సాక్షి, సిటీబ్యూరో: దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో కార్యాలయాల అద్దెలు 6 శాతం మేర పెరిగాయి. గతేడాది సెప్టెంబర్‌లో అద్దె చ.అ.కు రూ.85గా ఉండగా.. ఇప్పుడది రూ.90కి చేరింది. అత్యధికంగా బెంగళూరులో 9 శాతం మేర ఆఫీసు అద్దెలు పెరిగాయని అనరాక్ రీసెర్చ్ నివేదిక వెల్లడించింది. ఇదే సమయంలో ఆఫీసు వేకన్సీలు గతేడాది 16.70 శాతంగా ఉండగా.. ఇప్పుడది 16.20 శాతానికి తగ్గింది.
ఈ ఏడాది జనవరి–సెప్టెంబర్ తొమ్మిది నెలల్లో ఏడు నగరాల్లో 4.2 కోట్ల చ.అ. ఆఫీసు స్పేస్ లావాదేవీలు జరిగాయి. గతేడాది ఇదే కాలంలోని 3.1 కోట్ల చ.అ. లీజులతో పోలిస్తే 34 శాతం అధికం. అలాగే కొత్తగా ఏడు నగరాల్లో 3.9 కోట్ల చ.అ. ఆఫీసు నిర్మాణం పూర్తయింది. గతేడాది 9 నెలల కాలంలోని 3.4 కోట్ల చ.అ.లతో పోలిస్తే ఇది 15 శాతం ఎక్కువ.
ఐటీ హబ్ హైదరాబాద్‌లో..
ఐటీ హబ్‌గా పేరొందిన హైదరాబాద్‌లో ఆఫీసు స్పేస్ లీజులు బాగానే ఉన్నా కొత్త నిర్మాణాలలో క్షీణత నమోదైంది. ఈ ఏడాది తొలి తొమ్మిది నెలల్లో నగరంలో 57 లక్షల ఆఫీసు లావాదేవీలు జరిగాయి. గతేడాది 9 నెలల్లో 44.2 లక్షల చ.అ. లీజులతో పోలిస్తే 29 శాతం అధికం. అలాగే భాగ్యనగరంలో కొత్తగా 59 లక్షల చ.అ. ఆఫీసు నిర్మాణాలు పూర్తయ్యాయి. గతేడాది ఇదే కాలంలో పూర్తయిన 96.8 లక్షల చ.అ.లతో పోలిస్తే 39 శాతం క్షీణించింది. ప్రస్తుతం నగరంలో ఆఫీసు వేకెన్సీ 26.50 శాతంగా ఉంది.


