- ఇప్పటికే 19 దేశాల పౌరులపై అమెరికాలో ఆంక్షలు
- మరికొన్ని దేశాలపై నిషేధానికి ట్రంప్ ఆదేశాలు
- నిర్ధారించిన హోంల్యాండ్ సెక్యూరిటీ సెక్రటరీ క్రిస్టీ నోయెమ్
అమెరికా తమ దేశంలోకి అడుగు పెట్టకుండా మరికొన్ని దేశాల పౌరులపై ఆంక్షలు విధించేందుకు సిద్ధమవుతోంది. అమెరికా పౌరుల భద్రత పేరుతో ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం స్పష్టం చేసింది.
అమెరికా తమ పౌరుల భద్రత పేరుతో పలు దేశాలను, ఆ దేశాలకు చెందిన పౌరులను నిషేధించాలని నిర్ణయించింది. తాజాగా ఫాక్స్ న్యూస్ ప్రోగ్రామ్ ‘ది ఇంగ్రహం యాంగిల్’లో అమెరికా హోంల్యాండ్ సెక్యూరిటీ సెక్రటరీ క్రిస్టీ నోయెమ్ ఈ విషయాన్ని వెల్లడించారు. ఇప్పటికే అమెరికా 19 దేశాలకు చెందిన పౌరులపై ఈ నిషేధాన్ని అమలు చేస్తోంది. అంటే.. ఈ దేశాలకు చెందిన పౌరులకు అన్నిరకాల ఇమ్మిగ్రేషన్లను నిలిపివేయనుంది. అదేవిధంగా పౌరసత్వం, గ్రీన్‌కార్డు దరఖాస్తులకు సైతం ఆయా దేశాల పౌరులను అనర్హులుగా ప్రకటించింది. అదేవిధంగా ఆయా దేశాలకు తమ పౌరులు వెళ్లకూడదంటూ ట్రంప్ ట్రావెల్ అలెర్ట్ జారీ చేశారు.
ఇప్పటికే నిషేధం అమలవుతున్న దేశాలు ఏవి?
గత నెల వైట్‌హౌస్ సమీపంలో నేషనల్ గార్డ్స్‌పై ఆఫ్ఘన్ శరణార్థి కాల్పులు జరిపిన ఉదంతం తర్వాత అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కఠిన నిర్ణయాలు తీసుకున్నారు. అందులో భాగంగా ఆఫ్ఘనిస్థాన్‌తోపాటు.. కాంగో, క్యూబా, ఇరాన్, హైతీ, లిబియా, సోమాలియా, సూడాన్, తుర్కెమెనిస్థాన్, వెనిజులా, యెమన్‌తోపాటు.. మొత్తం 19 దేశాలపై నిషేధం విధించారు. తాజాగా హోంల్యాండ్ సెక్యూరిటీ సెక్రటరీ చెప్పిన దాని ప్రకారం ఈ జాబితాలో మరో 11 దేశాలు చేరనున్నట్లు స్పష్టమవుతోంది.
ట్రంప్ నిర్ణయాన్ని రివర్స్ మైగ్రేషన్ అనవచ్చా?
అవును ఇది కచ్చితంగా రివర్స్ మైగ్రేషనే. ట్రంప్ నిషేధం విధించిన దేశాలకు చెందిన వారిని అమెరికా నుంచి డీపోర్ట్ చేస్తారు. హోంల్యాండ్ సెక్యూరిటీ సెక్రటరీ తాజాగా ఫాక్స్ న్యూస్‌తో మాట్లాడినప్పుడు.. ట్రంప్ నిర్ణయం వల్ల అమెరికా పౌరుల భద్రత పెరుగుతుందని, తమ దేశంలో నేరాలు తగ్గుతాయని పేర్కొన్నారు. ఆ మేరకు అమెరికా పౌరసత్వ, ఇమిగ్రేషన్ సర్వీసెస్ విభాగం భారీ కసరత్తే చేస్తోందని చెప్పారు. ఈ నిర్ణయంలో సమస్యాత్మక జనాబా తగ్గుతుందని, అంతకు మించితే సామాజిక సమస్యలు ఏమీ ఉండవని అభిప్రాయపడ్డారు. మరో 11 లేదా అంతకంటే ఎక్కువ దేశాలపై నిషేధం విధించనున్నట్లు తెలుస్తోంది. అయితే.. ఆ జాబితాలో ఏయే దేశాలున్నాయనేది ఇంకా తెలియాల్సి ఉంది.


