టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ షమీ తన అద్భుత ప్రదర్శనతో జాతీయ సెలక్టర్లకు మరోసారి సవాల్ విసిరాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 2025లో దుమ్ములేపుతున్నాడు. ఈ దేశవాళీ టీ20 టోర్నీలో భాగంగా శనివారం పుదుచ్చేరి (Puducherry)తో జరిగిన మ్యాచ్‌లో షమీ నిప్పులు చెరిగాడు.
షమీ తన నాలుగు ఓవర్ల కోటాలో 32 పరుగులిచ్చి మూడు వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. అయితే షమీ సత్తాచాటినప్పటికి బ్యాటర్లు విఫలం కావడంతో బెంగాల్ 81 పరుగుల తేడాతో ఘోర ఓటమి చూడాల్సి వచ్చింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పుదుచ్చేరి నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 177 పరుగులు చేసింది.
పుదుచ్చేరి బ్యాటర్లలో ఆమన్ ఖాన్(74) హాఫ్ సెంచరీ సాధించగా.. జస్వంత్(45) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. బెంగాల్ బౌలర్లలో షమీతో పాటు చటర్జీ రెండు వికెట్లు పడగొట్టాడు. అనంతరం లక్ష్య చేధనలో బెంగాల్ బ్యాటర్లు పూర్తిగా తేలిపోయారు.
పుదుచ్చేరి బౌలర్ల దాటికి బెంగాల్ 13.5 ఓవర్లలో కేవలం 96 పరుగులకే ఆలౌటైంది. ఓపెనర్‌గా కరణ్ లాల్(40) మినహా మిగితా బౌలర్లంతా దారుణంగా విఫలమయ్యారు. పుదుచ్చేరి బౌలర్లలో జయంత్ యాదవ్ 4 వికెట్లతో సత్తాచాటగా.. సైదక్ సింగ్ మూడు, అయూబ్, అమన్ ఖాన్ తలా వికెట్ సాధించారు. ఈ సీజన్‌లో బెంగాల్‌కు ఇది రెండో ఓటమి.


