ఏసీసీ మెన్స్ ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ టోర్నీలో (ACC Men's Asia Cup Rising Stars 2025) భాగంగా భారత్-ఏ-బంగ్లాదేశ్-ఏ జట్ల మధ్య ఇవాళ (నవంబర్ 21) జరిగిన తొలి సెమీఫైనల్ నరాలు తెగే ఉత్కంఠ నడుమ సాగింది.
దోహా వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ సూపర్ ఓవర్‌లో విజయం సాధించి, ఫైనల్‌కు దూసుకెళ్లింది. నిర్ణీత ఓవర్లలో ఇరు జట్లు సమానమైన స్కోర్లు చేయగా మ్యాచ్ సూపర్ ఓవర్‌కు దారి తీసింది.
ఇందులో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ ఖాతా తెరవకుండానే 2 వికెట్లూ కోల్పోగా.. సుయాశ్ శర్మ వైడ్ వేసి బంగ్లాదేశ్‌ను గెలిపించాడు. పాకిస్తాన్-ఏ, శ్రీలంక-ఏ జట్ల మధ్య ఇవాళ రాత్రే జరిగే రెండో సెమీఫైనల్ విజేతతో బంగ్లాదేశ్-ఏ నవంబర్ 23న జరిగే ఫైనల్లో అమీతుమీ తేల్చుకుంటుంది.
బంగ్లాదేశ్ భారీ స్కోర్
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్.. ఓపెనర్ హబిబుర్ రెహ్మాన్ సోహన్ (46 బంతుల్లో 65; 3 ఫోర్లు, 5 సిక్సర్లు), మెహ్రబ్ (18 బంతుల్లో 48 నాటౌట్; ఫోర్, 6 సిక్సర్లు) చెలరేగడంతో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 194 పరుగుల భారీ స్కోర్ చేసింది.
భారత బౌలర్లలో గుర్‌జప్నీత్ సింగ్ (4-0-39-2), హర్ష్ దూబే (4-0-22-1), సుయాశ్ శర్మ (4-0-17-1) అద్భుతంగా బౌలింగ్ చేయగా.. రమన్‌దీప్ సింగ్ (2-0-29-1), నమన్ ధిర్ (2-0-33-1) పర్వాలేదనిపించారు.
వైభవ్ మెరుపులు వృధా
భారీ లక్ష్య ఛేదనలో భారత్‌కు మెరుపు ఆరంభం లభించినప్పటికీ.. ప్రయోజనం లేకుండా పోయింది. ఓపెనర్లు వైభవ్ సూర్యవంశీ (15 బంతుల్లో 38; 2 ఫోర్లు, 5 సిక్సర్లు), ప్రియాంశ్ ఆర్య (23 బంతుల్లో 44; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపులు వృధా అయ్యాయి.
జితేశ్ శర్మ (33), నేహల్ వధేరా (32 నాటౌట్), ఆఖర్లో రమన్‌దీప్ (17), అశుతోష్ శర్మ (13) సత్తా చాటడంతో అతి కష్టం మీద నిర్ణీత ఓవర్లలో స్కోర్లు సమమయ్యాయి.
అయితే సూపర్ ఓవర్‌లో భారత్ బొక్క బోర్లా పడింది. తొలి రెండు బంతులకు వికెట్లు జితేశ్, అశుతోష్ ఔట్ కావడంతో ఖాతా కూడా తెరవలేకయింది. అనంతరం బంగ్లాదేశ్ సైతం తొలి బంతికే వికెట్ కోల్పోగా.. రెండో బంతిని సుయాశ్ శర్మ వైడ్‌గా వేయడంతో బంగ్లాదేశ్ గెలుపొందింది.
చదవండి: భారత్‌తో పరిమిత ఓవర్ల సిరీస్‌ల కోసం సౌతాఫ్రికా జట్ల ప్రకటన


