దేశవాళీ టి20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో హైదరాబాద్, ఆంధ్ర జట్లు సూపర్ లీగ్ దశకు అర్హత సాధించాయి. తమ చివరి లీగ్ మ్యాచ్‌లలో ఓడినా... ఈ రెండు టీమ్‌లు ముందంజ వేయడంలో సఫలమయ్యాయి. గ్రూప్ ‘బి’లో ఆడిన 7 మ్యాచ్‌లలో 5 గెలిచి, 2 ఓడిన హైదరాబాద్ మొత్తం 20 పాయింట్లతో అగ్ర స్థానం సాధించగా, గ్రూప్ ‘ఎ’లో ఆడిన 7 మ్యాచ్‌లలో 5 గెలిచి, 2 ఓడిన ఆంధ్ర 20 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచి క్వాలిఫై అయ్యాయి.
సోమవారం జరిగిన చివరి లీగ్‌లో హైదరాబాద్ 4 వికెట్ల తేడాతో చండీగఢ్ చేతిలో పరాజయం పాలైంది. ముందుగా హైదరాబాద్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 146 పరుగులు చేసింది. ప్రజ్ఞయ్ రెడ్డి (43; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు), అమన్ రావు (33; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు), తనయ్ త్యాగరాజన్ (27; 2 సిక్స్‌లు) రాణించారు. అనంతరం చండీగఢ్ 19.5 ఓవర్లలో 6 వికెట్లకు 147 పరుగులు సాధించింది.
సత్యనారాయణ రాజుకు 4 వికెట్లు
విదర్భతో లక్నోలో జరిగిన మ్యాచ్‌లో ఆంధ్ర 19 పరుగుల తేడాతో ఓడింది. ముందుగా విదర్భ 20 ఓవర్లలో 8 వికెట్లకు 154 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అమన్ మోఖడే (35 బంతుల్లో 50; 7 ఫోర్లు), అక్షయ్ వాడ్కర్ (41; 2 సిక్స్‌లు) రాణించగా... ఆంధ్ర బౌలర్ సత్యనారాయణ రాజు 4 వికెట్లు పడగొట్టాడు. అనంతరం
ఆంధ్ర 20 ఓవర్లలో 9 వికెట్లకు 135 పరుగులే చేయగలిగింది. పైలా అవినాశ్ (44; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు), రికీ భుయ్ (26; 2 సిక్స్‌లు) మినహా అంతా విఫలమయ్యారు. యశ్ ఠాకూర్ 4 వికెట్లతో ఆంధ్రను దెబ్బ తీశాడు.
పుణేలో ‘సూపర్ లీగ్’ మ్యాచ్‌లు
టోరీ్నలో భాగంగా ‘సూపర్ లీగ్’ దశకు చేరిన 8 జట్లను 2 గ్రూప్‌లుగా విభజించారు. గ్రూప్ ‘ఎ’లో మధ్యప్రదేశ్, పంజాబ్, జార్ఖండ్‌లతో ఆంధ్ర తలపడనుండగా... గ్రూప్ ‘బి’లో ముంబై, రాజస్తాన్, హరియాణాలతో హైదరాబాద్ తలపడుతుంది. ఈ మూడు మ్యాచ్‌లు వరుసగా ఈ నెల 12, 14, 16 తేదీల్లో జరుగుతాయి. రెండు గ్రూప్‌ల్లో అగ్రస్థానంలో నిలిచిన జట్లు 18న ఫైనల్లో తలపడతాయి. ‘సూపర్ లీగ్’ మ్యాచ్‌లు పుణేలో నిర్వహిస్తారు.
చదవండి: SMAT 2025: సాయి సుదర్శన్ విధ్వంసకర శతకం


