సాక్షి, హైదరాబాద్: సర్ఫరాజ్ ఖాన్ (142 బ్యాటింగ్; 11 ఫోర్లు, 5 సిక్స్‌లు), కెప్టెన్ సిద్ధేశ్ లాడ్ (104; 10 ఫోర్లు, 2 సిక్స్‌లు) ‘శత’క్కొట్టారు. ఫలితంగా రంజీ ట్రోఫీ గ్రూప్ ‘డి’లో భాగంగా ఉప్పల్ స్టేడియం వేదికగా హైదరాబాద్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై భారీ స్కోరు దిశగా సాగుతోంది.
తొలి రోజు ఆట ముగిసే సమయానికి ముంబై 87 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 332 పరుగులు చేసింది. ఓపెనర్లు అఖిల్ (27), ఆకాశ్ ఆనంద్ (35)లతో పాటు ముషీర్ ఖాన్ (11) విఫలమయ్యారు. 82/3తో కష్టాల్లో పడ్డ ముంబైను సిద్ధేశ్, సర్ఫరాజ్ ఆదుకున్నారు. నాలుగో వికెట్‌కు 249 పరుగులు జత చేశారు.
తొలి రోజు ఆట ముగుస్తుందనగా సిద్ధేశ్ అవుటయ్యాడు. హిమాన్షు (0 బ్యాటింగ్)తో కలిసి సర్ఫరాజ్ క్రీజులో ఉన్నాడు. హైదరాబాద్ బౌలర్లలో రోహిత్ రాయుడు రెండు వికెట్లు పడగొట్టగా... సిరాజ్, నితిన్ సాయి యాదవ్ చెరో వికెట్ ఖాతాలో వేసుకున్నారు.


