సాక్షి, హైదరాబాద్: దేశవాళీ టీ20 క్రికెట్ టోర్నీ ముస్తాక్ అలీ ట్రోఫీ (SMAT)లో పాల్గొనే హైదరాబాద్ సీనియర్ జట్టును సెలక్షన్ కమిటీ శుక్రవారం ప్రకటించింది. పదిహేను మంది సభ్యుల ఈ టీమ్‌కు సీవీ మిలింద్ కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు. కాగా సీనియర్ ఐపీఎస్ అధికారి సీవీ ఆనంద్ కుమారుడే ఈ మిలింద్ అన్న విషయం తెలిసిందే.
ఇకఎలైట్ గ్రూప్ ‘బి’లో భాగంగా ఉన్న హైదరాబాద్ తమ మ్యాచ్‌లన్నీ కోల్‌కతాలోనే ఆడుతుంది. ఏడు లీగ్ మ్యాచ్‌ల్లో మూడు ఈడెన్ గార్డెన్స్‌లో, నాలుగు జాదవ్‌పూర్ యూనివర్సిటీ గ్రౌండ్‌లో జరుగుతాయి. తొలి పోరులో ఈ నెల 26న మధ్యప్రదేశ్‌తో హైదరాబాద్ తలపడుతుంది. ఈ గ్రూప్‌లో మరో ఆరు జట్లు మహారాష్ట్ర, గోవా, ఉత్తరప్రదేశ్, జమ్మూ కశ్మీర్, బిహార్, చండీగఢ్ ఉన్నాయి.

తిలక్ వర్మ బిజీబిజీ
ఇదిలా ఉంటే.. ఈ దేశీ టీ20 టోర్నీలో టీమిండియా స్టార్ తిలక్ వర్మ గతేడాది హైదరాబాద్ జట్టును ముందుకు నడిపించాడు. అయితే, సౌతాఫ్రికాతో మూడు మ్యాచ్‌ల వన్డే, ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ నేపథ్యంలో తిలక్ జాతీయ జట్టు విధుల్లో బిజీగా గడుపనున్నాడు.
ఈ నేపథ్యంలో తిలక్ స్థానంలో మిలింద్‌కు హైదరాబాద్ కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తోంది. కాగా స్వదేశంలో నవంబరు 22 నుంచి డిసెంబరు 19 మధ్య టీమిండియా సౌతాఫ్రికాతో వన్డే, టీ20 సిరీస్‌లు ఆడనుంది.
ముస్తాక్ అలీ టీ20 ట్రోఫీకి హైదరాబాద్ జట్టు
సీవీ మిలింద్ (కెప్టెన్), తనయ్ త్యాగరాజన్ (వైస్ కెప్టెన్), తన్మయ్ అగర్వాల్, అమన్ రావు, హెచ్‌కే సింహా, ఆశిష్ శ్రీవాత్సవ, నితేశ్ కనాల, అజయ్‌దేవ్ గౌడ్, ప్రజ్ఞయ్ రెడ్డి (వికెట్ కీపర్), భవేశ్ సేఠ్ (వికెట్ కీపర్), నితిన్ సాయి యాదవ్, రక్షణ్ రెడ్డి, ఎండీ అర్ఫాజ్, రిషికేత్ సిసోడియా, రాహుల్ బుద్ధి.
చదవండి: వైభవ్ మెరుపులు వృధా.. ఆసియా కప్ సెమీస్‌లో టీమిండియా ఓటమి


