దేశంలో అద్దె గృహాల విభాగంలో మార్పులు తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. దేశవ్యాప్తంగా అద్దె ఒప్పందాలను సరళీకృతం చేయడం, పారదర్శకతను పెంచడం, యజమానులు-అద్దెదారుల మధ్య వివాదాలను తగ్గించడం లక్ష్యంగా మార్పులు ప్రతిపాదించారు. కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తాజాగా రూపొందించిన ‘మోడల్ టెనెన్సీ యాక్ట్ (MTA) 2025’ మార్గదర్శకాలను రాష్ట్రాలకు పంపించారు.
ఈ ఎంటీఏ 2025 అనేది చట్టబద్ధమైన కేంద్ర చట్టం కానప్పటికీ రాష్ట్ర ప్రభుత్వాలు తమ ప్రస్తుత అద్దె నియంత్రణ చట్టాలను సవరించడానికి లేదా కొత్త చట్టాలను రూపొందించడానికి ఇది ప్రామాణికంగా ఉపయోగపడుతుంది. భూమి, ఆస్తి, అద్దె వ్యవహారాలు రాజ్యాంగంలోని రాష్ట్ర జాబితా (ఎంట్రీ 18) పరిధిలోకి వస్తాయి కాబట్టి, రాష్ట్ర శాసనసభల ఆమోదం ద్వారా మాత్రమే ఈ మార్గదర్శకాలు చట్ట రూపం దాలుస్తాయని గుర్తుంచుకోవాలి.
మార్గదర్శకాల్లోని వివరాలు
నివాస (రెసిడెన్షియల్), వాణిజ్య (కమర్షియల్) ఆస్తుల కోసం చేసుకున్న అన్ని అద్దె ఒప్పందాలను సంతకం చేసిన 60 రోజుల్లోపు డిజిటల్ స్టాంపింగ్‌తో ఆన్‌లైన్‌లో నమోదు చేయాల్సి ఉంటుంది.
ఇప్పటివరకు చాలా రాష్ట్రాల్లో చేతితో రాసిన ఒప్పందాలు లేదా సాధారణ స్టాంప్ పేపర్ ఒప్పందాలు మాత్రమే ఉండేవి. దీనివల్ల మోసాలు, అక్రమ ఆక్రమణలు, డూప్లికేట్ ఒప్పందాలకు అవకాశం ఉండేది. దీన్ని కొత్త డిజిటల్ రిజిస్ట్రేషన్ విధానం సమర్థవంతంగా అరికట్టే అవకాశం ఉంది.
ఒప్పందాన్ని నమోదు చేయడంలో విఫలమైతే భూస్వామికి రూ.5,000 వరకు జరిమానా విధించే వీలుంది.
ప్రస్తుతం ఢిల్లీ, ముంబై, బెంగళూరు వంటి మెట్రో నగరాల్లో అద్దెదారులు 8 నుంచి 11 నెలల అద్దెను డిపాజిట్‌గా చెల్లించాల్సిన భారం ఉంది. ఎంటీఏ 2025 ఈ భారాన్ని తగ్గిస్తూ సెక్యూరిటీ డిపాజిట్‌పై కచ్చితమైన పరిమితిని విధించింది.
నివాస గృహాలకు గరిష్ఠంగా 2 నెలల అద్దె మాత్రమే డిపాజిట్‌గా తీసుకోవచ్చు.
వాణిజ్య ఆస్తులకు గరిష్ఠంగా 6 నెలల అద్దె వరకు మాత్రమే తీసుకోవడానికి అనుమతి ఉంది.
ఆకస్మికంగా లేదా అతిగా అద్దె పెంచే విధానానికి కొత్త చట్టం అడ్డుకట్ట వేస్తుంది. యజమానులు అద్దెను సంవత్సరానికి ఒకసారి మాత్రమే పెంచడానికి అనుమతి ఉంటుంది. అంతేకాకుండా అద్దె పెంపునకు సంబంధించిన రాతపూర్వక నోటీసును అద్దెదారుకు కనీసం 90 రోజుల ముందు తప్పనిసరిగా ఇవ్వాలి.
రెంట్ ట్రిబ్యునల్ ఆదేశం లేకుండా ఏ అద్దెదారునైనా బలవంతంగా ఇంటిని ఖాళీ చేయించడం పూర్తిగా నిషేధం.
ఇంటిని తనిఖీ చేయడానికి లేదా ప్రవేశించడానికి కనీసం 24 గంటల ముందు యజమాని అద్దెదారుకు రాతపూర్వక నోటీసు ఇవ్వాలి.
అద్దెదారుపై ఒత్తిడి తెచ్చేందుకు లాకౌట్ (తాళం వేయడం), విద్యుత్/నీటి సరఫరాను నిలిపివేయడం, బెదిరింపులకు పాల్పడటం శిక్షార్హమైన నేరాలు.
అవసరమైన మరమ్మతులను యజమాని 30 రోజుల్లో పూర్తి చేయకపోతే అద్దెదారు స్వయంగా వాటిని చేయించుకుని బిల్లు చూపి ఆ ఖర్చును తదుపరి అద్దె నుంచి మినహాయించుకునే వెసులుబాటు ఉంది.
అద్దెదారులు తప్పనిసరిగా పోలీసు వెరిఫికేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది. ఇది అద్దె ఆస్తుల దుర్వినియోగాన్ని నిరోధించడంలో సహాయపడుతుంది.
రాష్ట్రాల స్పందన, అమలుపై అంచనాలు..
కేంద్రం రాష్ట్రాలను తమ డిజిటల్ రిజిస్ట్రేషన్ వ్యవస్థలను వీలైనంత త్వరగా అప్‌గ్రేడ్ చేసుకోవాలని కోరింది. ఇప్పటివరకు ఒడిషా, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, అస్సాం, త్రిపుర వంటి 10కి పైగా రాష్ట్రాలు ఇప్పటికే ఎంటీఏ మార్గదర్శకాల ఆధారంగా తమ అద్దె చట్టాలను సవరించాయి. అందులో కొన్ని కొత్త చట్టాలను రూపొందించాయి. మిగిలిన రాష్ట్రాలు కూడా 2026 నాటికి ఈ కొత్త నియమాలను అమలు చేసే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఇదీ చదవండి: టెక్ తొలగింపులకు కారణం ఏమిటంటే: ఐబీఎం సీఈఓ


