కర్ణాటక: బెంగళూరు నగరం పేరు వినగానే ప్రతి ఒక్కరూ భయపడేది ఇంటి బాడుగలు, వాటి అడ్వాన్స్‌ల గురించి. ఇక్కడి అద్దెలు, అడ్వాన్స్‌ల భారం దేశంలో ఎక్కడా కూడా లేదని స్థానిక ప్రజలతో పాటు ఇతర ప్రాంతాల నుంచి నగరానికి వచ్చిన వారు ముక్తకంఠంతో చెప్పేమాట. ఇళ్లు, భవనాల యజమానులు బాడుగ కావాలంటూ వచ్చేవారిని దోచుకుంటూ ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ భారం భరించలేక బెంగళూరు సిటీలో కాకుండా సమీపంలోని చిన్న పట్టణాలలో ఉండడానికి ఇష్టపడతారు. దీంతో ఆయా పట్టణాలకు వలసలు పెరిగాయి.
గత 3 నెలల్లో..
విపరీతమైన బాడుగల రేట్ల వల్ల గడిచిన మూడు నెలల్లో సిటీలో అద్దె ఇళ్ళకు డిమాండు భారీగా తగ్గుముఖం పట్టిందని మ్యాజిక్ బ్రిక్స్ సంస్థ తమ నివేదికలో తెలిపింది. దేశ రాజధాని ఢిల్లీలో అద్దె ఇళ్ళకు దేశంలోనె అతి ఎక్కువ డిమాండు ఉందని, ఆ తరువాత స్థానంలో బెంగళూరు, చెన్నై ఉండగా, ఇక్కడ డిమాండు పడిపోతున్నట్లు పేర్కొంది. అద్దెలతో పాటు అడ్వాన్స్‌లు పెద్దమొత్తంలో ఉండటమే ప్రముఖ కారణమని తెలింపింది. ఈ జూలై నెల నుంచి సెపె్టంబర్ వరకు చేసిన సర్వేలో ఇది తేలిందని పేర్కొంది.
రూ.30 లక్షల అడ్వాన్సు..
నిజానికి బెంగళూరు నగరంలో బాడుగలకు ఇళ్ళు దొరకడం చాలా కష్టం. ఒకవేళ దొరికినా కూడా కళ్లు తేలేసే రీతిలో అద్దె, అడ్వాన్సులు ఇచ్చుకోవాలి. అద్దెకు చేరాలంటే రూ.30 లక్షల అడ్వాన్స్ ఇవ్వాలని ఇటీవల ఓ డూప్లెక్స్ ఇంటి ఓనరు బోర్డు పెట్టడం నెట్‌లో వైరల్ కావడం తెలిసిందే. ఇక అద్దె ఎంత ఉంటుందో ఊహించుకోవచ్చు. చాలామంది గత్యంతరం లేక అద్దెలకు చేరుతున్నారు. విపరీతమైన ఆర్థికభారం వల్ల కొన్నినెలలుగా అద్దె ఇళ్ళ వ్యాపారం తగ్గిపోయిందని నివేదికలో తెలిపింది. ఉద్యాననగరిలో గతంలో ఉన్నంత గిరాకీ ఇప్పుడు లేదని, చెన్నై నగరంలోనూ ఇదే పరిస్థితి అని తేల్చేసింది.


