అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి ఎన్నికైన దగ్గర్నుంచీ అన్ని వివాదాస్పద నిర్ణయాలే తీసుకుంటున్నారు డొనాల్డ్ ట్రంప్.. ప్రధానంగా ప్రతీదేశం తమ అదీనంలో ఉండాలని ఆకాంక్ష ట్రంప్‌లో బలంగా నాటుకుపోయినట్లుంది. అందుకే ఆ దేశం, ఈ దేశం అని లేదు.. అన్ని దేశాలను తన చర్యలతో భయపెడుతున్నారు. తమది అగ్రరాజ్యమనే అహంకార భావనలో ఉన్న ట్రంప్ చేస్తున్న చేష్టలు కొన్ని దేశాలకు విసుగుతెప్పిస్తూనే ఉంది.
అలా ట్రంప్ చర్యలతో ఎక్కువగా విసుగుపోయిన దేశాలలో రష్యా ఒకటి, భారత్ మరొకటి. ముఖ్యంగా రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేయడాన్ని ట్రంప్ తీవ్రంగా ఆక్షేపించారు. అదే సమయంలో భారత్‌కు ఆంక్షలు కూడా విధించారు. ‘ మీరు రష్యా ఆయిల్ కొనడానికి వీల్లేదనే హుకుం జారీ చేశారు. ఇది రష్యా-ఉక్రెయిన్‌ల మధ్య యుద్ధాన్ని ఆపడానికని శాంతి ప్రవచనాలు కూడా చేశారు. రష్యా నుంచి భారత్ ఆయిల్ కొనుగోలు చేయడాన్ని ఎంతవరకూ నియంత్రించారో తెలీదు కానీ, రష్యా మాత్రం మళ్లీ భారత్‌కు చమురు సరఫరా కొనసాగిస్తామని స్పష్టం చేసింది.
భారత్‌కు చమురు కొనసాగిస్తాం.. : పుతిన్
ప్రస్తుతం భారత్ పర్యటనలో ఉన్న రష్యా అధ్యక్షుడు పుతిన్.. మీడియా సాక్షిగా భారత్‌కు అన్ని రకాల చమురు కొనసాగిస్తామని పేర్కొన్నారు. అమెరికా భయపెడితే భయపడిపోవడానికి తామేమీ చిన్న పిల్లలం(చిన్న దేశం) కాదనే సంకేతం ఇచ్చారు పుతిన్, ప్రధాని నరేంద్ర మోదీతో కలిసి సంయుక్త మీడియా సమావేశంలో పాల్గొన్న పుతిన్.. ఇరు దేశాల మధ్య ఒప్పందాల గురించి వివరించే క్రమంలో చమురును భారత్‌కు యథావిధిగా కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
అసలే పుతిన్ భారత్ పర్యటనపై ఫుల్ ఫోకస్ పెట్టిన ట్రంప్.. ఈ మాట అనేసరికి నోట్లో వెలక్కాయపడినట్లు అవ్వడం ఖాయం. పుతిన్-మోదీలు ఏం చెబుతారా అనే ఆసక్తిగా గమనిస్తున్న అగ్రరాజ్యం అమెరికా.. పుతిన్ మాటలకు చిర్రెత్తుకొచ్చినట్లు అయ్యి ఉంటుంది. గతంలో వైట్‌హౌస్ వేదికగా పుతిన్-ట్రంప్‌ల మధ్య భేటీ జరిగింది. ఆ భేటీ కూడా సజావుగా సాగలేదు. తమ ఆంక్షలకు కట్టుబడి ఉండాలనే ఒత్తిడితో ఆ భేటీ సఫలం కాలేదు.
‘శాంతి’ చర్యలు అంటూ పలు దేశాలకు తలనొప్పి
వేరే దేశాన్ని నియంత్రించాలని అనుకోవడం ఎంతవరకూ సబబు అనేదే ఇక్కడ ప్రశ్న. ఎంతటి అగ్రజుడు అయినా తమ అధీనంలో అంతా ఉండాలని అనుకోవడం అవివేకం. వీటికి ఎన్నో కథలు, ఉదాహారణలు, సామెతలు కూడా ఉన్నాయి. అవన్నీ మనకు తెలిసినవే. ఇప్పటి వరకూ ట్రంప్ చేసింది ఏదైనా ఉందంటే అది తన ‘శాంతి’ చర్యలతో మిగతా దేశాలని నొప్పించడమే జరుగుతుంది. ఇక్కడ తమ మాట వింటే ఒక రకంగా, మాట వినకపోతే మరో రకంగా ట్రంప్ ప్రవర్తిస్తున్నారు. గతంలో ఆపరేషన్ సింధూర్ తర్వాత ‘కశ్మీర్’ అంశాన్ని తాను పరిష్కరిస్తానని ట్రంప్ చెప్పిన మాటలు ఇప్పటికీ మనకు గుర్తే.
ఆ మాటలకు భారత ప్రధాని మోదీ కూడా స్ట్రాంగ్‌గానే సమాధానం ఇచ్చారు. తమ సమస్యను పరిష్కరించడానికి ఎవరి మధ్యవర్తిత్వం అవసరం లేదని తేల్చిచెప్పారు. తమ సమస్యను పరిష్కరించుకునే సత్తా తమకు ఉందని ట్రంప్‌ను పరోక్షంగా హెచ్చరించారు. అంటే పుతిన్-మోదీలిద్దరూ ట్రంప్‌ను అంతగా పట్టించుకోలేదు. లైట్ తీసుకున్నారు. స్నేహ ధర్మంలో హద్దులు దాటి ‘సరిహద్దులు’ వరకూ వస్తే ఊరుకోమని సంకేతాలు పంపుతూనే ఉన్నారు. అందుకే మోదీ-పుతిన్‌ల భేటీపై ట్రంప్ సీరియస్ లుక్ వేసి ఉంచారు. ప్రస్తుతం పుతిన్ చేసిన వ్యాఖ్యలు ట్రంప్‌కు వినబడ్డాయా.. లేదా అనే రాజకీయ విశ్లేషకులు చర్చించుకుంటున్నారు.
ఇదీ చదవండి:
పాక్‌తో ఇంకా సంబంధాలెందుకు?: అమెరికా ఎంపీల డిమాండ్


