ముఖ్యమైన ప్రకటన.. టీమిండియాకు ఆల్‌రౌండర్లు కావలెను. అవును మీరు విన్నది నిజమే. ప్రస్తుత భారత క్రికెట్ జట్టులో నాణ్యమైన ఆల్‌రౌండర్ల లోటు కన్పిస్తోంది. స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్లగా రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, సుందర్ వంటి వారు ఉన్నప్పటికి.. పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ల విభాగంలో భారత్ చాలా వెనకబడి ఉంది.
ఒక్క హార్ధిక్ పాండ్యా తప్ప చెప్పుకోదగ్గ పేస్ బౌలింగ్ ఆల్ రౌండర్ భారత లేరు. అయితే హార్దిక్ ఫిట్‌నెస్ సమస్యల వల్ల ఎప్పుడు జట్టులో ఉంటాడో.. ఎప్పుడు బయట ఉంటాడో తనకే తెలియదు. నితీశ్ కుమార్ రెడ్డిని మూడు ఫార్మాట్లలో ఆల్‌రౌండర్‌గా తీర్చిదిద్దాలని ప్రయత్నిస్తున్నప్పటికి.. ఆశించినంతమేర ఫలితాలు మాత్రం రావడం లేదు.
మొదటిలో అతడిపై నమ్మకం ఉంచిన గంభీర్ అండ్ కో.. ఇప్పుడు ఎక్కువగా స్పెషలిస్ట్ బ్యాటర్‌గానే పరిగణిస్తోంది. టీ20 సెటాప్‌లో భాగంగా ఉన్న శివమ్ దూబే పరిస్థితి కూడా అంతంతమాత్రమే. SENA దేశాలతో పోలిస్తే మనం చాలా వెనకబడి ఉన్నాము.
గతంలో కపిల్ దేవ్, సౌరవ్ గంగూలీ వంటి ఫాస్ట్ బౌలింగ్ ఆల్‌రౌండర్లు ప్రపంచ క్రికెట్‌నే శాసించారు. కచ్చితంగా అటువంటి ఆల్‌రౌండర్లు భారత జట్టుకు అవసరం.
ఆల్‌రౌండర్ల ఉపయోగాలు ఏంటి?
జట్టు సమతుల్యంగా ఉండాలంటే కచ్చితంగా ఫాస్ట్ బౌలింగ్ ఆల్‌రౌండర్లు కావాలి. సౌతాఫ్రికా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా వంటి సేనా దేశాల విజయాలలో ఆల్‌రౌండర్లదే కీలక పాత్ర. ఒక్క ఆస్ట్రేలియాలోనే మిచెల్ మార్ష్, గ్రీన్, అబాట్, స్టోయినిష్ వంటి అద్బుతమైన పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్లు ఉన్నారు.
నిజమైన ఫాస్ట్-బౌలింగ్ ఆల్‌రౌండర్ లేకపోతే, జట్టు కూర్పు ఒక పెద్ద సమస్యగా మారుతుంది. టీమిండియా ఇప్పుడు ఇదే సమస్యను ఎదుర్కొంటుంది. ప్రతీ మ్యాచ్‌కు ప్లేయింగ్ ఎలెవన్ ఎంపిక ఒక సమస్యగా మారింది. అదనపు బ్యాటర్‌ను ఆడిస్తే బౌలింగ్ బలహీనపడుతుంది.
ఐదుగురు బౌలర్లతో ఆడితే బ్యాటింగ్ లైనప్ బలహీనంగా మారుతుంది. ఈ అసమతుల్యత కారణంగానే భారత్ విదేశాల్లో కీలక మ్యాచ్‌లు, టెస్ట్ సిరీస్‌లలో ఓడిపోయింది. భారత జట్టులో స్పిన్ ఆల్‌రౌండర్లు ఎక్కువగా ఉండడంతో ఎవరికి అవకాశమివ్వాలో తెలియక టీమ్ మెనెజ్‌మెంట్ తలలు పట్టుకుంటుంది.
జడేజా, అక్షర్ వంటి వారు ఉపఖండ పిచ్‌లోపై రాణిస్తున్నప్పటికి విదేశీ గడ్డపై బంతితో సత్తాచాటలేకపోతున్నారు. దీంతో విదేశీ పర్యటనలో ఫాస్ట్ బౌలింగ్ ఆల్‌రౌండర్ల లోటు స్పష్టంగా కన్పిస్తోంది.
శార్ధూల్ రీ ఎంట్రీ ఇస్తాడా?
బీసీసీఐ సెలక్టర్లు మరోసారి శార్ధూల్ ఠాకూర్ వంటి వెటరన్ ఆల్‌రౌండర్లను పరిగణలోకి తీసుకోవాల్సిన అసవరముంది. శార్ధూల్ జాతీయ జట్టుకు దూరంగా ఉంటున్నప్పటికి దేశవాళీ క్రికెట్‌లో మాత్రం దుమ్ములేపుతున్నాడు.
ఫార్మాట్లకు అతీతంగా ఠాకూర్ అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తున్నాడు. అతడిని తిరిగి జట్టులోకి తీసుకోవాలని చాలా మంది మాజీలు సూచిస్తున్నారు. ఈ ఏడాది ఇంగ్లండ్ పర్యటనలో అతడు రీ ఎంట్రీ ఇచ్చినప్పటికి ఓ మోస్తారు ప్రదర్శన చేశాడు. దీంతో అతడిని జట్టు నుంచి తప్పించారు. అయితే లార్డ్ ఠాకూర్ మరోసారి సత్తా చాటుతున్నప్పటికీ.. ఇప్పట్లో తిరిగి పునరాగమనం చేసే సూచనలు కన్పించడం లేదు.
అయితే, ఠాకూర్ మాత్రం కూడా వన్డే ప్రపంచకప్-2027లో ఆడాలన్న తన కోరికను వ్యక్తం చేశాడు. అతడితో పాటు రాజ్ అంగద్ బవా, సూర్యాంశ్ షెడ్గే వంటివారిపై కూడా సెలక్టర్లు దృష్టిసారించాల్సి ఉంది. అండర్-19 ప్రపంచకప్‌లో రాజ్ అంగద్ బవా బంతితో పాటు బ్యాట్‌తో కూడా అద్భుతంగా రాణించాడు. సూర్యాంశ్‌కు కూడా సీమ్-బౌలింగ్ ఆల్‌రౌండర్‌గా రాణించే సత్తా ఉంది.
చదవండి: IND vs SA: టీమిండియాకు భారీ షాక్..!


