సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ-2025లో టీమిండియా యువ ఓపెనర్, పంజాబ్ కెప్టెన్ అభిషేక్ శర్మ తన సూపర్ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. ఈ దేశవాళీ టీ20 టోర్నీలో భాగంగా శనివారం ఉప్పల్ వేదికగా సర్వీసెస్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో అభిషేక్ విధ్వంసం సృష్టించాడు.
ఈ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ ప్రత్యర్ధి బౌలర్లను ఉతికారేశాడు. కేవలం 34 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్స్‌లతో 62 పరుగులు చేశాడు. అదేవిధంగా అభిషేక్ 2025 ఏడాదిలో టీ20ల్లో వంద సిక్స్‌లను పూర్తి చేసుకున్నాడు. తద్వారా ఒకే క్యాలెండర్ ఈయర్‌లో టీ20ల్లో 100 సిక్స్‌ల మైలురాయిని అందుకున్న మొదటి భారత ఆటగాడిగా అభిషేక్ చరిత్రకెక్కాడు. ఇప్పటివరకు ఈ ఫీట్ ఎవరూ సాధించలేకపోయారు.
అభిషేక్ ఈ ఏడాది ఆరంభం నుంచే టీ20ల్లో దుమ్ములేపుతున్నాడు. ఇంగ్లండ్ టీ20 సిరీస్‌తో పాటు ఐపీఎల్, ఆసియాకప్, ఆసీస్ టూర్, సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో అదరగొట్టాడు. ఈ సంవత్సరం టీ20ల్లో అభిషేక్ శర్మ ఇప్పటివరకు 42.82 సగటుతో 1,499 పరుగులు చేశాడు. అందులో మూడు సెంచరీలు, 9 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అతడి అత్యధిక వ్యక్తిగత స్కోర్ 149గా ఉంది.
పంజాబ్ ఘన విజయం
ఇక ఈ మ్యాచ్‌లో సర్వీసెస్ టీమ్‌ను 73 పరుగుల తేడాతో పంజాబ్ చిత్తు చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 233 పరుగుల భారీ స్కోర్ సాధించింది. పంజాబ్ బ్యాటర్లలో అభిషేక్‌తో పాటు ఫ్రబ్‌సిమ్రాన్ సింగ్(50), నమన్ ధీర్(54) హాఫ్ సెంచరీలతో మెరిశారు.
అనంతరం సర్వీసెస్ 19.4 ఓవర్లలో 160 పరుగులకు ఆలౌటైంది. పంజాబ్ బౌలర్లలో అభిషేక్ శర్మ, సన్వీర్ సింగ్, హర్‌ప్రీత్ తలా రెండు వికెట్లు సాధించారు.


