టీమిండియాతో వన్డే సిరీస్‌లో సౌతాఫ్రికా స్టార్ వికెట్ బ్యాటర్ క్వింటన్ డికాక్ ఎట్టకేలకు తన ఫామ్‌ను అందుకున్నాడు. వైజాగ్ వేదికగా భారత్‌తో జరుగుతున్న సిరీస్ డిసైడర్ మూడో వన్డేలో డికాక్ సెంచరీతో చెలరేగాడు. తొలి రెండు వన్డేల్లో తడబడిన డికాక్.. ఈ మ్యాచ్‌లో మాత్రం భారత బౌలర్లపై పూర్తి ఆధిపత్యం చెలాయించాడు.
వైజాగ్ మైదానంలో బౌండరీల వర్షం కురిపించాడు. ఫాస్ట్ బౌలర్లు, స్పిన్నర్లు అని తేడా లేకుండా ఈ వెటరన్ తన ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తున్నాడు. ఈ క్రమంలో 80 బంతుల్లో డికాక్ తన సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. ఓవరాల్‌గా 89 బంతులు ఎదుర్కొన్న డికాక్.. 8 ఫోర్లు, 6 సిక్స్‌ల సాయంతో 106 పరుగులు చేసి ఔటయ్యాడు.
వన్డేల్లో అతడికి ఇది 23వ సెంచరీ కావడం గమనార్హం. అదేవిధంగా భారత్‌పై 7వ వన్డే సెంచరీ. తద్వారా డికాక్ పలు అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు.
చరిత్ర సృష్టించిన డికాక్..
ఒకే ప్రత్యర్థి జట్టుపై అత్యధిక వన్డే సెంచరీలు చేసిన వికెట్ కీపర్‌గా క్వింటన్ డికాక్ ప్రపంచ రికార్డు సృష్టించాడు. ఇంతకుముందు ఈ రికార్డు ఆసీస్ దిగ్గజం ఆడమ్ గిల్‌క్రిస్ట్, శ్రీలంక లెజెండ్ సంగర్కర పేరిట ఉండేది. గిల్లీ శ్రీలంకపై 6 సెంచరీలు సాధించగా.. సంగక్కర భారత్‌పై సరిగ్గా ఆరు వన్డే సెంచరీలు నమోదు చేశాడు. తాజా మ్యాచ్‌తో వీరిద్దరిని డికాక్(7) అధిగమించాడు.
అంతర్జాతీయ వన్డేల్లో అత్యధిక సెంచరీలు చేసిన వికెట్ కీపర్‌గా కుమార సంగక్కర రికార్డును డి కాక్ సమం చేశాడు. సంగక్కర తన వన్డే కెరీర్‌లో 23 సెంచరీలు చేయగా.. డికాక్ కూడా సరిగ్గా ఇప్పటివరకు 23 సెంచరీలు చేశాడు. మరో సెంచరీ చేస్తే సంగాను డికాక్ అధిగమిస్తాడు. ఈ జాబితాలో వీరిద్దరి తర్వాతి స్ధానంలో షాయ్ హోప్(19), గిల్‌క్రిస్ట్(19) ఉన్నారు.
విదేశీగడ్డపై అత్యధిక వన్డే సెంచరీలు చేసిన ప్లేయర్‌గా సచిన్ టెండూల్కర్, సయ్యద్ అన్వర్, ఏబీ డివిలియర్స్, రోహిత్ శర్మ రికార్డును డికాక్ సమం చేశాడు. వీరిందరూ 7 సెంచరీలు విదేశాల్లో చేశారు.
భారత్‌పై వన్డేల్లో అత్యధిక సెంచరీలు సాధించిన ప్లేయర్‌గా శ్రీలంక దిగ్గజ క్రికెటర్ సనత్ జయసూర్య(7) రికార్డును డికాక్ సమం చేశాడు.
చదవండి: IND vs SA: అతడెందుకు దండగ అన్నారు.. కట్ చేస్తే! గంభీర్ నమ్మకమే నిజమైంది


