పర్యావరణ హిత మష్రూమ్‌ ఫర్నీచర్‌..! జస్ట్‌ 180 రోజుల్లోనే.. | Furniture From Mushrooms | Sakshi
Sakshi News home page

పర్యావరణ హిత మష్రూమ్‌ ఫర్నీచర్‌..! జస్ట్‌ 180 రోజుల్లోనే..

Dec 15 2025 5:16 PM | Updated on Dec 15 2025 6:01 PM

Furniture From Mushrooms

ఫర్నీచర్‌ అనగానే చాలామటుకు ప్లాస్టిక్‌ ఏదో రూపంలో వినియోగిస్తున్నాం. ముఖ్యంగ కుర్చీలు, సోఫాసెట్‌ల వరకు అన్నింట్లో ప్లాస్టిక్‌ మయం. కాస్త డబ్బులు బాగా ఉంటే..మంచి వుడ్‌తో చేసిన ఫర్నీచర్‌ ఉపయోగిస్తారు. చాలా తక్కువ ఖరీదు కూడా. ఇలా అందరికీ అందుబాటులో ఉండే ప్లాస్టిక్‌ ఫర్నీచర్‌కి అడ్డుకట్ట వేసేలా ముంబైకి చెందిన దంపతులు విన్నూతన ఆవిష్కరణకు తెరలేపారు. భూమాతకు హానికరం కానీ మట్టిలో కలిసిపోయే ఫర్నీచర్‌ని అన్వేషించి మరి సరికొత్త ఆవిష్కరణకు పూనుకుని అందరిచేత ప్రశంసలందుకుంటున్నారు. ఇంతకీ వాళ్లు ఆ  ఫర్నిచర్‌ని ఏవిధంగా తయారు చేశారంటే..

మష్రూమ్‌తో ఫర్నిచర్‌ డిజైన్‌కి శ్రీకారం చుట్టారు ముంబైకి చెందిన భక్తి లునావత్‌, సుయాష్‌ సావంత్‌ దంపతులు. 2010లో ముంబైలోని ఒక ఆర్కిటెక్చర్ స్కూల్‌లో ఒకరికొకరు పరిచయమయ్యారు. అలా 2015లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి, ఇద్దరూ బార్సిలోనాలోని ఇన్‌స్టిట్యూట్ ఫర్ అడ్వాన్స్‌డ్ ఆర్కిటెక్చర్ ఆఫ్ కాటలోనియా (ఐఏఏసీ)కి పై చదువుల కోసం వెళ్లారు. చదువు పూర్తయ్యాక ఇద్దరి వేర్వేరు మార్గాల్లో పయనించారు. భక్తి స్పానిష్ ఆర్కిటెక్ట్ రికార్డో బోఫిల్‌తో కలిసి పనిచేస్తే.. సుయాష్ లిస్బన్‌లో ప్రాక్టీస్ చేశాడు. కానీ.. ఇద్దరూ 2022లో తిరిగొచ్చి ముంబైలో కలుసుకున్నారు. అదే సంవత్సరం వాళ్లు 'అనోమాలియా' పేరుతో స్టార్టప్‌ పెట్టారు.

సాధారణంగా కన్‌స్ట్రక్షన్‌, డిజైన్ ఇండస్ట్రీల నుంచి పెద్ద ఎత్తున వ్యర్థాలు వస్తుంటాయి. వాటిని తగ్గించే మార్గాల కోసం ఇద్దరు అన్వేషించారు. వారిద్దర్ని కలిపింది కూడా ఆ ఆలోచనే. అప్పుడే వాళ్లు మైసిలియం రీ జెనరేటివ్‌, సర్క్యులర్‌ నేచర్‌ గురించి తెలుసుకున్నారు. దాంతో ఫర్నిచర్‌ తయారుచేస్తే లైఫ్‌ స్పాన్‌ పూర్తి కాగానే బయోడీగ్రేడ్‌ అవుతుంది. అంటే నేచర్‌లో కలిసిపోతుంది. ఇతర ఫర్నిచర్‌ మెటీరియల్స్‌లా భూమిపై పేరుకుపోదని గుర్తించారు.

దీనిపై ప్రయోగాలు చేసేందుకు కరోనా టైం కలిసొచ్చింది. అప్పుడే వాళ్లు దీనిపై రీసెర్చ్, ప్రయోగాలు చేయడం మొదలుపెట్టారు. ముందుగా వాళ్లు కప్ కేక్ ట్రేల్లో మష్రూమ్స్‌ని పెంచారు. అవి తేలికగా ఉన్నప్పటికీ చాలా స్ట్రాంగ్‌గా ఉన్నాయి. అప్పటినుంచి వాటితో ఇటుకలు, పార్టిషన్స్‌, క్లాత్ తయారుచేశారు. చివరికి ఫర్నిచర్‌తో ప్రయోగాలు చేయడం మొదలుపెట్టారు.

ఇది పెరుగుతుందే గానీ..తయారవ్వదు..
ఇప్పుడు వాళ్లు అనోమాలియాలో ఫర్నిచర్ తయారుచేయడం లేదు. పెంచుతున్నారు. అందుకే 'గ్రోన్ నాట్ బిల్ట్' అనే ట్యాగ్‌లైన్‌తో ప్రొడక్ట్స్‌ని ప్రమోట్‌ చేస్తున్నారు. మైసిలియంని అగ్రికల్చర్ వేస్ట్‌తో కలిపి మాడ్యులర్ 'మైక్రోబ్లాక్‌లను' తయారుచేస్తారు. ప్రతి బ్లాక్ 1.5 కిలోల బరువు ఉంటుంది. కానీ, 1.5 టన్నుల కంప్రెసివ్ లోడ్‌ను తట్టుకోగలదు. ఈ బ్లాక్‌లను స్టూల్స్, టేబుళ్లు, అల్మారాలు.. ఇలా ఏ ఫర్నిచర్ తయారీలో అయినా వాడుకోవచ్చు. మరో ప్రత్యేకత ఏంటంటే.. దీంతో 'మైకోలైవింగ్' అనే మైసిలియం క్లాత్‌ని కూడా తయారుచేస్తున్నారు.

మైసిలియం ఓవర్‌ గ్రోత్‌ దశలో ఉన్నప్పుడు దాని పొరని ఒలిచి, ప్రాసెస్ చేసి సీటింగ్ కోసం ఉపయోగిస్తున్నారు. పెరిగిన మైసిలియం బ్లాక్స్‌ను కాల్చడం, ఎండలో ఆరబెట్టడం వల్ల అది చాలా స్ట్రాంగ్‌గా మారుతుంది. దానికి తేనె తెట్టె మైనం, లైమ్‌ ప్లాస్టర్ లాంటి న్యాచురల్ కోటింగ్స్‌ వేస్తారు. వీళ్లు తయారుచేసిన ప్రొడక్ట్స్‌ 10 నుంచి 12 సంవత్సరాల వరకు మన్నికగా ఉంటాయి. ఆ తర్వాత చెత్తలో వేస్తే 180 రోజుల్లో మట్టిలో కలిసిపోతాయి. అయితే ఈ పుట్టగొడుగులు పెంచడం అంత సులభం కాదు. 

అందుకు సవాళ్ల తోపాటు, ఓపిక చాలా అవసరం. ఆర్థికంగా కూడా ఈ స్థార్టప్‌ ప్రయాణం చాలా కష్టమే. ఇక భక్తి, సయాష్‌లు ఉద్యోగాలు చేసి సంపాదించింది మొత్తం ఇందులోనే పెట్టేశారు. అలాగే దీనికి గోద్రేజ్ లాంటి ఫెలోషిప్స్‌, గ్రాంట్ల వల్ల కొంత ఆర్థికసాయం కూడా తోడైంది. అలా 2022లో అనోమాలియాను ప్రారంభించారు. మొదట్లో తమ ప్రొడక్ట్‌ని కొంటారో లేదో అని భయపడ్డారు. కానీ మూడేళ్లకే వాళ్ల ప్రొడక్ట్స్‌కి మంచి గుర్తింపు లభించింది. 

2025లో అత్యంత ప్రతిష్టాత్మకమైన డిజైన్ వేదికల్లో ఒకటైన వెనిస్ బిన్నెలేలో చోటు దక్కించుకుంది. ప్రస్తుతం ఇండోనేషియాలోని ఎంవైసీఎల్‌ కంపెనీతో పార్ట్‌నర్‌షిప్‌ కుదుర్చుకున్నారు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద మైసిలియం ఉత్పత్తిదారుల్లో ఒకటి. ఇందులో రైతులను కూడా భాగస్వాములను చేయాలని చూస్తున్నారు ఇద్దరూ. వాళ్ల సాయంతోనే వ్యర్థాలను సేకరించి పర్యావరణానికి మేలుచేసే ఫర్నీచర్‌ ఉత్పత్తి చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందని చెబుతున్నారు భక్తి, సుయోష్‌లు.

(చదవండి: హనుక్కా పండుగ అంటే..? యూదులు ఎందుకింత ఘనంగా జరుపుకుంటారంటే..)

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement