అమృత్‌సర్ శివారులో రైలు పట్టాలపై బైటాయించి నిరసన తెలుపుతున్న రైతులు
పలువురి నిర్బంధం... అనంతరం విడుదల
హోషియార్‌పూర్/ఫిరోజ్‌పూర్: పంజాబ్‌లో రైతులు తమ డిమాండ్ల సాధనకు శుక్రవారం రెండు గంటలపాటు రైల్ రోకో చేపట్టారు. రైళ్ల రాకపోకలను అడ్డగించిన పలువురు రైతులను పోలీసులను అదుపులోకి తీసుకుని, అనంతరం విడుదల చేశారు. నిరసనల కారణంగా పలు రైళ్లు ఆలస్యంగా నడిచాయి. రైళ్ల రద్దు, దారి మళ్లింపు వంటివి మాత్రం లేవని అధికారులు తెలిపారు. కేంద్రం ప్రతిపాదించిన విద్యుత్ సవరణ బిల్లు–2025 రైతు వ్యతిరేకమని, విద్యుత్ వ్యవస్థలను ప్రైవేటీకరణ, కేంద్రీకరణ చేయడమే బిల్లు ఉద్దేశమని రైలు సంఘాలు విమర్శిస్తున్నాయి.
పంటల కనీస మద్దతు ధర(ఎంఎస్‌పీ)కి చట్టబద్ధత కలి్పంచాలని కూడా డిమాండ్ చేస్తున్నాయి. వీటిపై శుక్రవారం మధ్యాహ్నం ఒంటి గంట నుంచి మూడు గంటల మధ్యలో 19 జిల్లాల పరిధిలో 26 చోట్ల రైల్ రోకోలు చేపట్టాలని కిసాన్ మజ్దూర్ మోర్చా(కేఎంఎం) రైతులకు పిలుపునిచి్చంది. దీంతో, కేఎంఎంతోపాటు అనుబంధ సంఘాలకు చెందిన నేతలు, కార్యర్తలు పలు ప్రాంతాల్లో రైలు పట్టాలపై బైఠాయించారు. ప్రతిపాదిత విద్యుత్ బిల్లును ఉపసంహరించుకోవాలని రైతులు డిమాండ్ చేశారు. ఇతర సమస్యలపైనా వారు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఫిరోజ్‌పూర్ జిల్లాలో రైలు పట్టాలపై ఆందోళనకు దిగిన రైతులు పోలీసులతో తలపడ్డారు.
ఫిరోజ్‌పూర్‌లో కిసాన్ మజ్దూర్ సంఘర్ష్ కమిటీ(కేఎంఎస్‌సీ) శ్రేణులు బస్త టాంకా వాలీ రైల్వే క్రాసింగ్ వద్ద రైలు పట్టాలను దిగ్బంధించారు. పోలీసులు వారిని చెదరగొట్టేందుకు ప్రయత్నించారు. కొన్ని చెట్ల కొందరు రైతులను అదుపులోకి తీసుకున్నారు. కొద్దిసేపటి తర్వాత వారిని విడిచిపెట్టారు. రైలు పట్టాలపై బైఠాయించేందుకు జలంధర్ రైల్వే స్టేషన్ వైపు వెళ్తున్న రైతులను పోలీసులు బారికేడ్లతో నిలువరించారు. రైతుల ఆందోళనల కారణంగా పలు ప్రాంతాల్లో రైళ్లు కొద్దిసేపు నిలిచిపోయాయి.


