న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌కు ముందు టీమిండియా స్టార్ బ్యాటర్ తిలక్ వర్మకు గాయమైందని తెలుస్తుంది. విజయ్ హజారే ట్రోఫీ మ్యాచ్ కోసం (జమ్మూ అండ్ కశ్మీర్‌తో) రాజ్‌కోట్‌లో ఉన్న తిలక్‌కు ఉన్నట్టుండి వృషణాల్లో తీవ్రమైన నొప్పి వచ్చింది. సమీపంలోని గోకుల్ ఆసుపత్రికి తరలించి స్కాన్స్ తీయించగా.. "టెస్టిక్యులర్ టోర్షన్" అని నిర్ధారణ అయ్యింది.
దీంతో హుటాహుటిన శస్త్రచికిత్ర చేశారు. చికిత్స విజయవంతమైనట్లు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం తిలక్ ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉన్నప్పటికీ.. అతని తదుపరి క్రికెట్ షెడ్యూల్ సందిగ్దంలో పడింది. త్వరలో ప్రారంభం కానున్న న్యూజిలాండ్ టీ20 సిరీస్‌తో పాటు టీ20 వరల్డ్‌కప్‌లో అతను పాల్గొనడం అనుమానంగా మారింది.
ఈ నేపథ్యంలో తిలక్ ప్రత్యామ్నాయం ఎవరనే దానిపై చర్చ మొదలైంది. లిస్ట్‌లో నలుగురి పేర్లు వినిపిస్తున్నాయి. ఇందులో ప్రధానంగా వినిపిస్తున్న పేరు భారత టెస్ట్, వన్డే జట్టు కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌ది. ఫామ్‌లో లేని కారణంగా గిల్‌కు న్యూజిలాండ్ సిరీస్‌తో పాటు ప్రపంచకప్ జట్టులోనూ చోటు దక్కలేదు.
తిలక్ గాయం పుణ్యమా అని అతడికి సువర్ణావకాశం లభించినా లభించవచ్చు. టీ20 బెర్త్‌పై ఆశలు వదులుకున్న గిల్‌కు తిలక్ రూపంలో అదృష్టం వరించేలా ఉందన్న చర్చ ఇప్పటికే మొదలైంది. బీసీసీఐలో గిల్‌కు ఉన్న పలుకుబడికి న్యూజిలాండ్ సిరీస్‌తో పాటు ప్రపంచకప్ బెర్త్ కూడా దక్కవచ్చు.
అయితే అవకాశాలు గిల్‌కు మాత్రమే పరిమితం కాలేదు. రేసులో శ్రేయస్ అయ్యర్, రుతురాజ్ గైక్వాడ్, దేవదత్ పడిక్కల్ లాంటి వారు కూడా ఉన్నారు.
ఎందుకంటే.. తిలక్ వన్‌డౌన్‌లో లేదా నాలుగో స్థానంలో బరిలోకి దిగే బ్యాటర్. గిల్‌ను ఈ స్థానాల్లో బ్యాటింగ్‌కు పంపడమంటే ప్రయోగమవుతంది. కాబట్టి సెలెక్టర్లు వన్‌డౌన్‌లో లేదా నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేయగల సత్తా ఉన్న రుతురాజ్, పడిక్కల్, శ్రేయస్ పేర్లను పరిశీలించవచ్చు.
పైగా వీరంతా సూపర్ ఫామ్‌లో ఉన్నారు. ముఖ్యంగా పడిక్కల్, రుతురాజ్ విజయ్ హజారే ట్రోఫీలో ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నారు. పడిక్కల్ 6 మ్యాచ్‌ల్లో నాలుగు సెంచరీలు చేసి పీక్స్‌లో ఉండగా.. రుతురాజ్ తాజాగా ఓ సెంచరీ చేయడంతో పాటు గత నాలుగు మ్యాచ్‌ల్లో మరో సెంచరీ, ఓ హాఫ్ సెంచరీ చేశాడు.
వీరితో పాటు శ్రేయస్‌కు కూడా అవకాశాలు లేకపోలేదు. మిడిలార్డర్‌లో తిలక్ స్థానానికి అతడు సరైన న్యాయం చేయగల సమర్థుడు. మొత్తంగా తిలక్ న్యూజిలాండ్ సిరీస్‌తో పాటు టీ20 ప్రపంచకప్‌కు దూరమైతే, ఆ బెర్త్ భర్తీ చేసేందుకు నలుగురు పోటీలో ఉంటారు. తిలక్ గాయంపై బీసీసీఐ అధికారిక అప్‌డేట్ తర్వాత ఈ విషయంపై క్లారిటీ వస్తుంది.


