బ్రిస్బేన్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌లో ఆస్ట్రేలియా భారీ స్కోర్ సాధించింది. స్టార్క్ నిప్పులు చెరగడంతో తొలుత ఇంగ్లండ్‌ను 334 పరుగులకు పరిమితం చేసిన ఆసీస్.. ఆతర్వాత బ్యాటింగ్‌లో సత్తా చాటి 511 పరుగులు సాధించింది. తద్వారా 177 పరుగుల ఆధిక్యంలో నిలిచింది.
బంతితో రాణించిన స్టార్క్ (141 బంతుల్లో 77; 13 ఫోర్లు) బ్యాట్‌తోనూ చెలరేగి ఆసీస్‌కు భారీ స్కోర్ అందించాడు. ఆసీస్ ఇన్నింగ్స్‌లో స్టార్క్ స్కోరే అత్యధికం. మరో నలుగురు కూడా అర్ద సెంచరీలు చేశారు. జేక్ వెదరాల్డ్ 72, లబూషేన్ 65, స్టీవ్ స్మిత్ 61, అలెక్స్ క్యారీ 63 పరుగులు చేశారు.
ట్రవిస్ హెడ్ (33), గ్రీన్ (45) కూడా పర్వాలేదనిపించారు. మిగతా బ్యాటర్లలో ఇంగ్లిస్ 23, నెసర్ 16, బోలాండ్ 21 (నాటౌట్), డాగెట్ 13 పరుగులు చేశారు. ఇంగ్లండ్ బౌలర్లలో బ్రైడన్ కార్స్ 4 వికెట్లతో సత్తా చాటగా.. స్టోక్స్ 3, ఆర్చర్, అట్కిన్సన్, జాక్స్ తలో వికెట్ తీశారు.
అంతకుముందు ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో జో రూట్(138) అద్భుతమైన సెంచరీతో చెలరేగగా.. జాక్ క్రాలీ(76),ఆర్చర్(38) రాణించారు. మిచెల్ స్టార్క్ 6 వికెట్లతో సత్తా చాటాడు. ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లోని తొలి టెస్టులో ఇంగ్లండ్‌ను ఆసీస్ చిత్తు చేసిన సంగతి తెలిసిందే.
రికార్డుల్లోకెక్కిన స్టార్క్
తాజా ఇన్నింగ్స్‌తో స్టార్క్ రికార్డుల్లోకెక్కాడు. పాట్ కమిన్స్ తర్వాత వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ చరిత్రలో 1000 పరుగులు సహా 200 వికెట్లు తీసిన ఆటగాడిగా నిలిచాడు. ఈ ఇన్నింగ్స్‌తో స్టార్క్ డబ్ల్యూటీసీలో 1000 పరుగులు పూర్తి చేసుకున్న తొమ్మిదో ఆస్ట్రేలియన్‌గా నిలిచాడు. అలాగే కమిన్స్, అశ్విన్, జడేజా, వోక్స్ తర్వాత డబ్ల్యూటీసీలో 1000 పరుగులు, 100 వికెట్లు పూర్తి చేసుకున్న ఐదో ఆటగాడిగానూ నిలిచాడు.


