సౌతాఫ్రికాతో టీ20 సిరీస్ కోసం ఎంపిక చేసిన భారత జట్టులో యువ ఆల్‌రౌండర్ రియాన్ పరాగ్‌కు (Riyan Parag) చోటు దక్కని విషయం తెలిసిందే. ఈ అంశంపై రియాన్ తాజాగా స్పందించాడు. భారత జట్టులో స్థానం దక్కనందుకు నిరాశ చెందానని చెప్పుకొచ్చాడు.
గతేడాది అక్టోబర్‌లో చివరిగా టీమిండియా తరఫున ఆడిన రియాన్ భుజం గాయం తనను జట్టుకు దూరం చేసిందని వాపోయాడు. ఫిట్‌గా ఉన్నప్పుడు తాను రెండు వైట్ బాల్ ఫార్మాట్లు ఆడగల సమర్దుడినని తెలిపాడు. త్వరలోనే భారత జట్టులో కనిపిస్తానని ధీమా వ్యక్తం చేశాడు.
రియాన్ మాటల్లో.. "నాకు నేను టీమిండియాకు ఆడగల అర్హుడినని అనుకుంటాను. ఇది నాపై నాకున్న నమ్మకమనుకోండి లేక ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకోండి. భుజం గాయం వల్ల ప్రస్తుతం నేను టీమిండియాలో లేను. నేను టీమిండియాకు రెండు వైట్‌బాల్ ఫార్మాట్లలో ఆడగలను"
ఫామ్ పెద్ద సమస్య కాదు
ప్రస్తుతం సయ్యద్ ముస్తాక్ అలీ దేశవాలీ టీ20 టోర్నీ ఆడుతున్న రియాన్ ఫామ్ లేమితో సతమతమవుతున్నాడు. ఐదు మ్యాచ్‌ల్లో ఒక్క చెప్పుకోదగ్గ ప్రదర్శన కూడా చేయలేకపోయాడు. ఈ అంశంపై కూడా రియాన్ స్పందించాడు.
ఫామ్ అనేది తన దృష్టిలో పెద్ద సమస్య కాదని, పూర్తి ఫిట్‌నెస్ సాధిస్తే అదంతటదే వస్తుందని విశ్వాసం వ్యక్తం చేశాడు.
బాత్రూంలో కూర్చొని ఏడ్చాను
ఇదే సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో రెండు సీజన్లు 45-50 సగటులో పరుగులు చేశాను. అయితే ఆ వెంటనే జరిగిన ఐపీఎల్ సీజన్‌లో 14 మ్యాచ్‌ల్లో కలిపి 70 పరుగులు చేయలేకపోయాను. ఆ సమయంలో నేను బాత్రూంలో కూర్చొని ఏడ్చాను. ఎందుకు పరుగులు చేయలేకపోతున్నానని చాలా బాధపడ్డాను.
ఈ ఫామ్‌తో ఐపీఎల్‌కు సంబంధం లేదు
సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీ ఫామ్‌తో ఐపీఎల్ ఫామ్‌కు సంబంధం లేదు. ఇక్కడ పరుగులు సాధిస్తే సంతోషమే. పరుగులు చేయలేకపోతే ఐపీఎల్‌లో పరుగులు చేయలేనని కాదు. ఈ విషయంలో నాకు అనుభవం ఉందని రియాన్ అభిప్రాయపడ్డాడు.
కాగా, 24 ఏళ్ల రియాన్ చివరిగా 2024 అక్టోబర్ 12న బంగ్లాదేశ్‌తో జరిగిన T20 సిరీస్‌లో భారత్ తరఫున ఆడాడు. ఆ సిరీస్‌లోని ఐదు మ్యాచ్‌ల్లో దారుణంగా విఫలమయ్యాడు. ఆ సిరీస్ అంతటిలో కేవలం 49 పరుగులే చేశాడు.
సంజూ శాంసన్ ట్రేడింగ్ ద్వారా సీఎస్‌కేకు వెళ్లిపోయిన తర్వాత రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్సీ రేసులో రియాన్ పరాగ్ కూడా ఉన్నాడు. గత సీజన్‌లో అతను కొన్ని మ్యాచ్‌లకు కెప్టెన్సీ కూడా చేశాడు. టీమిండియా నుంచి ఉద్వాసనకు గురైన తర్వాత కూడా రియాన్ ఐపీఎల్ 2025లో పర్వాలేదనిపించాడు. 32 సగటున 393 పరుగులు చేశాడు.


