రాష్ట్రపతి భవన్‌లో జరిగిన విందులో ప్రధాని మోదీ, పుతిన్‌ల సంభాషణ. చిత్రంలో నిర్మలా సీతారామన్
న్యూఢిల్లీ: తెలుగు రాష్ట్రాల ప్రజలు అత్యంత ఇష్టంగా లాగించే ములక్కాయ చారును పుతిన్ రుచిచూశారు. పుతిన్‌కు గౌరవార్థం రాష్ట్రపతి ముర్ము శుక్రవారం రాత్రి రాష్ట్రపతిభవన్‌లో ఇచి్చన విందులో పలు భారతీయ వంటకాలను ఆయనకు వడ్డించారు. సూప్‌ల కేటగిరీలో మెనూ కార్డులో మొట్టమొదట ములక్కాయ చారు పేరును చేర్చారు. ఆకలిని పెంచే అపిటైజర్ల జాబితాలో కశీ్మరీ స్టైల్‌లో వాల్‌నట్‌లను కలిపిన గుచ్చీ డూన్ చెటిన్, మినప వడలను, కూరగాయలతో నింపిన జోల్ మోమోలును పుతిన్‌కు వడ్డించారు. ఇక మెయిన్ కోర్స్‌లో జాఫ్రానీ పనీర్, పాలకూర మెంతికూర పచి్చబఠానీల కూరలతోపాటు పెరుగు, మసాలా దట్టించిన తందూరీ భార్వాన్ ఆలూ, చిన్న వంకాయలతో చేసిన ఆఛారీ బైగన్‌లనూ పుతిన్‌కు వడ్డించారు.
టమాట, ఉల్లిగడ్డ కలబోతగా వండిన కందిపప్పు కూర సైతం వడ్డించారు. గోంగూర పచ్చడి, మామిడి పచ్చళ్లను సైతం పుతిన్ రుచిచూశారు. డ్రై ఫ్రూట్స్ వేసిన సాఫ్రాన్ పులావ్‌ను పుతిన్ రుచిచూశారు. లచ్ఛా పరంఠా, మగజ్ నాన్, సతనాజ్ రోటీ, మిస్సీ రోటీ, బిస్కటీ రోటీలను ప్రత్యేకంగా వడ్డించారు. బాదం హల్వా, కేసర్ పిస్తా కులీ్ఫలనూ విడిగా అందించారు.
తొలుత అగ్రనేతలతో పిచ్ఛాపాటీగా మాట్లాడేటప్పుడు తెలుగు ప్రజలు ఇష్టంగా తినే మురుకులతోపాటు బెంగాళీ గురు సందేశ్ మిఠాయిని పుతిన్‌కు ఇచ్చారు. దానిమ్మ, బత్తాయి, క్యారెట్ జ్యూస్‌లను సిద్ధంగా ఉంచారు. బీట్‌రూట్, ఖామన్ ఖాక్డీ, కామ్రాక్ బూందీ రైతా కలిపిన షర్కార్‌కండీ పాపడీ చాట్, అరటి చిప్స్‌ను అందించారు. సమీపంలో భారతీయ, రష్యన్ వాద్య పరికరాలతో సంగీత విభావరి నిర్వహించారు. సరోద్, సారంగి, తబ్లాలతో రాష్ట్రపతిభవన్ నేవీ వాద్య బృందం అద్బుత ప్రదర్శన ఇచ్చింది.
పుతిన్‌ను పొగిడిన ముర్ము
భారత్–రష్యా వ్యూహాత్మక భాగస్వామ్యానికి పాతికేళ్లు పూర్తవుతున్న వేళ పుతిన్ భారత్‌లో పర్యటించడం సంతోషదాయకమని రాష్ట్రపతి ముర్ము అన్నారు. విందు సందర్భంగా ముర్ము కొద్దిసేపు మాట్లాడారు. ‘‘శాంతి, సుస్థిరత, సామాజిక, ఆర్థిక, సాంకేతిక పురోగతే లక్ష్యంగా ఇరుదేశాల భాగస్వామ్యం ముందుకు సాగుతోంది. ఇరుదేశాల బహుముఖ భాగస్వామ్య వాణిజ్యం, ఆర్థిక, రక్షణ, పౌర అణు సహకారం, అంతరిక్షం, శా్రస్తాసాంకేతిక, విద్య, సాంస్కృతి సంబంధాల్లో మరింత ఫలవంతమవుతోంది’’అని ముర్ము అన్నారు.
రష్యాకు బయల్దేరిన పుతిన్
రాష్ట్రపతిభవన్‌లో విందు తర్వాత పుతిన్ తన రెండ్రోజుల భారత పర్యటనను ముగించుకుని రష్యాకు బయల్దేరి వెళ్లారు. రాష్ట్రపతిభవన్ నుంచి నేరుగా ఢిల్లీ లోని పాలం ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుని సొంత విమానంలో రష్యాకు పయనమయ్యారు. మంత్రి ఎస్.జైశంకర్ పుతిన్‌కు ఎయిర్‌పోర్ట్‌లో వీడ్కోలు పలికారు.


