జట్టులో తమకంటూ ప్రత్యేక బ్యాటింగ్ స్థానం లేకపోయినా టీమిండియాకు నిస్వార్థమైన సేవలు అందిస్తున్న క్రికెటర్లలో కేఎల్ రాహుల్ ముందు వరుసలో ఉంటాడు. 2014లో ఓపెనర్‌గా భారత జట్టు తరఫున ప్రస్థానం మొదలుపెట్టిన ఈ కర్ణాటక ఆటగాడు.. వికెట్ కీపర్‌గానూ సేవలు అందించాడు.
తరచూ మార్పులు
అయితే, తర్వాతి కాలంలో రాహుల్ (KL Rahul) తన ఓపెనింగ్ స్థానాన్ని కోల్పోయాడు. ముఖ్యంగా టెస్టుల్లో ఓసారి ఐదో నంబర్ బ్యాటర్‌గా.. మరోసారి నాలుగో స్థానంలో.. ఆ తర్వాత మళ్లీ ఓపెనర్‌గా ఇలా వివిధ స్థానాల్లో రాహుల్ బ్యాటింగ్ చేయాల్సి వచ్చింది.
అయినప్పటికీ నిలకడైన ఆటతో రాణిస్తూ తనను తాను ఎప్పటికప్పుడు నిరూపించుకుంటున్నాడు రాహుల్. దిగ్గజ కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) రిటైర్మెంట్ తర్వాత రాహుల్‌కు టెస్టుల్లో ఓపెనర్‌గా వరుస అవకాశాలు వస్తున్నాయి.
కీపింగ్ బాధ్యతలు కూడా..
ఇదిలా ఉంటే.. వన్డేల్లోనూ రాహుల్ పరిస్థితి ఇంచుమించు ఇలాగే ఉంది. టీ20 జట్టులో స్థానం కోల్పోయిన ఈ వికెట్ కీపర్ బ్యాటర్.. వన్డేల్లో మాత్రం మిడిలార్డర్ బ్యాటర్‌గా తన సేవలు అందిస్తున్నాడు. కీపింగ్ బాధ్యతలు కూడా తానే నిర్వర్తిస్తున్న రాహుల్.. తాజాగా సౌతాఫ్రికాతో స్వదేశంలో వన్డే సిరీస్‌కు తాత్కాలిక కెప్టెన్‌గానూ వ్యవహరిస్తున్నాడు.
సఫారీ జట్టుతో తొలి వన్డేలో ఆరోస్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన రాహుల్. కేవలం 56 బంతుల్లోనే 60 పరుగులు (రెండు ఫోర్లు, మూడు సిక్సర్లు) సాధించాడు. లెజెండరీ బ్యాటర్లు రోహిత్ శర్మ (57), విరాట్ కోహ్లి (135)తో రాహుల్ మెరుపు అర్ధ శతకంతో రాణించడంతో టీమిండియా 349 పరుగుల భారీ స్కోరు చేయగలిగింది
రాహుల్ విలువైన ఇన్నింగ్స్
ఇక ఈ మ్యాచ్‌లో బౌలర్లు ఆరంభంలో తడబడినా ఆఖరి నిమిషంలో సత్తా చాటడంతో 17 పరుగుల తేడాతో భారత జట్టు గట్టెక్కింది. అదే విధంగా రెండో వన్డేలోనూ కోహ్లి శతక్కొట్టగా (102).. రుతురాజ్ గైక్వాడ్ (105) కూడా సెంచరీతో అలరించాడు. వీరిద్దరికి తోడుగా రాహుల్ విలువైన ఇన్నింగ్స్ ఆడాడు. ఈసారి ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన ఈ వికెట్ కీపర్ బ్యాటర్.. 43 బంతుల్లోనే ఆరు ఫోర్లు, రెండు సిక్సర్లు బాది 66 పరుగులతో అజేయంగా నిలిచాడు.
అయితే, ఈ మ్యాచ్‌లో 358 పరుగుల మేర భారీ స్కోరు సాధించినా టీమిండియా గెలవలేకపోయింది. బౌలర్ల వైఫల్యం కారణంగా నాలుగు వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. అయితే, ఈ మ్యాచ్‌లోనూ బ్యాటర్‌గా, కెప్టెన్‌గా రాహుల్ తనదైన ముద్ర వేయగలిగాడు. అయితే, రో-కోల హవాలో అతడి ఆటకు దక్కాల్సిన స్థాయిలో గుర్తింపు దక్కలేదు.

కెప్టెన్‌గానూ రాహుల్‌కు మంచి రికార్డు
నిజానికి టీమిండియా కెప్టెన్‌గానూ రాహుల్‌కు మంచి రికార్డు ఉంది. ఇప్పటి వరకు మొత్తంగా అతడు పద్దెనిమిదిసార్లు భారత జట్టును సారథిగా ముందుకు నడిపించాడు. ఇందులో ఏకంగా పన్నెండుసార్లు టీమిండియా గెలిచింది. రాహుల్ కెప్టెన్సీలో 14 వన్డేలకు గానూ తొమ్మిదింట విజయం సాధించిన టీమిండియా.. టెస్టుల్లో మూడింటికి రెండు, టీ20లలో ఒకటికి ఒకటి గెలిచింది.
మరో విశేషం ఏమిటంటే.. రాహుల్ కెప్టెన్సీలో విరాట్ కోహ్లి ఇప్పటికి ఏకంగా నాలుగు శతకాలు బాదడం విశేషం. ఓవరాల్‌గా రాహుల్ సారథ్యంలో కోహ్లి సాధించిన స్కోర్లు వరుసగా... 122,51,0,65,113,135,102. ఇందులో చివరి రెండు సెంచరీలు సౌతాఫ్రికాతో వన్డేల్లో బాదినవే.
ఏదేమైనా.. టీమిండియా విజయాల్లో అనేకసార్లు కీలక పాత్ర పోషించిన రాహుల్.. తెరవెనుకే ఉండిపోతున్నాడనే అభిప్రాయం అతడి అభిమానుల్లో ఉంది. అంతేకాదు.. కెప్టెన్‌గానూ రాణించగల సత్తా ఉన్నా ఈ 33 ఏళ్ల ఆటగాడికి అదృష్టం కలిసి రావడం లేదని.. ప్రస్తుత పరిస్థితుల్లో వన్డే సారథిగా రాహులే సరైనోడు అన్న విషయాన్ని యాజమాన్యం గుర్తిస్తే బాగుండనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
చదవండి: 5 ఏళ్లలో 23 సెంచరీలు.. టెస్ట్ క్రికెట్‌పై రూట్ పంజా


