1970, 80 దశకాల్లో ప్రపంచ క్రికెట్‌ను శాశించిన వెస్టిండీస్ జట్టు ప్రస్తుతం ఉనికి కోసం పోరాడుతుంది. స్టార్ ఆటగాళ్ల రిటైర్మెంట్, బోర్డు ఆర్థిక సమస్యలు, ఆటగాళ్ల మధ్య విభేదాలు, మౌలిక సదుపాయాల లోపం కారణంగా ఆ జట్టు కనీసం చిన్న జట్లకు కూడా పోటీ ఇవ్వలేని స్థితిలో ఉంది.
రెండు సార్లు వన్డే ప్రపంచకప్ (1975, 1979), రెండు సార్లు టీ20 ప్రపంచకప్ (2012, 2016) ఛాంపియన్ అయిన ఆ జట్టు ప్రస్తుతం ప్రపంచకప్‌కు అర్హత సాధించాలంటేనే ఇబ్బంది పడుతుందంటే పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అర్దం చేసుకోవచ్చు.
ఇలాంటి పరిస్థితుల్లో ఆ జట్టును ఓ 'హోప్' నిలబెడుతుంది. ఆ హోప్ పేరే 'షాయ్ హోప్' (Shai Hope). ఈ బార్బడోస్ వికెట్‌కీపర్ బ్యాటర్ ప్రస్తుతం విండీస్ క్రికెట్‌కు ఆశాకిరణంలా మారాడు. విండీస్ జట్టు అడపాదడపా విజయాలు సాధిస్తుందంటే ఈ హోప్ పుణ్యమే. ఈ హోపే లేకుంటే విండీస్ క్రికెట్‌కు నామరూపాలు కూడా లేవు.
ఈ ఒక్కడే నిలకడగా రాణిస్తూ ప్రపంచ క్రికెట్ పటంలో విండీస్ పేరు తుడిచిపెట్టుకుపోకుండా కాపాడుతున్నాడు. ఫార్మాట్‌లో ఏదైనా ఇతనికి అండగా నిలబడే ఒక్క ప్లేయర్ కూడా ప్రస్తుత విండీస్ జట్టులో లేడు. ఎవరైనా ఉన్నా వారు వన్ మ్యాచ్ వండర్‌లానే మిగిలిపోతున్నారు.
హోప్ ఒక్కడే బ్యాటర్‌గా, వికెట్‌కీపర్‌గా, కెప్టెన్‌గా (పరిమిత ఓవర్ల ఫార్మాట్లలో) త్రిపాత్రాభినయం చేస్తూ విండీస్ క్రికెట్‌ను బ్రతికిస్తున్నాడు. గడిచిన ఐదేళ్లలో ఈ హోప్ మరింత రాటుదేలాడు. దాదాపుగా ప్రతి మ్యాచ్‌లో సత్తా చాటుతూ ప్రపంచ అగ్రశ్రేణి బ్యాటర్లకు పోటీగా మారాడు. ఫార్మాట్ ఏదైనా హోప్ తన తడాఖా చూపుతున్నాడు.
తొలుత టెస్ట్‌ల్లో కాస్త వీక్‌గా కనిపించినా, క్రమంగా ఈ ఫార్మాట్‌పై కూడా తన ముద్ర వేశాడు. ఈ ఏడాది ఇప్పటికే ఇంగ్లండ్ గడ్డపై 2, భారత్‌లో ఒకటి, తాజాగా న్యూజిలాండ్ గడ్డపై సెంచరీ చేశాడు.
వాస్తవానికి హోప్ అత్యుత్తమంగా ఆడే ఫార్మాట్ వన్డే క్రికెట్. ఈ ఫార్మాట్‌లో హోప్‌ను మించినోడు లేడు. అతని గణాంకాలే ఇందుకు నిదర్శనం. 148 మ్యాచ్‌ల్లో అతను 50కి పైగా సగటుతో 19 సెంచరీల సాయంతో 6000 పైచిలుకు పరుగులు చేశాడు. ఈ గణాంకాలు టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి గణాంకాలతో పోటీపడతాయి.
ముఖ్యంగా ఈ ఏడాది హోప్ ఫార్మాట్లకతీంగా అత్యుత్తమ ఫామ్‌లో ఉన్నాడు. ఆస్ట్రేలియా గడ్డపై టీ20 శతకంతో మొదలుకొని భారత్‌లో టెస్ట్ శతకం, పాకిస్తాన్‌లో వన్డే శతకం, న్యూజిలాండ్‌లో మరో వన్డే శతకం, తాజాగా న్యూజిలాండ్‌లో టెస్ట్ శతకం సాధించి ఐసీసీ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు రేసులో ముందువరుసలో ఉన్నాడు. ఈ ఏడాది అంతర్జాతీయ క్రికెట్‌లో టీమిండియా ఆటగాడు శుభ్‌మన్ గిల్ (1732) ఒక్కడే హోప్ (1677) కంటే ఎక్కువ పరుగులు చేశాడు.
తాజాగా హోప్ న్యూజిలాండ్‌పై చేసిన టెస్ట్ సెంచరీ విమర్శకుల ప్రశంసలను సైతం అందుకుంటుంది. కంటి ఇన్ఫెక్షన్‌తో బాధపడుతూనే హోప్ ఈ సెంచరీ చేశాడు. 531 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదిస్తూ అద్భుతమైన ఇన్నింగ్స్‌ను (116) కొనసాగిస్తున్నాడు. 72 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు వీరోచిత పోరాటాన్ని ప్రదర్శిస్తున్నాడు.
జస్టిన్ గ్రీవ్స్‌తో (55) కలిసి ఐదో వికెట్‌కు అజేయమైన 140 పరుగులు జోడించాడు. ఈ మ్యాచ్‌లో విండీస్ గెలవాంటే చివరి రోజు 319 పరుగులు చేయాలి. హోప్ కసి చూస్తే విండీస్‌కు సంచలన విజయం అందించేలా కనిపిస్తున్నాడు. ఇదే జరిగితే విండీస్ క్రికెట్ పునర్జన్మకు బీజం పడినట్లే.


