్లీ మొదటి నుంచే మొదలుపెట్టాడు. ఈ క్రమంలో రాజా ముత్తుపాండి 2024లో రాజా 61 కేజీల విభాగంలో 289 కేజీల బరువు ఎత్తి జాతీయ రికార్డు బద్దలు కొట్టాడు. ఇక 2025లో అహ్మదాబాద్‌లో జరిగిన కామన్వెల్త్ ఛాంపియన్‌షిప్‌లో (296 కేజీల బరువు ఎత్తి) రజతం గెలుచుకున్నాడు. నార్వేలోని ఫోర్డేలో జరిగిన ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లలో 65 కేజీల విభాగంలో తొమ్మిదవ స్థానంలో నిలిచిన రాజా ముత్తుపాండి 299 కేజీల (130 కేజీల స్నాచ్ + 169 కేజీల క్లీన్ అండ్ జర్క్) బరువు ఎత్తి వ్యక్తిగత అత్యుత్తమ ప్రదర్శనను నమోదు చేశాడు. తద్వారా 2028 లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్‌కు భారత్ తరఫున ప్రాతినిధ్యం వహించేందుకు రాజా ముత్తుపాండి ఉవ్విళ్లూరుతున్నాడు. ఇదే ఏడాది సీనియర్ వెయిట్‌లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌లో 302 కేజీల బరువు ఎత్తిన రాజా ముత్తుపాండి జాతీయ టైటిల్‌ను కూడా సొంతం చేసుకున్నాడు. Proud Moment for Indian Weightlifting!Many congratulations to Raja Muthupandi for clinching Silver in Men's 65kg Weightlifting. #Cheer4Bharat #CWG2026 pic.twitter.com/qjldVR9ja5— Dr Mansukh Mandaviya (@mansukhmandviya) July 27, 2026CWG 2026: On winning the silver medal in the men's 65kg weightlifting event at the Commonwealth Games 2026, Muthupandi Raja says, "I did not perform well enough to win the gold, and it was not my best compared to how I had been performing in training. Still, I am happy to have… pic.twitter.com/OEuklfSq3h— IANS (@ians_india) July 26, 2026


