దక్షిణాఫ్రికాపై మూడో వన్డేలో సూపర్ సెంచరీ అనంతరం టీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ కీలక నిర్ణయం తీసుకున్నాడు. తన దేశవాలీ జట్టు ముంబై తరఫున సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ ఆడేందుకు నిర్ణయించుకున్నాడు. ఈ విషయాన్ని ముంబై క్రికెట్ అసోసియేషన్ సీనియర్ అధికారి ఒకరు ధృవీకరించారు.
జైస్వాల్ సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో చివరిగా 2023-24 ఎడిషన్లో కనిపించాడు. ఈ టోర్నీలో అతడికి మంచి ట్రాక్ రికార్డు ఉంది. 26 ఇన్నింగ్స్ల్లో 136.42 స్ట్రయిక్రేట్తో 648 పరుగులు చేశాడు. ఇందులో మూడు హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
త్వరలో సౌతాఫ్రికాతో జరిగే టీ20 సిరీస్ కోసం ఎంపిక చేసిన భారత జట్టులో జైస్వాల్కు చోటు దక్కని విషయం తెలిసిందే. జైస్వాల్కు గత కొంతకాలంగా టీ20 ఫార్మాట్లో (టీమిండియా) అవకాశాలు రావడం లేదు. అభిషేక్ శర్మ విధ్వంసకర ప్రదర్శనలతో జైస్వాల్ స్థానాన్ని ఆక్రమించాడు.
ఇదిలా ఉంటే, భారత వన్డే వెటరన్ స్టార్ రోహిత్ శర్మ కూడా సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీ ఆడతాడని ప్రచారం జరుగుతుంది. టెస్ట్, టీ20 ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించిన హిట్మ్యాన్ ఈ దేశవాలీ టీ20 టోర్నీ ఆడేందుకు సుముఖత వ్యక్తం చేశాడని సమాచారం. రోహిత్ కానీ జైస్వాల్ కానీ ముంబై జట్టుకు ఎప్పుడు అందుబాటులోకి వస్తారనే దానిపై అధికారిక సమాచారం లేదు.
ప్రస్తుతం ఎడిషన్ సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలో ఉన్న ముంబై ఇప్పటివరకు ఆడిన 6 మ్యాచ్ల్లో 5 విజయాలు సాధించి ఎలైట్ గ్రూప్-ఏలో టేబుల్ టాపర్గా కొనసాగుతుంది. ఈ జట్టుకు నాకౌట్ బెర్త్ ఇదివరకే ఖరారైంది.
ఈ ఎడిషన్లో శార్దూల్ ఠాకూర్ నేతృత్వంలోని ముంబై జట్టు అదిరిపోయే ప్రదర్శనలు చేస్తుంది. యువ ఓపెనర్ ఆయుశ్ మాత్రే వరుసగా రెండు సెంచరీలతో సత్తా చాటాడు. శార్దూల్ ఠాకూర్ స్వయంగా ఓ ఐదు వికెట్ల ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ముంబై తమ చివరి గ్రూప్ మ్యాచ్ను డిసెంబర్ 8న ఒడిషాతో ఆడనుంది.


