సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీ-2025లో భాగంగా సౌరాష్ట్రతో ఇవాళ (డిసెంబర్ 8) జరిగిన మ్యాచ్‌లో తమిళనాడు ఆటగాడు, టీమిండియా ప్లేయర్ సాయి సుదర్శన్ చెలరేగిపోయాడు. 55 బంతుల్లో 10 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో అజేయమైన 101 పరుగులు చేశాడు.
ఫలితంగా తమిళనాడు 3 వికెట్ల తేడాతో సౌరాష్ట్రను చిత్తు చేసింది. సాయి సుదర్శన్ ఒంటిచేత్తో తమిళనాడును విజయతీరాలకు చేర్చాడు. లక్ష్య ఛేదనలో మిగతా బ్యాటర్లు వరుసగా ఔటైనా, టెయిలెండర్ సన్నీ సంధు (30) సాయంతో తన జట్టును గెలిపించాడు.
తొలుత బ్యాటింగ్ చేసిన సౌరాష్ట్ర.. విశ్వరాజ్ జడేజా (70), సమ్మద్ గజ్జర్ (66) మెరుపు అర్ద శతకాలతో రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసింది. సౌరాష్ట్ర ఇన్నింగ్స్‌లో వీరిద్దరు మినహా ఎవరూ రాణించలేకపోయారు. తమిళనాడు బౌలర్లలో సిలంబరసన్ 3, ఎసక్కిముత్తు 2, సన్నీ సంధు, రాజ్‌కుమార్ తలో వికెట్ తీశారు.
అనంతరం ఛేదనలో తమిళనాడు కూడా తడబడింది. ఆది నుంచే వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయి ఒత్తిడిలో పడింది. అయితే సాయి సుదర్శన్ ఒక్కడు ఏమాత్రం ఒత్తిడికి లోను కాకుండా ఒంటిచేత్తో తన జట్టును విజయతీరాలకు చేర్చాడు.
తొలుత రిత్విక్ ఈశ్వరన్ (29), ఆఖర్లో సన్నీ సంధు సహకారంతో తన జట్టును గెలిపించుకున్నాడు. సుదర్శన్ దెబ్బకు తమిళనాడు 18.4 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 185 పరుగులు చేసింది. జయదేవ్ ఉనద్కత్ (4-0-30-3), అంకుర్ పవార్ (3.4-0-26-2) తమిళనాడు ఆటగాళ్లను ఇరుకున పెట్టినప్పటికీ సాయి సుదర్శన్ వారిపై ఎదురుదాడి చేసి విజయం సాధించాడు.


