బ్రిస్బేన్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న యాషెస్ సిరీస్ రెండో టెస్ట్‌లో ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ ముగిసింది. ఓవర్‌నైట్ స్కోర్‌కు (325/9) మరో 9 పరుగులు మాత్రమే జోడించి చివరి వికెట్ కోల్పోయింది. లబూషేన్ కళ్లు చెదిరే క్యాచ్ పట్టడంతో జోఫ్రా ఆర్చర్ (38) చివరి వికెట్‌గా వెనుదిరిగాడు.
ఆసీస్ గడ్డపై తొలి శతకం బాదిన రూట్ (138) అజేయ బ్యాటర్‌గా నిలిచాడు. ఆర్చర్ వికెట్ బ్రెండన్ డాగెట్‌కు దక్కింది. తొలి రోజు ఆటలో నిప్పులు చెరిగిన స్టార్క్ 6 వికెట్లతో ఇన్నింగ్స్‌ను ముగించాడు. మైఖేల్ నెసర్, స్కాట్ బోలాండ్‌కు తలో వికెట్ దక్కింది. ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో జాక్ క్రాలే 76, బ్రూక్ 31, స్టోక్స్ 19, విల్ జాక్స్ 19, అట్కిన్సన్ 4 పరుగులు చేయగా.. డకెట్, పోప్, జేమీ స్మిత్, కార్స్ డకౌట్లయ్యారు.
ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. వారి ఈ సంతోషాన్ని స్టార్క్ ఎంతో సేపు మిగిల్చలేదు. ఓపెనర్ బెన్ డకెట్, అదే స్కోర్ వద్ద వన్ డౌన్ బ్యాటర్ ఓలీ పోప్‌ను డకౌట్ చేశాడు. స్టార్క్ నిప్పులు చెరగడంతో 5 పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ ఆతర్వాత కుదురుకుంది.
రూట్, క్రాలే అద్బుతమైన భాగస్వామ్యాన్ని నెలకొల్పి మూడో వికెట్‌కు 117 పరుగులు జోడించారు. అనంతరం రూట్‌తో జత కలిసిన బ్రూక్ కాసేపు పోరాడాడు. నాలుగో వికెట్‌కు వీరిద్దరు 54 పరుగులు జోడించారు. బ్రూక్ ఔటయ్యాక క్రీజ్‌లోకి వచ్చిన స్టోక్స్ ఇంగ్లిస్ అద్భుతమైన డైరెక్ట్ త్రో కారణంగా రనౌటయ్యాడు.
ఆతర్వాత జేమీ డకౌట్ కాగా.. జాక్స్ పోరాడే ప్రయత్నంలో వికెట్ సమర్పించుకున్నాడు. ఆతర్వాత వచ్చిన అట్కిన్సన్, కార్స్ ఇలా వచ్చి అలా వెళ్లారు. రూట్ ఆర్చర్‌తో కలిసి చివరి వికెట్‌కు 70 పరుగులు జోడించి ఇంగ్లండ్‌కు గౌరవప్రదమైన స్కోర్ అందించాడు.
అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆసీస్ 7.1 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 22 పరుగులు చేసింది. వెదరాల్డ్ 15, ట్రవిస్ హెడ్ 3 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు ఆసీస్ ఇంకా 312 పరుగులు వెనుకపడి ఉంది.


