త్వరలో న్యూజిలాండ్‌తో జరుగబోయే ఐదు మ్యాచ్‌ల టీ20 ముందు టీమిండియాకు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. స్టార్ బ్యాటర్ తిలక్ వర్మకు అనూహ్యంగా ఆరోగ్య సమస్య తలెత్తింది. విజయ్ హజారే ట్రోఫీ మ్యాచ్ కోసం (జమ్మూ అండ్ కశ్మీర్‌తో) రాజ్‌కోట్‌లో ఉన్న తిలక్‌కు ఉన్నట్టుండి వృషణాల్లో తీవ్రమైన నొప్పి వచ్చింది.
సమీపంలోని గోకుల్ ఆసుపత్రికి తరలించి స్కాన్స్ తీయించగా.. "టెస్టిక్యులర్ టోర్షన్" అని నిర్ధారణ అయ్యింది. దీంతో హుటాహుటిన శస్త్రచికిత్స చేశారు. చికిత్స విజయవంతమైనట్లు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం తిలక్ ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉన్నప్పటికీ.. అతని తదుపరి క్రికెట్ షెడ్యూల్ మాత్రం సందిగ్దంలో పడింది. త్వరలో ప్రారంభం కానున్న న్యూజిలాండ్ టీ20 సిరీస్‌తో పాటు టీ20 వరల్డ్‌కప్‌లో తిలక్ పాల్గొనడం అనుమానంగా మారింది.
తిలక్‌కు ఎంత కాలం రెస్ట్ అవసరం అన్న విషయం తెలియరాలేదు. అయితే జనవరి 21 నుంచి ప్రారంభమయ్యే సిరీస్‌కు మాత్రం తప్పక దూరమవుతాడని తెలుస్తుంది. అలాగే ఫిబ్రవరి 7 నుంచి ప్రారంభమయ్యే టీ20 ప్రపంచకప్-2026లో పాల్గొనడం కూడా సందేహాస్పదంగా మారింది. ఒకవేళ తిలక్ ప్రపంచకప్‌కు నిజంగా దూరమైతే టీమిండియా విజయావకాశాలు తప్పక ప్రభావితమవుతాయి.
తిలక్ గత రెండేళ్లుగా స్థిరంగా రాణిస్తూ టీమిండియాలో అత్యంత విశ్వసనీయ బ్యాటర్‌గా ఎదిగాడు. ప్రపంచకప్ ప్రణాళికల్లో తిలక్ కీలక భాగంగా ఉన్నాడు. ఇలాంటి తరుణంలో అతను అనారోగ్యానికి గురి కావడం టీమిండియాకు భారీ ఎదురుదెబ్బగా పరిగణించబడుతుంది. తిలక్ విషయం తెలిసి అభిమానులు ఆందోళన చెందుతున్నారు.


