సౌతాఫ్రికాతో మూడో వన్డేలో భారత బౌలర్లు మెరుగైన ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. ప్రత్యర్థి జట్టును 270 పరుగులకు పరిమితం చేశారు. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా రాంచిలో టీమిండియా.. రాయ్‌పూర్‌లో సౌతాఫ్రికా గెలిచి 1-1తో సమంగా ఉన్నాయి. ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య శనివారం నాటి మూడో వన్డే (IND vs SA 3rd ODI) ద్వారా సిరీస్ ఫలితం తేలనుంది. విశాఖపట్నం వేదికగా టాస్ గెలిచిన భారత జట్టు తొలుత బౌలింగ్ ఎంచుకుంది.
ఫలితంగా తొలుత బ్యాటింగ్‌కు దిగిన ప్రొటిస్ జట్టుకు భారత పేసర్ అర్ష్‌దీప్ సింగ్ (Arshdeep Singh) ఆదిలోనే షాకిచ్చాడు. టీమిండియా బౌలింగ్ అటాక్‌ను ఆరంభించిన ఈ లెఫ్టార్మ్ బౌలర్.. ఐదో బంతికే ఓపెనర్ ర్యాన్ రికెల్టన్ (0)ను పెవిలియన్‌కు పంపాడు. అయితే, మరో ఓపెనర్ క్వింటన్ డికాక్, వన్‌డౌన్ బ్యాటర్, కెప్టెన్ టెంబా బవుమాతో కలిసి ఇన్నింగ్స్ చక్కదిద్దాడు.
శతక్కొట్టిన డికాక్
ఈ క్రమంలో డికాక్ సెంచరీ (89 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్స్‌లు- 106 పరుగులు) పూర్తి చేసుకుని జోరు కనబరచగా ప్రసిద్ కృష్ణ అతడిని బౌల్డ్ చేశాడు. మరోవైపు.. బవుమా అర్ధ శతకం దిశగా సాగుతున్న వేళ.. రవీంద్ర జడేజా బౌలింగ్‌లో విరాట్ కోహ్లి (Virat Kohli)కి క్యాచ్ ఇచ్చి 48 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద నిష్క్రమించాడు.
మార్క్రమ్ విఫలం
మిగతా వారిలో మాథ్యూ బ్రీట్జ్కే (24), డెవాల్డ్ బ్రెవిస్ (29) మాత్రమే చెప్పుకోగదగ్గ స్కోర్లు చేశారు. ప్రధాన బ్యాటర్లలో ఐడెన్ మార్క్రమ్ (1) దారుణంగా విఫలం కాగా.. ఆల్‌రౌండర్లలో మార్కో యాన్సెన్ (17), కార్బిన్ బాష్ (9) తేలిపోయారు. లుంగి ఎంగిడి ఒక్క పరుగుకే అవుట్ కాగా.. ఆఖర్లో కేశవ్ మహరాజ్ మెరుగైన (20 నాటౌట్) బ్యాటింగ్‌తో అలరించాడు. ప్రసిద్ బౌలింగ్ ఒట్నీల్ బార్ట్‌మన్ పదో వికెట్‌గా వెనుదిరగడంతో సౌతాఫ్రికా ఇన్నింగ్స్ ముగిసిపోయింది.
చెరో నాలుగు పంచుకున్న ప్రసిద్, కుల్దీప్
ఈ క్రమంలో 47.5 ఓవర్లలో సౌతాఫ్రికా 270 పరుగులు చేసి ఆలౌట్ అయింది. భారత బౌలర్లలో పేసర్ ప్రసిద్ కృష్ణ డికాక్, బ్రీట్జ్కే, మార్క్రమ్ రూపంలో మూడు కీలక వికెట్లు కూల్చడంతో పాటు బార్ట్‌మన్‌ను అవుట్ చేశాడు.
మరోవైపు.. స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ బ్రెవిస్, యాన్సెన్. బాష్, ఎంగిడిలను పెవిలియన్‌కు పంపాడు. మిగిలిన వారిలో అర్ష్‌దీప్ సింగ్, రవీంద్ర జడేజా చెరో వికెట్ దక్కించుకున్నారు. సౌతాఫ్రికా విధించిన 271 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి సిరీస్ కైవసం చేసుకోవాలని భారత జట్టు పట్టుదలగా ఉంది.


