టీమిండియా ఎట్టకేలకు టాస్ గెలిచింది. సౌతాఫ్రికాతో మూడో వన్డే సందర్భంగా విశాఖపట్నంలో తమ దురదృష్టానికి స్వస్తి పలికింది. 21వ ప్రయత్నంలో వన్డేల్లో తొలిసారి టాస్ గెలిచి.. తొలుత బౌలింగ్ ఎంచుకుంది.
అందుకే తొలుత బౌలింగ్
ఈ సందర్భంగా టీమిండియా తాత్కాలిక కెప్టెన్ కేఎల్ రాహుల్ (KL Rahul) మాట్లాడుతూ.. ‘‘మేము తొలుత బౌలింగ్ చేస్తాం. నిన్న రాత్రి ఇక్కడ మేము ప్రాక్టీస్ చేశాము. రాంచి, రాయ్‌పూర్‌లో మాదిరి కాకుండా ఇక్కడ తేమ కాస్త ఆలస్యంగా ప్రభావం చూపుతోందని గ్రహించాము.
వాషీపై వేటు.. జట్టులోకి తిలక్
అందుకే లక్ష్య ఛేదననే మేము ఎంచుకున్నాము. ఈ వికెట్ బాగుందనిపిస్తోంది. గత రెండు మ్యాచ్‌లలో మా ప్రదర్శన పట్ల సంతోషంగా ఉన్నాము. పరిస్థితులకు తగ్గట్లుగా ఇంకాస్త మెరుగుపడితే అనుకున్న ఫలితం రాబట్టవచ్చు. ఈ మ్యాచ్‌లో ఒకే ఒక్క మార్పుతో బరిలోకి దిగుతున్నాం. వాషింగ్టన్ సుందర్ స్థానంలో తిలక్ వర్మ (Tilak Varma) తుదిజట్టులోకి వచ్చాడు’’ అని తెలిపాడు.
గాయాలతో వారిద్దరు దూరం
మరోవైపు.. సౌతాఫ్రికా సారథి టెంబా బవుమా (Temba Bavuma) సైతం టాస్ గెలిస్తే తాము తొలుత బౌలింగే ఎంచుకునే వాళ్లమని పేర్కొన్నాడు.
రాంచి, రాయ్‌పూర్ మాదిరి ఇక్కడ కూడా ఆఖరి వరకు మ్యాచ్ ఉత్కంఠగా సాగితే ప్రేక్షకులు సంతోషిస్తారన్న బవుమా.. బర్గర్, డి జోర్జి స్థానాల్లో ఒట్నీల్ బార్ట్‌మన్, ర్యాన్ రికెల్టన్ తుదిజట్టులోకి వచ్చారని తెలిపాడు. బర్గర్, డి జోర్జి గాయాల కారణంగా రెండు వారాల పాటు ఆటకు దూరంగా ఉండనున్నట్లు వెల్లడించాడు.
ఫలితం తేల్చే మ్యాచ్
కాగా మూడు వన్డేలో సిరీస్‌లో భాగంగా రాంచిలో తొలి మ్యాచ్‌లో టీమిండియా ఆదివారం పదిహేడు పరుగుల తేడాతో గెలిచింది. అనంతరం రాయ్‌పూర్ వేదికగా బుధవారం నాటి మ్యాచ్‌లో సౌతాఫ్రికా 359 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి నాలుగు వికెట్ల తేడాతో జయకేతనం ఎగురవేసింది. ఫలితంగా 1-1తో సిరీస్ సమం కాగా.. శనివారం నాటి విశాఖపట్నం మ్యాచ్‌లో సిరీస్ విజేత ఎవరో తేలనుంది.
భారత్ వర్సెస్ సౌతాఫ్రికా మూడో వన్డే తుదిజట్లు
భారత్
రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లి, రుతురాజ్ గైక్వాడ్, తిలక్ వర్మ, కేఎల్ రాహుల్(వికెట్ కీపర్, కెప్టెన్), రవీంద్ర జడేజా, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, ప్రసిద్ కృష్ణ.
సౌతాఫ్రికా
ర్యాన్ రికెల్టన్, క్వింటన్ డి కాక్(వికెట్ కీపర్), టెంబా బావుమా(కెప్టెన్), మాథ్యూ బ్రీట్జ్కే, ఐడెన్ మార్క్రమ్, డెవాల్డ్ బ్రెవిస్, మార్కో యాన్సెన్, కార్బిన్ బాష్, కేశవ్ మహారాజ్, లుంగి ఎంగిడి, ఒట్నీల్ బార్ట్‌మన్.


