న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌కు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఎంపిక చేసిన జట్టుపై విమర్శలు కొనసాగుతున్నాయి. గత వన్డే సిరీస్ (సౌతాఫ్రికా)తో పోలిస్తే.. ఈసారి ముగ్గురు క్రికెటర్లు తమ స్థానాలు కోల్పోయారు. రిషభ్ పంత్ ఆట, వన్డేల్లో అతడి సగటు, వైఫల్యాలపై చర్చ జరుగుతున్నా... రెండో వికెట్ కీపర్‌గా అతడికే పట్టం కట్టారు సెలక్టర్లు.
అయితే.. మరో వికెట్ కీపర్ ధ్రువ్ జురేల్ (Dhruv Jurel)పై మాత్రం వేటు పడింది. ఇక హైదరాబాదీ బ్యాటర్ తిలక్ వర్మ (Tilak Varma) కూడా జట్టులో స్థానం కోల్పోయాడు. తిలక్‌ను విశాఖపట్నంలో మూడో వన్డేకు తుది జట్టులోకి తీసుకున్నా...బ్యాటింగ్ రాకపోగా, జురేల్‌కు వన్డేల్లో అరంగేట్రం చేసే అవకాశమే రాలేదు.
శ్రేయస్ అయ్యర్ పునరాగమనంతో
మరోవైపు.. సౌతాఫ్రికాతో రెండో వన్డేలో సెంచరీ సాధించినా రుతురాజ్ గైక్వాడ్‌పై కూడా వేటు పడింది. దేశీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీ 2025-26 సీజన్‌లోనూ దుమ్ములేపుతున్నా అతడికి నిరాశే మిగిలింది. మిడిలార్డర్‌లో శ్రేయస్ అయ్యర్ పునరాగమనంతో రుతురాజ్ స్థానం కోల్పోక తప్పలేదు.
అయితే, రుతు విషయంలో సెలక్టర్లు తీసుకున్న నిర్ణయాన్ని భారత మాజీ కెప్టెన్, టీమిండియా మాజీ చీఫ్ సెలక్టర్ క్రిష్ణమాచారి శ్రీకాంత్ విమర్శించాడు. ‘‘జట్టులో స్థానం కోసం రుతురాజ్ తనలోని మరో నైపుణ్యం గురించి సెలక్టర్లకు చెప్పాలేమో!.. ‘నేను ధోనితో కలిసి ఆడాను.. వికెట్ కీపింగ్ కూడా చేయగలను’ అని చెప్పాలి.

అదొక్కటే మార్గం
జట్టులోకి తిరిగి వచ్చేందుకు అతడికి అదొక్కటే మార్గం. శ్రేయస్ అయ్యర్ కచ్చితంగా జట్టులో ఉండాలి. అదే సమయంలో పదిహేను మంది సభ్యులలో రుతురాజ్ కూడా ఉండాలి. నితీశ్ కుమార్ రెడ్డికి బదులు అతడిని జట్టులోకి తీసుకోవాల్సింది.
నువ్వు సెంచరీ చేశావని తెలిసినా రుతు వంటి ఆటగాళ్లకు చోటు ఇవ్వమని చెప్పడం సరికాదు. దేశీ క్రికెట్‌లో మళ్లీ సత్తా చాటి అతడు తనను తాను నిరూపించుకోవాల్సిందే’’ అని చిక్కా అభిప్రాయపడ్డాడు. కాగా టీమిండియా- న్యూజిలాండ్ మధ్య ఈ నెల 11, 14, 18 తేదీల్లో వరుసగా వడోదర, రాజ్‌కోట్, ఇండోర్‌లలో వన్డేలు జరుగుతాయి.
న్యూజిలాండ్‌తో వన్డేలకు భారత జట్టు
శుబ్‌మన్ గిల్ (కెప్టెన్), శ్రేయస్ అయ్యర్ (వైస్ కెప్టెన్), రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్, రిషభ్ పంత్, నితీశ్ కుమార్ రెడ్డి, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, మొహమ్మద్ సిరాజ్, ప్రసిధ్ కృష్ణ, అర్ష్‌దీప్ సింగ్.


