ఇక భాగ్యనగరవాసులు బీచ్ వైబ్స్ ఆస్వాదించడానికి గోవా, వైజాగ్, బందరు అంటూ దూరభారం డ్రైవ్ చేయాల్సిన అవసరం లేదు. సిటిజనుల కోసం నగరానికి కూతవేటు దూరంలోనే ఆర్టిఫిషియల్ సముద్ర తీరం అవతరించనుంది. సముద్రం అనేది లేకుండానే తీరం ఎలా అనే ప్రశ్నకు మానవ మేధస్సుతో సమాధానం చెబుతున్న దేశపు తొలి నగరంగా హైదరాబాద్ చరిత్ర సృష్టించనుంది. ఈ బీచ్ పరిసరాలు విందు, వినోదాలతో పాటు సకల సౌకర్యాలకు కేరాఫ్‌గా నిలువనుంది. పర్యాటక ఆకర్షణను దృష్టిలోపెట్టుకుని దీనిని తీర్చిదిద్దేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే జపాన్, దుబాయ్, సింగపూర్, స్పెయిన్ వంటి దేశాలతో పాటు ప్రపంచంలో పలు మానవ నిర్మిత బీచ్‌లు సందడి చేస్తున్న క్రమంలో దేశంలోనూ అదీ హైదరాబాద్‌లో ఈ ఆర్టిఫిషియల్ బీచ్ నిర్మితం కానుండడం విశేషం.
చారిత్రక నేపథ్యానికి కొదవలేదు.. సాంస్కృతిక వారసత్వానికీ లోటు లేదు. సంప్రదాయ వంటకాల సంపదకు కరవు లేదు.. ఆధునిక పార్టీ కల్చర్‌కూ అడ్డు లేదు.. ఇలా పర్యాటకులను ఆకట్టుకునే అనేక హంగులు ఉన్న నగరంలో చెప్పుకోదగ్గ లోటు అంటూ ఏదైనా ఉందంటే అది బీచ్ ఒక్కటే అని చెప్పాలి. ఇప్పుడు ఆ వెలితిని కూడా పూడ్చే ప్రయత్నాలు షురూ అయ్యాయి. ప్రకృతి సిద్ధంగా మాత్రమే సాధ్యమయ్యే సాగర తీరపు అందాలను మానవ శక్తితో పునర్‌సృష్టించేందుకు ప్రతిపాదనలు సిద్ధమవుతున్నాయి.
ప్రస్తుతం, నగరానికి సమీపంలోని బీచ్ అంటే అది పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌లోని సూర్యలంక బీచ్ మాత్రమే. అది కూడా దాదాపు 320 కి.మీ దూరంలో ఉంది. అయితే తెలంగాణ తొలి మానవ నిర్మిత బీచ్ గచి్చబౌలి నుంచి కేవలం 20 కి.మీ దూరంలో కొలువుదీరనుంది. భూమి లభ్యత, ఔటర్ రింగ్ రోడ్ ద్వారా సులభంగా చేరుకోగలిగే రాకపోకల సౌలభ్యం కారణంగా కొత్వాల్ గూడను బీచ్ కోసం ఎంపిక చేశామంటున్నారు. దీనికి సంబంధించిన తుది ప్రాజెక్ట్‌ను అధికారులు సిద్ధం చేస్తున్నారు.
చెప్పుకోదగ్గ విశేషాలెన్నో..
మొత్తం 35 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు కానున్న ఈ బీచ్‌ను తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ దాదాపు రూ.225 కోట్ల నుంచి రూ.300 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్నట్లు సమాచారం. ఇసుక, నీరు మాత్రమే కాకుండా ఈ ప్రాజెక్టులో భాగంగా తేలియాడే విల్లాలు, లగ్జరీ హోటళ్లు, సాహస క్రీడలు, సెయిలింగ్, బంగీ జంపింగ్, స్కేటింగ్, వాటర్ స్పోర్ట్స్ ఏర్పాటు కానున్నాయి. ఇతర ఆకర్షణల్లో భాగంగా వేవ్ పూల్, ఫౌంటైన్లు, థియేటర్లు, రెస్టారెంట్లు, షాక్‌లు, సైక్లింగ్ ట్రాక్‌లు, పిల్లల కోసం ఆట స్థలాలు కూడా ఏర్పాటు చేయాలని యోచిస్తున్నారు.
ఫ్యూచర్ సిటీలో కూడా...
ఈ ప్రాజెక్టు సాకారమైతే, ఇది ప్రపంచ పర్యాటక ఆకర్షణగా మారుతుందని, హైదరాబాద్ స్థాయిని పెంచుతుందని అధికారులు విశ్వసిస్తున్నారు. దీనిలో పర్యావరణ అనుకూల నిర్మాణ పద్ధతులు ఖచి్చతంగా అమలు చేయనున్నారు. ఈ ప్రాజెక్ట్ అంతర్జాతీయ పెట్టుబడిదారులను కూడా ఆకర్షిస్తుందని అధికారులు ఆశిస్తున్నారు.
తాజా పరిణామాల నేపథ్యంలో ఫ్యూచర్ సిటీలోనూ ఒక అర్బన్ బీచ్ నిర్మించేందుకు ప్రముఖ అంతర్జాతీయ సంస్థ చాంపియన్స్ ఇన్‌ఫ్రాటెక్ ప్రతిపాదనలు సమర్పించింది. ఈ ప్రతిపాదనకు ఆమోద ముద్ర పడితే హైదరాబాద్‌కు ఒకటి కాదు రెండు బీచ్‌లు అందుబాటులోకి రావచ్చు. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో ఇప్పటికే కృత్రిమ బీచ్‌లు పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి. అలాంటి వాటిలో కొన్నింటిని అధికారులు పరిశీలిస్తున్నారు.
పారిస్ స్ఫూర్తితో..
ఫ్రెంచ్ రాజధాని సీన్ నదిని ఆనుకుని కృత్రిమ బీచ్‌లను సృష్టించిన పారిస్ ప్లేజెస్ ప్రాజెక్ట్ నుంచి సిటీ బీచ్ ఆలోచన ప్రేరణ పొందింది. తాము పారిస్ ప్లేజెస్ ప్రాజెక్ట్‌ను పరిశీలించామని, అక్కడ భౌగోళిక పరిస్థితులతో పోల్చే పరిస్థితులు అనుకూలంగా ఉన్న నగరం కాబట్టి, ఇక్కడ అదే రీతిలో బీచ్ సృష్టికి పారిస్ ప్లేజెస్ మాదిరి నమూనాను అనుసరించాలని భావిస్తున్నట్లు పర్యాటక శాఖ అధికారులు చెబుతున్నారు. అదే విధంగా మరికొన్ని కృత్రిమ బీచ్‌లు కూడా అంతర్జాతీయంగా పేరొందాయి.
దుబాయ్‌లోని పామ్ జుమేరాలో ప్రసిద్ధ మానవ నిర్మిత బీచ్‌లు ఉన్నాయి. ఇది విలాసవంతమైన రిసార్ట్‌లు, ప్రైవేట్ విల్లాలతో సందర్శకులకు ప్రత్యేకమైన విలాసవంతమైన అనుభవాన్ని అందిస్తుంది.
దుబాయ్‌లోని పామ్ జుమేరాలో ప్రసిద్ధ మానవ నిర్మిత బీచ్‌లు ఉన్నాయి. ఇది విలాసవంతమైన రిసార్ట్‌లు, ప్రైవేట్ విల్లాలతో సందర్శకులకు ప్రత్యేకమైన విలాసవంతమైన అనుభవాన్ని అందిస్తుంది.
బీచ్‌తో పాటు విందు, సకల వినోదాలకు కేరాఫ్
మాల్దీవ్స్ రాజధాని నగరం మాలేలోని తూర్పు తీరంలో కృత్రిమ బీచ్ క్రీడా కార్యక్రమాలు, కవాతు, కారి్నవాల్, ప్రత్యక్ష సంగీత ప్రదర్శనలను నిర్వహించడానికి అనుకూలమైన వేదికగా మారింది.
జపాన్‌లోని టోక్యోలో ఉన్న ఒడైబా సీసైడ్ పార్క్ పేరతో బీచ్ నిర్మించారు. టోక్యో బేలో ఒక ప్రసిద్ధ ప్రదేశంగా వినోద కార్యకలాపాలను అందిస్తుంది.
అమెరికాలోని మిసిసిపీలో బిలోక్సీ మరొక ప్రసిద్ధ బీచ్. ఇది గల్ఫ్ తీరం వెంబడి ఉన్న 26 మైళ్ల పొడవైన మానవ నిర్మిత తీరప్రాంతంలో ఇది ఒక భాగం.
సింగపూర్‌లోని 1,235 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న సెంటోసా మలేషియా నుంచి దిగుమతి చేసుకున్న ఇసుకను కలిగి ఉన్న మూడు షెల్టర్డ్ బీచ్‌లు ఉన్నాయి.
యూరప్‌లోని మొనాకో సిటీలో ఉన్న ఏకైక పబ్లిక్ బీచ్‌గా లార్వోట్టో బీచ్ పేరొందింది. రెస్టారెంట్లు, దుకాణాలు, కేఫ్‌లతో కళకళలాడే ఈ బీచ్‌లో కృత్రిమ ఇసుక కొంతవరకూ గులకరాళ్లలా ఉంటుంది. బీచ్‌కి వెళ్లేవారు దృఢమైన బూట్లు ధరించవలసి ఉంటుంది. పిల్లలు ఆట స్థలం కార్యకలాపాలు, బైక్ రైడ్‌లు ట్రాంపోలిన్ వినోదాన్ని అక్కడ ఆస్వాదించవచ్చు.
(చదవండి: కాలినడకన.. 27 ఏళ్లు.. 31 వేల మైళ్లు! అంటే.. ప్రపంచం చుట్టొచ్చాడా?)


