సచిన్ టెండుల్కర్.. ఈ పేరుకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. అంతర్జాతీయ క్రికెట్‌లో శతక శతకాలు సాధించిన ధీరుడిగా అతడు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాడు. రెండున్నర దశాబ్దాల కెరీర్‌లో టీమిండియా తరఫున లెక్కకు మిక్కిలి రికార్డులు సాధించి క్రికెట్ గాడ్‌గా నీరాజనాలు అందుకున్నాడు సచిన్.
అయితే, తాను టీమిండియాకు ఎంపికయ్యే క్రమంలో సహచర ఆటగాడు ఒకరు తన కోసం చేసిన త్యాగం గురించి సచిన్ టెండుల్కర్ (Sachin Tendulkar) తాజాగా వెల్లడించాడు. అది 1989- 90 దేశీ క్రికెట్ సీజన్. ముంబైలోని వాంఖడే వేదికగా ఇరానీ కప్ మ్యాచ్‌లో రెస్టాఫ్ ఇండియా- ఢిల్లీ జట్లు తలపడుతున్నాయి.
సచిన్ కోసం విరిగిన చేతితోనే బ్యాటింగ్
రెస్టాఫ్ ఇండియాకు ఆడుతున్న సచిన్ సెంచరీకి చేరువలో ఉన్నాడు. ఇంతలో తొమ్మిదో వికెట్ పడింది. అప్పటికి బ్యాటింగ్‌కు రావాల్సిన ప్లేయర్ గాయపడ్డాడు. అతడు మరెవరో కాదు.. టీమిండియా మాజీ క్రికెటర్ గురుశరణ్ సింగ్ (Gursharan Singh). అతడు బ్యాటింగ్‌కు వస్తేనే సచిన్ తన శతక మార్కును అందుకోగలడు.
సచిన్ కోసం విరిగిన చేతితోనే బ్యాటింగ్ చేసేందుకు గురుశరణ్ సిద్ధమయ్యాడు. అతడి సహకారంతో సచిన్ సెంచరీ (103) పూర్తి చేసుకున్నాడు. ఆ మ్యాచ్ ద్వారా టీమిండియా సెలక్టర్ల దృష్టిని ఆకర్షించి జాతీయ జట్టు తరఫున అరంగేట్రానికి బాటలు వేసుకున్నాడు.
అతడి త్యాగం.. నా సెంచరీ
నాటి ఈ ఘటన గురించి సచిన్ టెండుల్కర్ తాజాగా గుర్తు చేసుకున్నాడు. ‘‘1989లో నేను ఇరానీ ట్రోఫీ ఆడుతున్న సమయం. టీమిండియా సెలక్షన్ కోసం ట్రయల్స్ జరుగుతున్నాయి. ఆ మ్యాచ్‌లో నేను 90 పరుగులు పూర్తి చేసుకుని సెంచరీ దిశగా పయనిస్తున్నా.
ఇంతలో తొమ్మిదో వికెట్ పడింది. నేను శతకం పూర్తి చేసుకుని జట్టు పరువు పోకుండా కాపాడాలని అనుకున్నా. కానీ బ్యాటింగ్‌కు రావాల్సిన గురుశరణ్ చెయ్యి విరిగింది. అయినప్పటికీ.. అప్పటి సెలక్షన్ కమిటీ చైర్మన్ రాజ్ సింగ్ దుంగర్పూర్ .. గురుశరణ్‌ను నాకు మద్దతుగా నిలవాల్సిందిగా కోరారు.

టీమిండియాకు సెలక్ట్ అయ్యాను
ఆయన మాట ప్రకారం గురుశరణ్ క్రీజులోకి వచ్చాడు. అతడి సాయంతో నేను సెంచరీ పూర్తి చేసుకుని.. టీమిండియాకు సెలక్ట్ అయ్యాను కూడా!.. ఆ తర్వాత గురుశరణ్ కూడా భారత జట్టుకు ఆడాడు. ఆరోజు గురుశరణ్ చూపిన ధైర్యం, ఔదార్యం మరువలేనివి.
డ్రెసింగ్‌రూమ్‌లో నేను గురుశరణ్‌కు అందరి ముందు ధన్యవాదాలు తెలిపాను. విరిగిన చెయ్యితో బ్యాటింగ్ చేయడం అంత తేలికేమీ కాదు. నా సెంచరీ పూర్తైందా? లేదా? అన్నది ముఖ్యం కాదు. ఆ సమయంలో అతడు చూపిన ధైర్యం, జట్టు కోసం పడిన తాపత్రయం నా హృదయాన్ని మెలిపెట్టాయి’’ అని సచిన్ టెండుల్కర్.. గురుశరణ్ పట్ల కృతజ్ఞతాభావం చాటుకున్నాడు.
మ్యాచ్ ఓడినా..
కాగా నాటి ఇరానీ కప్ మ్యాచ్‌లో ఢిల్లీ విధించిన 554 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో రెస్టాఫ్ ఇండియా బ్యాటింగ్ ఆర్డర్ కుప్పకూలింది. 209 పరుగులకే తొమ్మిది వికెట్లు కోల్పోయి కష్టాల్లో కూరుకుపోయింది.
ఈ క్రమంలో గురుశరణ్ సాయంతో ఆఖరి వికెట్‌కు సచిన్ మరో 36 పరుగులు జోడించగలిగాడు. ఇక 245 పరుగులకు రెస్టాఫ్ ఇండియా ఆలౌట్ కాగా.. ఢిల్లీ 309 పరుగుల తేడాతో జయభేరి మోగించింది. అయితే, మ్యాచ్ ఓడినా.. వ్యక్తిగత ప్రదర్శన దృష్ట్యా సచిన్‌కు టీమిండియా నుంచి పిలుపు అందింది.


